నోరు మంచిదైతే... ఊరు మంచిదౌతుంది! | Fetororis | Sakshi
Sakshi News home page

నోరు మంచిదైతే... ఊరు మంచిదౌతుంది!

Published Tue, May 19 2015 11:45 PM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

నోరు మంచిదైతే...  ఊరు మంచిదౌతుంది!

నోరు మంచిదైతే... ఊరు మంచిదౌతుంది!

నోటి దుర్వాసన (హ్యాలిటోసిస్)
 
ఉదయం లేవగానే... మనం మన ఆత్మీయులతో తప్ప మాట్లాడం. ఇతరులతో మాట్లాడాలనుకుంటే తప్పనిసరిగా బ్రష్ చేసుకున్న తర్వాతే మాట్లాడతాం. కారణం... ఉదయం లేచాక మనందరి నోళ్ల నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇది చాలా సహజం. కానీ కొందరిలో మాత్రం బ్రష్ చేసుకున్న తర్వాత కూడా దుర్వాసన వస్తూనే ఉంటుంది. వాళ్లు మన సమీపంలోకి వస్తే మనకు తెలియకుండానే శ్వాస బిగబట్టేసి ముఖం పక్కకు తిప్పుకుంటాం. మీరు దగ్గరికి వచ్చిన ఎవరైనా అలా చేస్తుంటే న్యూనతకు గురికాకండి. మీ నోరు మంచిదిగా చేసుకోండి... అంతే... ఊరంతా మీకు మంచిదవుతుంది.  
 
మన నోట్లో, గొంతులో మొదలుకొని, జీర్ణకోశం దారి పొడవునా అనేక బ్యాక్టీరియా నివాసం ఉంటుంటాయి. ఇక మనం ఏదైనా తిన్న తర్వాత పళ్ల మధ్య మిగిలిపోయిన వాటిని మరింత చిన్నముక్కలుగా విడగొట్టి, దానిపై మనుగడ సాగించే బ్యాక్టీరియా నోట్లో, అలాగే గొంతులోనూ ఉంటాయి. రాత్రి మనం నిద్రపోయాక మన నోరు చాలాసేపటివరకు నమలడం, మింగడం లాంటి ఎలాంటి కార్యకలాపాలకూ తావులేకుండా ఉంటుంది. కాబట్టి నోట్లో, గొంతులో ఉన్న ఈ బ్యాక్టీరియా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. నోట్లో ప్లస్ గొంతులో ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్టీరియాకు ‘ఓరోఫ్యారింజియల్’ బ్యాక్టీరియా అని పేరు. ఉదయానికల్లా వాటి సంఖ్య పెరుగుతుంది కాబట్టి ముఖం కడుక్కోడానికి ముందుగా మన నోరు దుర్వాసన వేస్తుంటుంది. బ్రష్ చేసుకున్న తర్వాత ఆ బ్యాక్టీరియా గణనీయంగా తగ్గిపోతుంటుంది కాబట్టి మన నోటి నుంచి దుర్వాసన రావడం తగ్గుతుంది.

బ్రష్ చేసుకున్న తర్వాత కూడా దుర్వాసన వస్తుంటే...

కొందరిలో బ్రష్ చేసుకున్నా ఫలితం ఉండదు. ఇలాంటి వారిలో బ్రషింగ్ తర్వాత కూడా దుర్వాసన వస్తుంటే... దానికి కారణాన్ని తెలుసుకుని, అందుకు తగినట్లుగా చర్యలు తీసుకోవాలి. అప్పుడు దుర్వాసన తగ్గుతుంది. బ్రషింగ్ తర్వాత కూడా నోటి దుర్వాసనకు కారణాలివే...
 
కొన్ని ఆహారాలతో: కొన్ని రకాల ఆహారాలు సహజంగానే దుర్వాసన కలిగించేవిగానూ లేదా పెంచేవిగానూ ఉంటాయి. ఉదాహరణకు ఉల్లి, వెల్లుల్లి, మసాలాల వంటివి తినగానే, నోటినుంచి ఘాటుగా వాసన వస్తుంటుంది. పైగా ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాల్లో సల్ఫర్ పాళ్లు ఎక్కువ. అందుకే వీటిని తినగానే గొంతులో వోలటైల్ సల్ఫర్ కాంపౌండ్స్ (వీఎస్‌సీ) ఏర్పడతాయి. అంటే వాయు రూపంలో ఉండే గంధకపు ధూమం అన్నమాట. దీనివల్ల విపరీతమైన దుర్వాసన వస్తుంటుంది.

పరిష్కారం : పగటి వేళ వీలైనంత వరకు ఉల్లి, వెల్లులి, మసాలాలతో కూడిన ఆహారాన్ని తీసుకోకపోవడం మేలు. ఒకవేళ తిన్నా వెంటనే బ్రష్షింగ్ చేసుకోవడం మంచిది. ఇక నాలుకకు మరో చివర తెల్లగా పాచి పేరుకుపోతుంది. అప్పుడు టంగ్‌క్లీనింగ్‌తో దుర్వాసన తగ్గుతుంది.

పలువరస చక్కగా లేకపోతే... : కొందరిలో పలువరస చక్కగా ఉండదు. పళ్లు గొగ్గిరిగా ఉంటాయి. దాంతో వాళ్లు తిన్న ఆహారం చక్కగా లేనికారణంగా పళ్ల సందులలో చిక్కుకుపోతుంది. ఆహారాన్ని మరింత చిన్నముక్కలు చేసే బ్యాక్టీరియా ఎప్పటిలాగే దానిపై పనిచేస్తుంటుంది. ఈ ప్రక్రియలో శిథిలమయ్యే ఆహారం నుంచి రసాయన వాయువులు వెలువడటం వల్ల నోటి దుర్వాసన వస్తుంటుంది.
 పరిష్కారం : పలువరస చక్కగా లేని కారణం వల్ల ఆహారం పళ్లమధ్య చిక్కుకుపోయి దుర్వాసన వస్తుంటే... వారు డెంటిస్ట్‌ను కలుసుకుని పళ్లకు మధ్య సందులు లేకుండా చూసుకునేందుకు అవసరమైన చికిత్స తీసుకోవాలి.

పొగతాగడం లేదా పొగాకు నమలడం: పొగతాగే అలవాటు ఉన్నవారిలో పొగాకుకు సంబంధించిన దుర్వాసన భరించలేకుండా ఉంటుంది. అలాగే గుట్కా, ఖైనీ, జర్దా వంటివి తినేవారిలోనూ పక్కవాళ్లు భరించలేనంత దుర్వాసన వస్తుంటుంది.
 
పరిష్కారం : పొగతాగడం, గుట్కా, ఖైనీ, జర్దా... ఇలా ఏ రూపంలో పొగాకును వాడినా అది కేవలం నోటి దుర్వాసన వంటి మామూలు సమస్యకు మాత్రమే పరిమితం కాదు. నోటి క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన, చాలా ఖర్చుతో కూడిన చికిత్సలు చేయించాల్సిన ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది. అందుకే ఈ అలవాట్లు ఉన్నవారు తక్షణం వాటిని మానేయాల్సిందే. పైగా పొగతాగే అలవాటు వల్ల ఏర్పడే ప్రమాదం వారికే పరిమితం కాదు. ప్యాసివ్ స్మోకింగ్ (వారు వదిలే పొగను కుటుంబ సభ్యులు, పక్కవారు పీల్చడం) వల్ల వారు ప్రేమించే అతి దగ్గరివారికీ అది ప్రమాదకరం. కాబట్టి ఈ అలవాటును ఎంత త్వరగా వదుల్చుకుంటే అంత మేలు.
 
ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు / నోట్లో తడి ఆరిపోవడం: మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు అంటే మాంసాహారం, పప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని మన నోట్లోని బ్యాక్టీరియా మరింత చిన్న చిన్న అంశాలుగా విడగొడుతుంటాయి. ఉదాహరణకు ప్రోటీన్లను అమైనో ఆసిడ్స్‌గానూ, ఆ అమైనో ఆసిడ్స్‌ను మరింత చిన్న పదార్థాలుగానూ విడదీస్తాయి. నోట్లో తడి ఆరిపోయి ఉన్నప్పుడు, నోరు చాలాసేపు మూసి ఉన్నప్పుడు ఇలా ఆహారం ఇలా చిన్న అంశాలుగా విడిపోయే ప్రక్రియలో దానిపై జీవించే (థ్రైవింగ్) బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది.
 
పరిష్కారం : ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినగానే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే తరచూ మంచినీళ్లు తాగుతూ నోరు తడిగా ఉంచుకోవాలి.
 
డయాబెటిస్ ఉన్నప్పుడు : మనం నోటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నా, ఎప్పటికప్పడు కడుక్కుంటున్నా... అప్పటికీ నోటి నుంచి దుర్వాసన వస్తుందంటే వాళ్లలో డయాబెటిస్ ఉందేమోనని అనుమానించాలి. డయాబెటిస్ ఉన్నవారిలోనూ తరచూ నోటిలో తడి ఆరిపోతుంటుంది. దాంతోనూ దుర్వాసన రావడం మొదలవుతుంది.

పరిష్కారం : మనం నోటి పరిశుభ్రత చర్యలను తీసుకుంటున్నా  నోరు దుర్వాసన వస్తుంటే ఒకసారి డెంటిస్ట్ లేదా జనరల్ ఫిజీషియన్‌ను కలిసి వారి సలహా మేరకు పరగడుపున చేయించే రక్షపరీక్ష, భోజనం తర్వాత చేయించే రక్తపరీక్షలు చేయించుకొని డయాబెటిస్ బయటపడుతుందేమో చూడాలి. డయాబెటిస్ లేనప్పుడు జీర్ణవ్యవస్థకు సంబంధించిన (గ్యాస్ట్రో ఇంటస్టినల్) వ్యాధుల వల్ల ఇలా జరుగుతుందేమో తెలుసుకొని దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి.
 
 నోటి దుర్వాసనను తొలగించుకోడానికి కొన్ని మార్గాలు :  ప్రతిరోజూ ఉదయం, రాత్రి... రెండుమార్లు పళ్లు తోముకోండి  బ్రషింగ్ తర్వాత టంగ్‌క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోండి. నాలుకపైనున్న బ్యాక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేయండి  చిగుళ్లపై పుళ్లు ఉన్నప్పుడు తప్పనిసరిగా డెంటిస్ట్‌ను కలిసి పరీక్షలు చేయించుకోండి.  కొన్నిసార్లు దంతాల్లో పిప్పిపళ్లు ఉన్నప్పుడు ఫిల్లింగ్ చేయించుకోవాలి.   ఆహారం సరిగా జీర్ణం కాకుండా గ్యాస్ వస్తున్నప్పుడు, సైనస్, టాన్సిల్స్ వంటివి ఉన్నప్పుడు, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి తగిన చికిత్స తీసుకోవాలి.
 
డాక్టర్ వి. రమణకుమార్,
డెంటల్ సర్జన్, ఆర్థోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్,
స్మైల్ కేర్ డెంటల్ హాస్పిటల్స్,
అమీర్‌పేట, హైదరాబాద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement