అందాల సురభామినిని ఆడించిన వాడితడే | Famous Dance Master Srinu Dies In Chennai | Sakshi
Sakshi News home page

అందాల సురభామినిని ఆడించిన వాడితడే

Published Mon, Oct 14 2019 1:06 AM | Last Updated on Mon, Oct 14 2019 1:06 AM

Famous Dance Master Srinu Dies In Chennai - Sakshi

ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ హీరాలాల్‌ శిష్యుడు, పదిహేను వందలకు పైగా చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చిన శ్రీను మాస్టర్‌ (82) చెన్నయ్‌లోని టి.నగర్‌ నివాసంలో ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. శ్రీను మాస్టర్‌ తల్లిదండ్రులు లక్ష్మీ దేవమ్మ, నారాయణప్ప. ఆయనకు భార్య (ఉమాదేవి), ఇద్దరు కుమార్తెలు, కుమారుడు విజయ్‌ శ్రీనివాస్‌ ఉన్నారు. విజయ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. శ్రీను మాస్టర్‌ నృత్య దర్శకులుగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. డాక్టరేట్‌ అందుకున్నారు. ఇటీవలే ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలవి.

‘‘మా సొంత ఊరు కర్నూలు జిల్లా ఆదోని. 1956 అక్టోబర్‌లో మా అక్కయ్య నన్ను తనకు తోడుగా మద్రాసు తీసుకొచ్చారు. రెండు మూడురోజుల్లో పంపేస్తానన్నారు. నెలలు గడిచిపోయినా నన్ను పంపలేదు. హీరాలాల్‌ మాస్టారు మాకు దగ్గర్లోనే ఉండేవారు. సినిమా పాటలకు డ్యాన్స్‌లు ఇంట్లోనే రిహార్సల్స్‌ చేసేవారు. అవి చూస్తూ నేను ఏదో ఆడుతూ ఉండేవాడిని. నన్ను ఆయన గమనించారు. మా బావగారి మేనమామ  గురు సుందర్‌ప్రసాద్‌ (ఢిల్లీ రవీంద్రభారతిలో కథక్‌ ప్రిన్సిపాల్‌) గారి దగ్గర నాకు కథక్‌ నేర్పించారు.ఆయనే నాకు ప్రథమ గురువు. ఆ తరవాత ఈశ్వర్‌లాల్‌ మాస్టారు దగ్గర సినిమా నాట్యం నేర్పించారు.

ఒకరోజు హీరాలాల్‌ గారు నన్ను జెమినీ స్టూడియోకి తీసుకెళ్లారు. అక్కడ పద్మిని, జెమినీ గణేశన్‌లను చూశాను. అప్పుడే నటీనటులను నేరుగా చూడటం. ఆ రోజు హీరాలాల్‌ మాస్టర్‌ డ్యాన్స్‌ చేసి, నా వంక వేలు చూపుతూ ‘అర్థమయ్యిందా’ అని అడిగి, వెంటనే నన్ను చేయమన్నారు. నాకు తోచినట్లుగా చేశాను. పద్మినిగారు ప్రశంసించారు. ఆ తర్వాత జెమినీ ఎస్‌.ఎస్‌.వాసన్‌గారు నాకు అవకాశం ఇచ్చారు. ‘వహ్ని కోటై్ట వాలిబన్‌’ చిత్రాన్ని తమిళ, హిందీ భాషలలో తీసినప్పుడు తెలుగులోకి దానిని ‘విజయకోట వీరుడు’ గా డబ్‌ చేశారు.

1958లో విడుదలైంది. అందులో పద్మిని, వైజయంతిమాలకు పోటీ పాట ఉంటుంది. ఆ డ్యాన్స్‌ నేను కంపోజ్‌ చేసిందే. అది ఒక సెన్సేషన్‌. 1968లో విడుదలైన ‘నేనంటే నేనే’ నా మొదటి సొంత నృత్య దర్శకత్వ సినిమా. డూండీగారు నన్ను డ్యాన్స్‌ మాస్టర్‌గా తెలుగు తెరకు పరిచయం చేశారు. అలా నా కెరియర్‌ 1968లో ప్రారంభమై, 2013 దాకా కొనసాగింది. ఇంత కెరీర్‌లో వందకు పైగా దర్శకులతో, తొమ్మిది భాషలలో పనిచేశాను. నేను చేసిన ఆఖరి చిత్రం గోపీచంద్, నయనతారలతో. ఆ సినిమా విడుదల కాలేదు. విడుదలైన సినిమాలలో ‘శ్రీరామరాజ్యం’ ఆఖరిది. ఆ చిత్రంతో లెక్కవేసుకుంటే పదిహేను వందల సినిమాల కంటే ఎక్కువ సినిమాలకు నృత్య దర్శకత్వం వహించాను.

నటీనటులతో అనుభవాలు
చిరంజీవి మంచి ఫ్లెక్సిబిలిటీ ఉన్న నటుడు. అతను భరత నాట్యం నేర్చుకోకపోయినా ‘శివుడు శివుడు శివుడు’ సినిమాలో అద్భుతంగా నర్తించాడు. ‘అగ్నిపూలు’ సినిమాలో జయప్రద స్టేజీ మీద చేసే ‘పాము – నెమలి’ పాటను ఆరు రోజులు తీశాను. ఆ డ్యాన్స్‌లో ఒళ్లంతా కలిపి ఒకే డ్రెస్‌. కాని ఆ పాట కోసం ఒకేలాంటివి ఐదు కుట్టించాం. ఏ రోజుకారోజు చిరిగిపోతూ ఉండేది. ఆరు రోజులకు ఐదు కుట్టించాం. ఆవిడ ఎంత కష్టపడ్డారో పాటను చూస్తే అర్థమవుతుంది.‘యమగోల’లోని ‘ఆడవె అందాల సురభామిని’ పాటను రెండు రోజుల్లోనే తీసేశాను. స్వర్ణకమలంలోని ‘శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ’ ను మూడు రోజులలో తీశాను. ఆ పాటకు నాకు మొదటి నంది అవార్డు వచ్చింది. ‘అగ్నిపూలు’ పాటకు సితార అవార్డు వచ్చింది.

1968లో డ్యాన్స్‌మాస్టర్‌నైతే 1981లో నాకు అవార్డు వచ్చింది! ఎన్‌.టి.ఆర్‌.కి డ్యాన్సులు నేనే మొట్టమొదటగా ‘ఎదురులేని మనిషి’ చిత్రంతో ప్రారంభించాను. ఈ సినిమాలో బెల్‌బాటమ్స్, పెద్ద పెద్ద కాలర్లు. రామారావుగారిని ఒప్పించి చేయించాను. ఆయన సంతోషపడ్డారు. నన్ను కంటిన్యూ చేయమన్నారు. ఆయన ఏ షాట్‌ చేసినా నేను ఓకే అంటేనే ఒప్పుకునేవారు. లేదంటే మళ్లీ చేసేవారు. నిజానికి.. డ్యాన్స్‌ కోసమే పుట్టిన పసుమర్తి, వెంపటి సత్యం వంటి వారున్న సందర్భంలో నన్ను ఎందుకు తీసుకోవాలి? ఒక కొత్తదనం కావాలనుకుంటారు. అంతే.

చిన్న చిన్న ఇబ్బందులు
‘నేనంటే నేనే’ చిత్రంలో కాంచనకు రెండు ఇబ్బందులు, కృష్ణకి ఒక ఇబ్బంది కలిగాయి.  కారులోనే చిన్న చిన్న మూమెంట్‌ చేయాలి. ఆయన పొడుగుకి బెండ్‌ అయ్యి చేయడం ఇబ్బంది అయిపోతుంది. ఒక దెయ్యం పాటలో కొన్ని హార్డ్‌ మూమెంట్స్‌ ఉంటాయి. చీరలో చాలా ఇబ్బంది పడుతూ చేశారు కాంచన. తప్పనిసరి కాబట్టి సహకరించారు కాంచన.  గీతాంజలితో మహాబలుడులో ఒక క్లాసికల్‌ డ్యాన్స్‌ చేయించాను. మోకాళ్ల మీద కూర్చుని చేయడానికి ఇబ్బంది పడినా చెప్పింది చెప్పినట్లు చక్కగా చేశారు.  ఒక్క క్లాసికల్‌ మాత్రమే కాదు ఫోక్, వెస్ట్రన్‌ అన్నీ చేశాను.

ఒక గమ్మత్తయిన విషయం
కృష్ణగారి కురుక్షేత్రం, దానవీరశూరకర్ణ చిత్రాలకు నన్ను పెట్టుకోలేదు. నాకు క్లాసికల్‌ డ్యాన్స్‌లు రావనుకున్నారు. అప్పటికి నేను జ్యోతిలక్ష్మి, జయమాలిని వంటి వారికి క్లబ్‌ డ్యాన్సులు చేసేవాడిని. దానవీరశూరకర్ణకు వెంపటి గారిని, కురుక్షేత్రం చిత్రానికి పసుమర్తి, హీరాలాల్, చిన్ని సంపత్‌ ముగ్గురిని పెట్టుకున్నారు. మా గురువుగారు ఒక పాట చేశాక హిందీలో బిజీగా ఉండటంతో ఇంక చేయలేకపోయారు. అప్పుడు కమలాకర కామేశ్వరరావు ఇబ్బంది పడుతూనే నన్ను పెట్టుకున్నారు. డ్యాన్స్‌ చూశాక అందరూ మెచ్చుకున్నారు. క్లాసికల్‌కి నేను పనికిరాను అనుకున్న వారంతా నాతో క్లాసికల్‌ చేయించుకోవడం మొదలుపెట్టారు.
సంభాషణ: వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement