అస్త్ర యంత్ర : ఆమె చేతుల్లోనే ఆర్థిక రంగం!
భారతదేశంలో ప్రతి పది కంపెనీలకుగాను ఒక కంపెనీలో మాత్రమే మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారు. అయితే ఆ ఉన్నత స్థానాల్లో ఏ రంగంలో ఎక్కువమంది స్త్రీలు ఉన్నారని పరిశీలించినపుడు అత్యధికంగా బ్యాంకుల్లో ఉన్నట్లు తేలింది. తాజా విషయం ఏంటంటే... ప్రపంచంలో ఏ దేశంతో పోల్చినా కూడా మన దేశంలో బ్యాంకింగ్ రంగంలో మహిళా నాయకత్వం చాలా ఎక్కువట.
భారతదేశంలో 40 శాతం బ్యాంకింగ్ మహిళా సీఈవోల ఆధ్వర్యంలోనే జరుగుతోంది. అంటే మహిళలు కోరుకుంటున్న మూడోవంతు అవకాశాలను బ్యాంకింగ్ ఎప్పుడో కల్పించింది. నిజానికి ఇవి కల్పించిన అవకాశాలు కాదు, దక్కించుకున్న అవకాశాలు. ‘బ్యాంకింగ్ అనేది భారతీయ స్త్రీ రక్తంలోనే ఉంది. ఆర్థిక స్వావలంబన, భవిష్యత్తు ఆర్థిక అవసరాల అంచనా, ఆర్థిక నిర్ణయాలు అన్నవి భారతీయ స్త్రీకి వెన్నతో పెట్టిన విద్య’ అని అంతర్జాతీయ బ్యాంకింగ్ నిపుణులు అరుణ్ దుగ్గల్ అంటారు. వినియోగదారుడి మనసును అర్థం చేసుకోవడంలో ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాల్లో స్త్రీలు బాగా అంచనా వేయగలరని ఆయన అన్నారు.
మిగతా రంగాల్లో స్త్రీ నాయకత్వం తక్కువగా ఉండటానికి కారణం వాటిని నడిపే శక్తి స్త్రీకి లేకపోవడం వల్ల కాదు, బ్యాంకింగ్ వారి పని విధానానికి, పని వాతావరణానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. దాంతో పాటు వారి సామర్థ్యం ఇందులో ఎక్కువ. మరో కారణం.. బ్యాంకులు మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ముందుగా గుర్తించాయి. సమాన సామర్థ్యాలున్న ఇద్దరు (స్త్రీ-పురుషులు) ఇంటర్వ్యూకు వస్తే బ్యాంకింగ్ రంగంలో స్త్రీకి కచ్చితంగా ప్రాధాన్యం దక్కుతుంది. ప్రైవేటు బ్యాంకులు మహిళా ఉద్యోగులకు అన్ని స్థాయుల్లో రాచబాట వేస్తున్నాయి. బహుశా అందుకే అవి అంతటి విజయాలను సాధిస్తున్నాయేమో.
స్త్రీ ఒక ఉద్యోగం చేయడం వేరు.. ఆ రంగంలో అడ్డంకులన్నీ దాటుకుని అత్యున్నత స్థానాలకు చేరడం వేరు. తాజాగా భారతదేశపు అతిపెద్ద బ్యాంకు అయిన ‘ఎస్‌బీఐ’కి అరుంధతి భట్టాచార్య చైర్‌పర్సన్ కావడంతో బ్యాంకుల్లో మహిళల విజయాన్ని మరోసారి ప్రపంచానికి గుర్తుచేసినట్టయింది. అలాంటి స్థానాల్లో ఉన్న మహిళల జాబితా చెప్పాలంటే వ్యాసం కాదు, పుస్తకమే వేయాలి.
ఇక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లోనూ వారి హవా పెద్దదే. ఏకంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ రూపకర్తల్లో ఒకరు మహిళ. ఇంకా సెక్యూరిటీస్, తదితర సంస్థల్లో మహిళల పాత్ర కీలకంగా ఉంది. నేర్చుకోవడానికే కాదు అర్థం చేసుకోవడం కూడా క్లిష్టమైన ఆర్థిక రంగంలో ఇంతగా ఎదిగిన మహిళ ఎక్కడైనా లక్ష్యాన్ని చేరుకోగలదు. మహిళ విజయానికి దగ్గరవుతున్న కొద్దీ వ్యతిరేకించే వారినుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయడమే చేయాల్సింది!
- ప్రకాష్ చిమ్మల