మహిళలు చేసే ఏ పనినైనా ఫెమినిజం కింద కొట్టిపారేసే పురుషాహంకారానికి సమాధానంగా ఒక కొత్త సంభాషణకు తెరతీశారుఐదుగురు మహిళా దర్శకులు. అయిదు నాటకాలు.. అయిదూ వాస్తవాలే!నేను మహిళను.. మహిళా ప్రపంచంలో పురుషుడికి కూడా సమానహక్కు ఇవ్వాలని అనుకుంటున్నాను.నేను మహిళను.. సమానత్వం నాకొకరు ఇవ్వక్కర్లేదు.. నేను అందరినీ సమానంగా చూస్తాను!నేను మహిళను.. సమానత్వాన్ని చూపిస్తున్నాను..అంటున్నారు వీళ్లు ఐదుగురూ.ద స్టేజ్ ఈజ్ రెడీ!
మౌనంగా ఉన్నప్పుడే మాట విలువ తెలుస్తుంది.. గళమెత్తాల్సిన సమయాన్నీ ఆ మౌనమే తెలియజేస్తుంది. ఆ టైమ్ ఇప్పుడు వచ్చింది. ముఖ్యంగా మహిళలకు. ఏళ్లుగా తమ సమస్యలను.. ఇబ్బందులను నిశ్శబ్దంగా భరిస్తున్న ఆడవాళ్లు గొంతెత్తాల్సిన అవసరం వచ్చింది. సరళమైన స్వరంలోనే వస్తున్న మాటల తీవ్రతను సమాజమూ గ్రహిస్తోంది. అర్థం చేసుకోవడానికి తల వంచుతోంది. తనను వినిపించడానికి స్త్రీ.. కనపడ్తున్న చిన్న అవకాశాన్నీ పెద్ద వేదికగా మలచుకుంటోంది.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా! ఒక్క చోట కాదు.. ప్రపంచమంతా! మోస్తున్న బాధ్యతలు.. పొందాల్సిన హక్కులు, వేయాల్సిన ప్రశ్నలు.. చెప్పాల్సిన సమాధానాలు, లక్ష్యపెట్టాల్సిన ఆరోగ్యం.. నిర్లక్ష్యం చేయాల్సిన అవమానాలు, తీసుకోవాల్సిన సవాళ్లు.. సాగాల్సిన సమాలోచనలు.. నిర్దేశించుకోవాల్సిన గమ్యాలు లాంటివెన్నిటినో.. చర్చలు, డైలాగులు, డ్రామాలు, డ్రాఫ్ట్‌లు, ర్యాలీలు, ధర్నాలు, సెమినార్లు, సెలబ్రేషన్లుగా తెలుగు రాష్ట్రాలు మొదలు దేశమంతటా నిర్వహిస్తోంది. వాటి గురించి క్లుప్తంగా..
భూమిక
ఇది మహిళా రంగస్థలం. మహిళలు దర్శకత్వం వహించి, నటించిన ఆధునిక నాటకోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ (టీటీఆర్‌సీ) ‘భూమిక’ పేరుతో జరుపుతున్న మోడర్న్ థియేటర్ ఫెస్టివల్. ఓహ్.. అయితే ఇంకేమీ.. అంతా స్త్రీవాద నాటకాలే ఉంటాయన్నమాట... అంటూ అప్పుడే పెదవి విరువద్దు.. స్టీరియోటైప్ ఆలోచనలు చేయొద్దు. నాటకంలో మహిళల పాత్ర.. థియేటర్ ప్రయోగాల్లో పురుషులకు తీసిపోని వాళ్ల ప్రతిభ కనపడుతుంది.
అన్వేషణ
రచయిత నాహుషీ కావూరి. కాన్సెప్ట్, డైరెక్షన్ సౌమ్య రామ్ హోళగుండి. ‘‘దీన్ని గ్రీక్ కోరస్, మూవ్‌మెంట్ డ్రామా అండ్ రియలిస్టిక్ డ్రామా.. ఈ మూడు ప్రక్రియలను కలిపి చేస్తున్నాం. అంటే కథను, పాత్రల స్వభావాలను చెప్పడానికి నటులు భౌతిక పద్ధతులు, బృందాభినయం, స్థలం, మైమ్ వంటివి ఉపయోగిస్తారన్నమాట’’అంటూ అన్వేషణ లోని ఎక్స్‌పరిమెంట్‌ను,స్పెషాలిటీని చెప్తారు సౌమ్య. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా. ఒక హంతకుడి మర్డర్‌ను ఛేదించే డిటెక్టివ్ కథ. డైరెక్టర్ సౌమ్య గురించి చెప్పాలంటే.. కేరళ వాస్తవ్యురాలు. మలయాళంలోని థియేటర్ ఆమెలో నాటకాల పట్ల ఆసక్తిని పెంచింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మాస్ కామ్, ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో స్పీచ్ అండ్ డ్రామా చదివారు. నిషుంబితా బాలే అండ్ థియేటర్ గ్రూప్‌లో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. డ్రామా ద్వారా బోధన అనే ప్రక్రియ మీద ప్రపంచ వ్యాప్తంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. నిషుంబితా సమర్పించిన చాలా నాటకాలకు దర్శకత్వ సహకారం అందించిన సౌమ్య ‘అన్వేషణ’తో డైరెక్టర్ అవుతున్నారు.
మోరియా
జాన్ మిల్లింగ్టన్ సింజె రాసిన ‘‘రైడర్స్ టు ద సీ’’ ఆధారంగా స్టేజ్ మీదకు వస్తున్న నాటకం ‘మోరియా’. ప్రముఖ రచయిత్రి శివలక్ష్మి ఈ ఇంగ్లిష్ ప్లేని ‘మోరియా’గా స్వేచ్ఛానువాదం చేశారు. దాన్ని నాటకానికి అనువుగా కొంత మార్చి దర్శకత్వం వహించారు ప్రముఖ థియేటర్ యాక్టర్, డైరెక్టర్, థియేటర్ ఫ్యాకల్టీ (పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ) పద్మప్రియ. చేపల కోసం సముద్రంలో వేటకు వెళ్లే కుటుంబాల పరిస్థితిని కళ్లకు కట్టే డ్రామా ఇది. మోరియా ఒక స్త్రీ కథ. చేపల వేటకు వెళ్లిన ఆరుగురు కొడుకులను పోగొట్టుకుని.. మిగిలిన ఇద్దరు కూతుళ్ల కోసం ఒంటరిపోరుకు సిద్ధమైన ఓ ధీశాలి. ‘‘ఆత్మవిశ్వాసంతో వృద్ధాప్యాన్నీ జయించి నిలబడ్డ మోరియా.. నేటి యువతకు గొప్ప స్ఫూర్తి’’ అంటారు పద్మప్రియ. రంగస్థల అభిమానులందరికీ ఆమె సుపరిచితం. ‘కాకి ఎంగిలి’.. నటిగా ఆమె ఉనికిని చాటిన నాటకం. ఇప్పటివరకు 500 నాటకాలు, మూడు వేల ప్రదర్శనలతో నాలుగు నంది అవార్డులు, జాతీయ అవార్డ్ సహా ఇంకెన్నో పురస్కారాలు పొందారు. యాభై నాటకాలకు దర్శకత్వం వహించారు.
దేశంలో కొన్ని ఈవెంట్స్
►అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిధ్వని విమెన్స్ ఫోరమ్ నాలుగో తేదీన అంటే ఈరోజే తిరువనంత పురం (కేరళ)లో పలు కార్యక్రమాలను చేపట్టింది. ఐటీలోని మహిళా ఉద్యోగుల కోసం ‘లేడీ కోడ్ నింజా’ పేరుతో హాకథాన్, ‘టెక్ టాక్’ పేరున టిక్‌టాక్ కాంపిటీషన్, ‘టెకీ క్లిక్స్’ అనే ఫొటోగ్రఫీ పోటీలను, ‘హర్ హెల్త్ ఫస్ట్’గా 295 రూపాయలకే ఆరోగ్య పరీక్షలను, బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లను, జెండర్ ఈక్వాలిటీ ఇన్ ఐటీ సెక్టార్ అనే సెమినార్‌ను, ఐటీ ఎంప్లాయ్‌స్‌తో ‘‘రెయిజ్ ఎగైన్‌స్ట్ మోరల్ పోలీసింగ్’ అనే థియేటర్ ప్లేనూ నిర్వహిస్తోంది.
►గుజరాత్‌కు చెందిన ఆర్గ ఫౌండేషన్, శాంతినికేతన్ అనే రెండు స్వచ్చంద సంస్థలు కలిసి ‘‘బ్యాలెన్స్ ఫర్ బెటర్ (జెండర్ బ్యాలెన్స్‌డ్ ప్రపంచం ఎందుకు అవసరం), ‘‘రికగ్నిషన్ ఆఫ్ విమెన్’’ అన్న అంశాల మీద సదస్సు ఏర్పాటు చేస్తున్నాయి. స్థలం.. కాన్ఫరెన్స్ హాల్, శాంతినికేతన్, చాంద్‌ఖేడా, కలోల్ రోడ్, గాంధీనగర్, గుజరాత్. సమయం.. సాయంకాలం నాలుగు గంటల నుంచి ఆరు గంటల దాకా. ఆసక్తి, పోరాటపటిమ ఉన్న, స్ఫూర్తి పంచిన మహిళలు, అమ్మాయిలు పాల్గొనవచ్చు.
►ఇదే రోజు అంటే మార్చి ఎనిమిదో తేదీన్నే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో స్మార్ట్ మామాస్’ కమ్యూనిటీ ‘‘ఫెంటాస్టిక్ ఫీమేల్స్ –2019’’పేరుతో ఓ ఈవెంట్‌ను చేపట్టింది. ‘‘షేర్ యువర్ కెరీర్ స్టోరీస్ ’’ అంటూ భిన్న రంగాల్లో రాణించిన మహిళలను ఒక్కచోటకు తెచ్చి వారి విజయగాథలకు వేదిక కల్పిస్తోంది. ఆసక్తి ఉన్న వాళ్లు మరిన్ని వివరాల కోసం ఈ కాంటాక్ట్ నంబర్‌ను సంప్రదించవచ్చు.. 9879821496.
పురుష సూక్తం
‘ఆడది’కి భిన్నమైన నాటకం.. ‘పురుష సూక్తం’’. స్త్రీ, పురుష పాత్రల సంవాదంతో మొదలయ్యే ఈ డ్రామా స్త్రీపాత్రతో మాస్క్యూలైన్ ఎనర్జీ, పురుషపాత్రతో ఫెమినైన్ ఎనర్జీ ఐడెంటిఫై కావడంతో ముగుస్తుంది. ఇప్పటిదాకా పురుషుడు తన బాధను బయటకు చెప్పకోలేదు. కన్నీళ్లు పెట్టకుండా.. కొండంత కష్టాన్నీ పంటిబిగువున భరించేవాడే మగాడు.. హీరో అనే ఒక ఫాల్స్ ఇమేజ్‌ను మోస్తూ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. ‘‘పురుషుడి సమస్యలు తెలియకుండా ఈక్వాలిటీ ఎలా సాధ్యం? సమానత్వాన్ని, పోటీ తత్వాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. పురుష సూక్తంతో కొత్త సంభాషణకు నాంది పలుకుతున్నాను.. ఆర్ యూ విల్లింగ్ టు లిజన్ టు మి?’’ అంటున్నారు ‘పురుష సూక్తం’ రైటర్ అండ్ డైరెక్టర్ ఝాన్సీ.
యస్.. టాక్ ఆఫ్ ది టౌన్.. మల్టీ టాలెంటెడ్ ఉమన్.. ఝాన్సీయే. బాలానందం నుంచి బుల్లితెర యాంకర్, సినిమా యాక్ట్రెస్‌గా తెలుగువాళ్లందరికీ ఆప్తురాలైన ఝాన్సీ.. మొన్నామధ్య ‘కన్యాశుల్కం’ మధురవాణితో అద్భుతమైన థియేటర్ ఆర్టిస్ట్‌గానూ మెప్పించారు. ఇప్పుడు.. పురుష సూక్తంతో డైరెక్టర్‌గానూ రాణించనున్నారు. ‘‘డైరెక్టర్‌గా కంటే రైటర్ రోలే చాలెంజింగ్‌గా ఉంది. ఇందులో హంగ్ డ్రమ్ అనే వాద్య పరికరాన్ని ప్రయోగిస్తున్నాం’’ అన్నారు ఝాన్సీ.
చిత్ర నళీయం
ఆంధ్రనాటక పితామహ ‘ధర్మవరం రామకృష్ణమాచార్యులు’ రచించిన పద్య నాటకానికి ఆధునిక రూపమే ‘‘చిత్ర నళీయం’’. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లి పరమార్థాన్ని చెప్పే కథ. నలదమయంతుల కథనే నేటి పరిస్థితులకు అన్వయించి.. యువతకు స్ఫూర్తినిచ్చేందుకు తెస్తున్న తెర రూపం. దీనికి దర్శకురాలు జయశ్రీ సునయన. డైరెక్టర్‌గా ఇది ఆమెకు అయిదో ప్లే. 280 నాటకాల్లో నటించారు. నంది అవార్డు తీసుకున్నారు. పుట్టింది ఖమ్మంలో. పెరిగింది విజయవాడలో. చిన్నప్పటి నుంచీ థియేటర్ అంటే ఇష్టం. అందుకే ఎంకామ్, ఎమ్‌సీజే చేశాక కూడా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ చేశారు జయశ్రీ సునయన.
యాక్టింగ్ ఫ్యాకల్టీగా స్థిరపడాలన్నదే ఆమె ధ్యేయం. ‘‘నాటకాల్లోకి యూత్ రావట్లేదని అంటున్నారు. మా నాటకం చూస్తే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. చిత్ర నళీయంలో నటించే వాళ్లందరూ డిగ్రీ స్టూడెంట్సే. పెద్దగా నాటకానుభవంలేకపోయినా థియేటర్ అంటే ప్యాషన్ ఉన్నవాళ్లు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రొడక్షన్స్‌తో ఈక్వల్‌గా తెలుగు థియేటర్ కూడా ప్రయోగాలు చేయగలదు అని నిరూపిస్తాం’’ అంటున్నారు జయశ్రీ సునయన.
ఆడది.. అయామ్ నాట్ ఎ ఫెమినిస్ట్
అవును.. ఆడవాళ్లకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపితే చాలు ‘ఆర్ యూ ఎ ఫెమినిస్ట్?’’ అంటూ ప్రశ్నిస్తారు. ముద్ర వేస్తారు. తప్పును తçప్పు అని ఒప్పుకోవడానికి భేషజాలు ఎందుకు? స్త్రీ వాద మిషలు ఎందుకు? ఫెమినిజం అంటే స్త్రీ వాదం కాదు.. స్త్రీపురుష సమానత్వం. స్వతంత్ర ఆలోచనలతో శక్తిమంతమైన మహిళగా నిలబడాలంటే ఫెమినిస్ట్ మార్క్ వేయించుకోవాల్సిందేనా? అది లేకుండా విభిన్నంగా.. విలక్షణంగా ఉండలేనా? అంటూ ప్రశ్నించే మోనోలాగ్.. ‘ఆడది.. అయామ్ నాట్ ఎ ఫెమినిస్ట్’. ఈ ప్లేకి డైరెక్టర్ స్వాతి రామన్. థియేటర్ ఆర్టిస్ట్‌గా ఇంటరెస్టింగ్ జర్నీ ఆమెది. స్వాతి రామన్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఇన్ఫోసిస్‌లో టీమ్ లీడ్. సొంతూరు హైదరాబాద్.
‘‘ బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు రంగశంకర థియేటర్ గ్రూప్ వాళ్ల ఓ ప్లే చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యా. హైదరాబాద్ వచ్చాకా ఆ ఇంటరెస్ట్ పోలేదు. స్ట్రీట్ ప్లేస్‌లో పార్టిసిపేట్ చేశా. అప్పుడే నిషుంబితా థియేటర్ గ్రూప్ గురించి తెలిసింది. ఆ టీమ్‌లో చేరా. అట్లా ఈ ప్యాషన్ నా పార్ట్‌టైమ్ జాబ్ అయిపోయింది’’ అంటారు స్వాతి రామన్. ఈ నాటకానికి కాన్సెప్ట్, రచన రామ్మోహన్ హోళగుండి. దర్శకురాలిగా స్వాతికి ఇది డెబ్యూ ప్లే.
ఈ నెల అయిదు, ఆరు, ఏడు తేదీల్లో మూడు రోజులు... అయిదు నాటకాలు. వెన్యూ అండ్ టైమ్..హైదరాబాద్ రవీంద్రభారతి, సాయంత్రం ఆరు గంటలు. ఈ అయిదు నాటకాలూ వేటికవే ప్రయోగాత్మకమైనవి. ప్రత్యేకమైనవీ.
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment