బైక్‌ మీద.. కార్‌లో..కంప్యూటర్‌ ముందు.. కంఫర్టబుల్‌గా కూర్చోండి | family health counciling | Sakshi
Sakshi News home page

బైక్‌ మీద.. కార్‌లో..కంప్యూటర్‌ ముందు.. కంఫర్టబుల్‌గా కూర్చోండి

Published Thu, Dec 7 2017 11:50 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

family health counciling - Sakshi

లైఫ్‌స్టయిల్‌ కౌన్సెలింగ్‌

నా వయసు 28 ఏళ్లు. బైక్‌పై ఎక్కువగా తిరుగుతుంటాను. నాకు తీవ్రమైన నడుం నొప్పి వస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.         
– జి. సుధాకర్, హైదరాబాద్‌

ఈ వయసులో నడుం నొప్పి అంత సాధారణం కాదు కాబట్టి బైక్‌ నడపడంలో మీరు అనుసరిస్తున్న కొన్ని అంశాల వల్ల ఈ నొప్పి వస్తుండవచ్చు. సాధారణంగా బైక్‌ల తయారీదారులు హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్‌ వంటి అంశాల్లో కొన్ని ప్రమాణాలను  పాటిస్తుంటారు. మీ బైక్‌ ఆ ప్రమాణాలకు అనుగుణంగా తయారైనదైతే మంచిదే. వాటిని అనుసరించడం వల్ల కొన్ని అవయవ సమస్యలు రావు. ఒకవేళ మీ బైక్‌లోని వివిధ అంశాలు  సరైన ప్రమాణాలు లేకపోతే వాటివల్లనే మీకు నడుము నొప్పి వస్తోందని భావించాలి. మీరు మీ బైక్‌ విషయంలో ఈ కింద పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు పాటించండి.బైక్‌ల హ్యాండిల్స్‌ సాధారణంగా తగినంత విశాలంగా, రెండు చేతులు బాగా పట్టుకోవడానికి వీలైనంత నిడివితో ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్‌హ్యాండిల్స్‌ వల్ల ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ.మనం కాళ్లు పెట్టుకునే ఫుట్‌రెస్ట్‌ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. దీనివల్ల కాళ్లు సాగినట్లుగా అయిపోయి నడుముపై భారం ఎక్కువగా పడుతుంది. దాంతో నడుమునొప్పి రావచ్చు.బైక్‌పై కూర్చొనే సమయంలో వీపు భాగమంతా నిటారుగా ఉండి, మన వెన్ను ఒంగకుండా ఉండాలి. సాధారణ బైక్‌ల నిర్మాణం ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని స్పోర్ట్స్‌ బైక్‌లలో సీట్లు ఏటవాలుగా ఉండి, మనం కూర్చొనే భంగిమ వాలుగా ఉండేలా నిర్మితమై ఉంటాయి. దాంతో ముందుకు వాలినట్లుగా కూర్చోవాల్సి వస్తుంది. ఇలా వాలిపోయినట్లుగా కూర్చొనేలా రూపొందించిన ఫ్యాషన్‌ బైక్స్‌ వల్ల మన వెన్ను నిటారుగా నిలపలేకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. బైక్‌లపై వెళ్లేవారు వీపుపై ఉండే బ్యాగ్స్‌ (బ్యాక్‌ప్యాక్స్‌) పెట్టుకొని వెళ్తుండటం సాధారణం. ఈ భారం నడుంపైనా భారం పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇలాంటివారు ఆ బ్యాగ్‌ భారం వీపుపై కాకుండా సీట్‌పై పడేలా చూసుకోవాలి.   మీ బైక్‌లో పైన పేర్కొన్న భాగాల అమరిక, మీరు కూర్చొనే భంగిమ ఎలా ఉందో పరీక్షించుకొని, లోపాలు ఉన్నట్లయితే సరిచేసుకోండి. మీ నొప్పి దూరం కావచ్చు. అప్పటికీ నడుం నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించండి.

నేను ఇంతకుముందు బైక్‌ నడుపుతుండే వాణ్ణి. కొన్నాళ్ల తర్వాత తీవ్రమైన నడుము నొప్పి వచ్చింది.  కారు ఉపయోగించమని డాక్టర్‌ సలహా ఇచ్చారు. నాకు ఉన్న సమస్య నేపథ్యంలో కారు డ్రైవింగ్‌లో సీటింగ్‌ విషయంలో ఏమైనా జాగ్రత్తలు పాటించాలా? – పి. రవికుమార్, విశాఖపట్నం
నడుమునొప్పికి టూవీలర్‌ డ్రైవింగ్‌ ఎలా కారణమవుతుందన్న అంశంపై చాలా అధ్యయనాలు ఉన్నాయి. అయితే కారు డ్రైవ్‌ చేసేవారిలోనూ నడుమునొప్పి వంటి సమస్యలు వస్తాయని ఒక స్వీడిష్‌ అధ్యయనం పేర్కొంటోంది. అందుకే కారు డ్రైవింగ్‌ సమయంలోనూ సీట్‌లో కూర్చునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి...∙మీ కాళ్ల పొడవుకు అనుగుణంగా సీట్‌ను మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి ∙ మీ ఎత్తునకు అనుగుణంగా సీట్‌ ఎత్తును అడ్జెస్ట్‌ చేసుకోవాలి ∙మీ సీట్‌ను నిటారుగా ఉంచేలా చూసుకోవాలి లేదా అది మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా సీట్‌ ఒంచాలి. ఆ సీట్‌ ఒంపు ఎంత అవసరం అని తెలియాలంటే ఒకటే కొండగుర్తు... ఆ ఒంపు మీ నడుము మీదగానీ మీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా ఉండాలి ∙ మీ నడుము దగ్గర ఉండే ఒంపు (లంబార్‌) భాగంలో ఒక కుషన్‌ ఉంచుకోవాలి. ఆ లంబార్‌ సపోర్ట్‌ వల్ల నడుమునొప్పి చాలావరకు తగ్గుతుంది ∙ మెడ మీద ఒత్తిడి పడని విధంగా మీ హెడ్‌రెస్ట్‌ ఉండాలి ∙ సీట్‌లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ మీ పొజిషన్‌ కాస్త మారుస్తూ ఉండాలి ∙ అదేపనిగా డ్రైవ్‌ చేయకుండా మధ్య మధ్య కాస్త బ్రేక్‌ తీసుకుంటూ ఉండండి ∙ ఇక డ్రైవ్‌ చేస్తున్నప్పుడు సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవడం మీకు అన్ని విధాలా మేలు చేస్తుందని గుర్తించండి.

ఆఫీసులోకి వచ్చాక నేను నా కంప్యూటర్‌ ముందు కూర్చున్నాననంటే మళ్లీ సాయంత్రం వరకూ లేవను. అయితే అంతంతసేపు కూర్చొనే ఉండటం మంచిది కాదని ఫ్రెండ్స్‌ అంటున్నారు. వాళ్ల మాటలతో నాలో ఆందోళన పెరుగుతోంది. వారనేది వైద్యపరంగా కరక్టేనా? – మంజీర, గుంటూరు
కూర్చొని పనిచేసే వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా కూర్చొనే ఉండటం చాలా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఇలా  సుదీర్ఘకాలం పాటు కూర్చొనే ఉండటం అన్నది టైప్‌–2 డయాబెటిస్, ప్రాణాంతకమైన గుండెజబ్బులు, కొన్నిరకాల క్యాన్సర్లకూ కారణమవుతుంది. కూర్చునే వృత్తుల్లో ఉన్నా లేదా ప్రయాణాలు చేసే వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా సీట్లో చాలాసేపు కూర్చోవడం, లేదా టీవీని వదలకుండా చూస్తూ కూర్చోవడం, వృత్తిపరంగా బైక్‌మీద చాలాసేపు కూర్చొనే ప్రయాణం చేస్తూ ఉండటం వంటి అనేక అంశాలు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. పొగతాగడం వంటి దురలవాటు ఎంత దుష్ప్రభావం చూపుతుందో, ఇలా కూర్చొనే ఉండటం అన్న అంశం కూడా అంతకంటే ఎక్కువ దుష్ప్రభావమే చూపుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించిన వాస్తవం. ప్రతివారు రోజూ కనీసం 30 – 45 నిమిషాల పాటు వాకింగ్‌ చేయడం అవసరం.

పిల్లలు ఎక్కువగా టీవీ చూడటం, కంప్యూటర్‌ గేమ్స్‌లో నిమగ్నం కావడం అనే కారణాలతో అదేపనిగా కూర్చొనే ఉంటారు. ఇక పెద్దలు తమ ఆఫీసు పనుల్లో మునిగిపోయి కూర్చొనే ఉంటారు.
కొన్ని సూచనలు ∙అదేపనిగా కూర్చోవడాన్ని బ్రేక్‌ చేయడం కోసం ఈ కింది సూచనలు పాటించాలి ∙మీ బెడ్‌రూమ్స్‌లో టీవీ / కంప్యూటర్‌ / ల్యాప్‌టాప్‌ లను ఉపయోగించకండి ∙మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒంటికి పనిచెప్పే ఏదో పనిని ఎంచుకోండి ∙పిల్లలకు మీరు ఇచ్చే బహుమతుల్లో పిల్లలకు శారీరక ఆరోగ్యం చేకూర్చే బంతులు / ఆటవస్తువుల వంటివి ఉండేలా చూసుకోండి ∙మీరు ఆఫీసుకు వచ్చే ముందర లోకల్‌ బస్సుల్లో, లోకల్‌ ట్రైన్స్‌లో ప్రయాణం చేసేవారైతే ఆ టైమ్‌లో కూర్చుని ప్రయాణం చేయకండి ∙ఎస్కలేటర్‌ వంటి సౌకర్యం ఉన్నా మెట్లెక్కండి ∙రోజూ కనీసం 30 నిమిషాలు నడవాలని నియమం పెట్టుకోండి ∙మీ వర్క్‌ ప్లేస్‌తో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు అటూ ఇటూ నడుస్తూ మాట్లాడండి ∙మీ పనిలో కాసేపు కాఫీ లేదా టీ బ్రేక్‌ తీసుకోండి ∙మీకు దగ్గరి కొలీగ్స్‌తో మాట్లాడాల్సి వస్తే మొబైల్‌ / మెయిల్‌ ఉపయోగించకండి. వారి వద్దకే నేరుగా వెళ్లి మాట్లాడంyì  ∙టీవీ చూడటం కంటే మంచి హాబీని పెంపొందించుకోండి.
డాక్టర్‌ సుధీంద్ర ఊటూరి, లైఫ్‌స్టైల్‌ నిపుణులు, కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement