నేడు ఫాదర్స్ డే
అమ్మ నిజమైతే... నాన్న నమ్మకం అంటారు.
కానీ, నిజానికి... పిల్లలకు తమ మీద తమకు నమ్మకాన్నీ, ఎంత నష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యాన్నీ ఇచ్చేది నాన్నే!
కొండంత కష్టాన్ని కూడా గుండెల్లో దాచుకొని...
ఆ ఊసే ఎత్తకుండా పిల్లల్ని బంగారంలా పెంచేదీ నాన్నే!
పిల్లల కెరీర్ కోసం తన కెరీర్‌నే పణంగా పెట్టిన ఓ తండ్రి...
లేకలేక పుట్టిన పిల్లల పసితనంలోనే వసివాడిన ఓ నాన్న...
‘జీవితంలో జాగ్రత్త’ అంటూనే, విధి చేతిలో ఓడిన ఓ ‘అప్పా’...
వృత్తి రీత్యా డెరైక్టర్, రైటర్, హీరో...
కన్నబిడ్డలకు మాత్రం కలల్లోనే మిగిలిన దేవుళ్ళు...
బిడ్డలు తన కన్నా బాగుండాలని పరితపిస్తూ... అనుక్షణం వేలు పట్టుకొని నడిపించే అలాంటి నాన్న అకస్మాత్తుగా ఆ వేలును వదిలేస్తే? అనుక్షణం నాన్న జ్ఞాపకాలతో గడుపుతున్న
ఆ పిల్లలెలా ఉంటారు?
అలాంటి మూడు కుటుంబాలలో...
తండ్రుల గురించి వారి పిల్లల తలపోతలు...
పంచుకున్న జ్ఞాపకాల కలబోతలు... ఇవాళ్టి ‘ఫాదర్స్ డే’ స్పెషల్.
పరిశ్రమలో స్టార్ డెరైక్టరైనా, పిల్లలకు స్నేహితుడి లాంటి తండ్రి ఈవీవీ సత్యనారాయణ. ఆయన క్యాన్సర్‌తో కన్నుమూసి, మూడేళ్లైనా పిల్లలు రాజేశ్, నరేశ్‌లకు ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు కళ్లలో సుళ్ళు తిరుగుతున్నాయి.
మీ నాన్న గారు ఉన్నప్పటి రోజులకీ, ఇప్పటికీ మీరు గమనించిన తేడా?
నరేశ్: చాలా తేడా ఉందండీ. ఆయన ఉన్నప్పుడు మా ఇల్లు సాక్షాత్ వైకుంఠంలా ఉండేది. ఇప్పుడు దేవాలయంలా ఉంది. అంతే.
ఆర్యన్ రాజేశ్: ఇల్లంతా హడావిడే. వచ్చేవాళ్లూ, పోయేవాళ్లూ.. క్షణం తీరిక లేకుండా ఉండేవాళ్లం. ఇప్పుడా లోటును నరేశ్ భర్తీ చేస్తున్నాడు.
మీ నాన్న ఈవీవీ గారిలో మీరు గమనించిన ప్రత్యేకత ఏంటి?
నరేశ్: ఉజ్జ్వలమైన భవిష్యత్తు కంటి ముందు కనిపిస్తున్నప్పుడు దాన్ని ఎవరి కోసం ఎవరూ త్యాగం చేయరు. కానీ... నాన్న అలా కాదు. కెరీర్ ఉచ్చస్థితిలో ఉండగా, అగ్రహీరోలందరూ ఆయన దర్శకత్వంలో నటించడానికి సిద్ధంగా ఉండగా.. ఆ అవకాశాలన్నింటినీ మా కోసం పక్కన పెట్టేశారు. విలువైన సమయాన్నంతా మా కోసం ఖర్చు పెట్టారు. ‘రాజేశ్‌నీ, నరేశ్‌నీ సక్సెస్‌ఫుల్ స్టార్లుగా నిలబెట్టాలి’ అనే లక్ష్యంతో శ్రమించారు. నన్ను హీరోగా పెట్టి 9 సినిమాలు రాజేశ్ హీరోగా మూడు సినిమాలు చేశారు.
ఆర్యన్: నాన్నతో నా కన్నా నరేశ్‌కి చనువెక్కువ. ఒక ఫ్రెండ్‌గా మాతో మసలుకొనేవారు. మాకేదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించేవారు.
నరేశ్: లవ్‌లెటర్ల గురించి కూడా నాన్నతో ప్రస్తావించేవాళ్లం. ‘ఫలానా అమ్మాయి లవ్‌లెటర్ ఇచ్చింది నాన్నా!’ అంటే, ‘ఔనా. అలాంటివి వద్దు నాన్నా! ఇది కరెక్ట్ టైమ్ కాదని ఆ అమ్మాయితో చెప్పు’ అని చెప్పేవారు.
మీ ఇద్దరి విషయంలో ఆయన ఆలోచనా ధోరణి ఎలా ఉండేది?
నరేశ్: నాన్న తన తదనంతరం నన్ను డెరైక్టర్‌ని చేయాలనుకున్నారు. రాజేశ్‌నేమో హీరోను చేయాలనుకున్నారు. ఎందుకంటే వాడు బావుంటాడు. నేను అంత బావుండను. అందుకే నన్ను ప్రొడక్షన్‌లో కూడా పెట్టేశారు. ‘చాలాబాగుంది, మా ఆవిడ మీద ఒట్టు.. మీ ఆవిడ చాలా మంచిది’ చిత్రాలకు నేను దర్శకత్వ శాఖలో పనిచేశాను. కానీ నా దృష్టి మొత్తం నటనపైనే ఉండేది. ఓ రోజు ‘నటించాలనుంది నాన్నా...’ అని డెరైక్ట్‌గా అడిగేశాను. చివరకు నన్ను నిరుత్సాహపరచడం ఇష్టం లేక రాజేశ్‌తో పాటు నన్ను కూడా దేవదాస్ కనకాలగారి ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు.
రాజేశ్: ‘ఇంతమందికి జీవితాన్నిచ్చిన నేను.. నా బిడ్డకు సరైన బ్రేక్ ఇవ్వలేకపోయానే’ అని బాధపడేవారు నాన్న. నిజానికి ఆయన నాకు ‘ఎవడిగోల వాడిది’ రూపంలో భారీ విజయాన్నిచ్చారు. తర్వాత కూడా నేను బిజీ కాలేకపోయానంటే అది కేవలం విధి. చనిపోయే ముందు కూడా నాతో ‘బురిడి’ తీశారు. మా నాన్న లాంటి తండ్రులు అరుదుగా ఉంటారు.
నరేశ్:‘అల్లరి’ తర్వాత నా సినిమాలన్నీ ఫ్లాపులయ్యాయి. ‘వీడు వన్ సినిమా వండర్’ అనేశారంతా. కానీ... నాన్న మాత్రం కసితో ‘కితకితలు’ తీశారు. ఆ సినిమా నా కెరీర్‌కు పెద్ద బ్రేక్ అయ్యింది.
మీ చిన్నతనంలో ఎప్పుడైనా నాన్న మిమ్మల్ని కొట్టారా?
నరేశ్: అయిదేళ్లపాటు రాజేశ్ మా నాన్నమ్మ దగ్గరే పెరిగాడు. అందుకే నాన్నకు నేను క్లోజ్. ఆయన ప్రేమను ఎక్కువగా అనుభవించిన అదృష్టం నాదే. అందుకే ఆయనతో దెబ్బలు కూడా ఎక్కువ నేనే తిన్నాను. రాజేశ్‌ను అసలు కొట్టేవారే కాదు. వాడు నాన్నలాగే సెన్సిటివ్. ఆ విషయం నాన్నకీ తెలుసు. పైగా వాడు చెప్పిన మాట వినేవాడు. నేనేమో ‘గాలిశీను’ టైపు. అందుకే నాకు పడేవి.
మీ నాన్నపై మీకెప్పుడైనా కోపం వచ్చిందా?
నరేశ్: అవకాశాల కోసం నాన్న దగ్గరకు చాలామంది వచ్చేవాళ్లు. అయితే... నాన్న మాత్రం వాళ్లను ‘రేపు రండి, ఎల్లుండి రండి’ అని తిప్పించుకుంటూ ఉండేవారు. ఎందుకిలా చేస్తారని ఆయననే నేరుగా అడిగేశాను. దానికి నాన్న జవాబిస్తూ, ‘అడగ్గానే అవకాశం ఇవ్వకూడదు నాన్నా! ‘లక్... బై ఛాన్స్’ అనుకొని వచ్చే వారికి అవకాశం ఇస్తే మన మంచితనం వృథా అయిపోతుంది. వృత్తే జీవితమనుకొనేవాళ్ళు ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు వస్తారు. వారికి తప్పకుండా అవకాశం దొరుకుతుంది. అదంతా నేను పెట్టే చిన్న పరీక్ష.. అంతే’ అన్నారు. నిజానికి నాన్న ఎందరికి జీవితాన్నిచ్చారో అందరికీ తెలుసు. ఆయనపై అనుమానం రావడం నా అజ్ఞానం.
తొలి సినిమా ఫ్లాపైనప్పుడు మీ నాన్న గారి మానసిక స్థితి..?
రాజేశ్: ఆ టైమ్‌కి మేమిద్దరం పెద్ద పిల్లలమే. అయితే... ఆయన సమస్యలేవీ మా దాకా తీసుకొచ్చేవారు కాదు. బాధలేమైనా ఉంటే అమ్మతోనే చెప్పేవారు. మాకు ఆనందాన్నే పంచేవారు. మాకు కష్టాలను పరిచయం చేసి బాధపెట్టడం నాన్నకు ఇష్టం లేదు.
నరేశ్: తొలి సినిమా ‘చెవిలో పువ్వు’ విడుదలైన రోజే నాన్న వైజాగ్ నుంచి రాజమండ్రి బయలుదేరారట. ట్రైన్ ఎక్కే ముందే సినిమా ఫ్లాప్ అని తెలిసింది. ఆశలన్నీ నేలకూలిపోయాయి. ఇక బతకడం వేస్ట్ అనుకున్నారట. ట్రైన్ గోదావరి బ్రిడ్జి మీదకు వచ్చింది. బ్రిడ్జి మీదకు జంప్ చేద్దాం అనుకునే లోపు నేనూ, రాజేష్ గుర్తొచ్చామట. ‘పిల్లలు అన్యాయం అయిపోతారు. ఇంకో ప్రయత్నం చేస్తే తప్పేంటి?’ అనుకొని మళ్లీ అసిస్టెంట్ డెరైక్టర్‌గా జాయిన్ అయ్యారట (చెమర్చిన కళ్లతో).
నాన్న గుర్తొస్తే మీకు ఏమనిస్తుంది?
నరేశ్: నాన్న లేని లోటు భర్తీ అవ్వడం జరగదు. వంశాన్ని ఉద్ధరించేవాణ్ణి వంశోద్ధారకుడు అంటాం. మా వంశోద్ధారకుడు నాన్న. మమ్మల్ని అదృష్టవంతుల్ని చేసి, ఆయన అనంత వాయువుల్లో కలిసిపోయారు.
చివరి ఘడియల్లో దేని గురించి ఎక్కువగా మాట్లాడేవారు?
నరేశ్: క్యాన్సర్ అని తెలిసినా కంగారు పడలేదు. చాలా ధైర్యంగా ఉన్నారు. ఆయన ఆలోచన అంతా రాజేశ్‌గాడి పెళ్లి గురించే. చివరి రోజుల్లో ఆయనతో ఎక్కువ గడిపింది రాజేశే. అప్పుడు ఆయన అన్న మాట నాకింకా గుర్తు. ‘రాజేశ్‌గాడు ముభావంగా ఉంటాడు. వాడి మనసులోని ఆంతర్యాన్ని కనుక్కోవడం కష్టం. బయటకు చెప్పడు గానీ, వాడి మనసులో నాపై ఎంత ప్రేమ ఉందో ఇన్నాళ్లకు తెలిసింది’ అన్నారు. అప్పుడు రాజేశ్ లేడు.
రాజేశ్: నాన్నకు నా పెళ్లి చూడాలని ఉండేది. మామూలుగానే ఇంట్లో ఫంక్షన్లంటే నాన్నకు సరదా. మార్చిలో నా పెళ్లి చేసేస్తే, వెంటనే ఉగాది వస్తుంది. సంవత్సరం మారుతుంది కాబట్టి జూన్‌లో నరేశ్‌కు కూడా చేసేస్తే సరిపోతుందనుకున్నారు. కానీ ఈ లోపే క్యాన్సర్ కబళించింది.
నరేశ్: మా ఇంటికి ‘డ్రీమ్ హౌస్’ అని పేరు పెట్టారు నాన్న. ‘ఎందుకు నాన్నా... ‘డ్రీమ్ హౌస్’ అని పెట్టారు, ‘ఈవీవీ నిలయం’ అని పెట్టొచ్చు కదా?’ అని అడిగాను. ‘అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో ఎన్నో పెద్ద పెద్ద ఇళ్లు చూశాను. ఎప్పటికైనా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని కలలు కనేవాణ్ణి. నా కలల నిలయం కాబట్టే దీనికి ‘డ్రీమ్ హౌస్’ అని పేరు పెట్టా. నీ పిల్లలు, రాజేశ్ పిల్లలతో ఇల్లు కళకళ లాడాలి. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండాలి’ అని చెప్పారు. బాధాకరమైన విషయం ఏంటంటే, రాజేశ్‌కి పిల్లాడు పుట్టక ముందే ఆయన కన్నుమూశారు. మా రాజేశ్ కొడుకు అచ్చం నాన్నలాగే ఉంటాడు. అందుకే వాడికి నాన్న పేరే పెట్టాం. మా నాన్న లేని లోటును మా బుడ్డోడు తీర్చేస్తున్నాడు.
- బుర్రా నరసింహ
మా వంశోద్ధారకుడు... నాన్నే!
Published Sat, Jun 14 2014 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM
Advertisement