మచ్చలేని ఆరోగ్యానికి..!
మచ్చలేని ఆరోగ్యానికి..!
Published Sat, Aug 10 2013 11:42 PM | Last Updated on Sat, Sep 15 2018 7:34 PM
మచ్చ లేకుండా ఉండాలన్నది అందరి ఆకాంక్ష. కానీ ఏదో ఒక మచ్చ లేకుండా ఎవరూ ఉండరు... కనీసం ఒంటిపై పుట్టుమచ్చ రూపంలోనైనా. పుట్టుమచ్చలు పుట్టుకతోనే వస్తాయని వాటికా పేరు. కానీ పుట్టాక మొదటి 30 ఏళ్లలో ఎప్పుడైనా రావచ్చు. గుర్తించడానికి మొదలుకొని, అందం వరకూ పుట్టుమచ్చలతో కొన్ని ఉపయోగాలున్నా... ఒక్కోసారి అందానికీ, ఆరోగ్యానికీ అవే ప్రతిబంధకం కూడా కావచ్చు.
పుట్టుమచ్చలను సైంటిఫిక్ పరిభాషలో ‘నీవై’ అంటారు. మన చర్మంలో ఉండే ‘మెలనోసైట్స్’ అనే కొన్ని కణాలు కలిసి పుట్టుమచ్చ రూపంలో కనిపిస్తాయి. మెలనోసైట్స్ అంటే ఆ కణాల్లో మెలనిన్ అనే రంగునిచ్చే పదార్థం ఉంటుందన్నమాట. ఈ కణాలన్నీ శరీరంపై ప్రతిచోటా ఉంటాయి. అయితే అవి కట్టగట్టుకుని ఉన్నచోట శరీరవర్ణం మామూలుగా కాకుండా కాస్త నల్లగానో లేక ముదురురంగులోనో కనిపిస్తుంటుంది. దాన్నే మనం పుట్టుమచ్చ అంటాం.
అందానికి అందం, ప్రమాదానికి ప్రమాదం: పుట్టుమచ్చ అంటే చర్మంలోని ఒక రకం కణాలు ఒకచోట కలగలిసి ఉండటమే అయినా దానిచుట్టూ కూడా ఎన్నో శాస్త్రాలు, శుభాశుభాలు, నమ్మకాలు కలగలసి ఉన్నాయి. కొన్ని పుట్టుమచ్చలను అందానికి ప్రతీకలుగా, అవి మరింత ఇనుమడింపజేసేవిగా అభివర్ణించారు. ఉదాహరణకు మార్లిన్‌మన్రో, సిండీక్రాఫోర్డ్, మనదేశంలోని నటీమణులలో మధుబాల, జయప్రద మొదలైనవారు. వీళ్లలో అందాన్ని మరింత ప్రస్ఫుటం చేసిన అవే పుట్టుమచ్చలు మరికొందరిలో ప్రమాదాన్ని తెచ్చే అవకాశం కూడా ఉంది.
పుట్టుమచ్చలు... రంగులు, రకాలు: మొదట చెప్పినట్లుగా వైద్యపరిభాషలో పుట్టుమచ్చను ‘మెలనోసైటిక్ నీవస్’ అంటారు. వీటిలో రకరకాల రంగులున్నవి ఉంటాయి. నల్లటి, గోధుమరంగులో ఉన్నవి, గ్రే కలర్, తెలుపు, నీలం రంగుల్లోనూ పుట్టుమచ్చలుంటాయి.
చర్మంలో అవి ఉన్న స్థానాన్ని బట్టి ...
జంక్షనల్ నీవస్: చర్మానికి రంగునిచ్చే మెలనోసైట్స్ చర్మంలోని ఎపిడర్మిస్, డర్మిస్ పొరల మధ్య ఉంటే వాటిని జంక్షనల్ పుట్టుమచ్చలు అంటారు. నల్లగా/ గోధుమరంగులో ఉంటాయివి. సాధారణంగా చర్మంతోనే కలిసిపోయి, ఫ్లాట్‌గా కనిపిస్తాయి.
కాంపౌండ్ నీవస్: ఈ రకం జంక్షనల్‌గా లేదా ఒక్కోసారి చర్మంపైకి పొడుచుకు వచ్చినట్లుగా ఉండవచ్చు. అందుకే ఇవి చర్మం కంటే కాస్త ఉబ్బెత్తుగా ఉంటాయి. సాధారణంగా ‘కాంపౌండ్ నీవస్’లే బ్యూటీ స్పాట్స్‌గా పేరుపడతాయి. ఇవి పుట్టుకతోనూ రావచ్చు లేదా మధ్యలో కూడా రావచ్చు.
ఇంట్రాడర్మల్ నీవస్: ఈ కణాలు చర్మంలోని డర్మిస్ పొర కంటే లోతుగా ఉంటాయి. అవి ఒక్కోసారి పైకి కనిపించవచ్చు లేదా లోపల మాంసకండరాల్లోనూ ఉండవచ్చు. ఇవి చర్మపు రంగులోనే ఉంటాయి.
ఇతర రకాలు
డిస్‌ప్లాస్టిక్ నీవస్: ఇది ఒక రకం కాంపౌండ్ నీవస్. ఇవి ఉబ్బెత్తుగానూ ఉండవచ్చు లేదా ఫ్లాట్‌గానూ ఉండవచ్చు. ఇవి సాధారణ మచ్చలకంటే పెద్దవిగా ఉండి, వీటి అంచులు సమంగా లేకుండా అడ్డదిడ్డం (ఇర్రెగ్యులర్)గా ఉంటాయి. రంగు కూడా నిర్దిష్టంగా ఒకటే విధంగా ఉండకపోవచ్చు. ఇవి లెక్కకు మించి ఉండటం ఒక్కోసారి ప్రమాదకరం కావచ్చు. ఇవి ఎక్కువగా ఉండటం ఒక్కోసారి చర్మక్యాన్సర్‌కు దారితీయవచ్చు. అందుకే వీటిని తీసి డయాగ్నసిస్‌కు పంపి, ప్రమాదకరమా కాదా అన్న విషయాన్ని నిర్ధారణ చేస్తారు. ఇవి మరింత ఎక్కువగా ఉన్న కండిషన్‌ను ‘టిపికల్ మోల్ సిండ్రోమ్’ అంటారు.
బ్లూ నీవస్: మెలనోసైట్స్ చర్మంలో చాలా లోతుగా ఉండటం వల్ల పైన ఉన్న ఎపిడర్మిస్ నుంచి చూసినప్పుడు బ్లూగా కనిపిస్తాయి.
స్పిట్జ్ నీవస్: ఇవి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి కాస్త ఎరుపు రంగులో ఉండే పుట్టుమచ్చలు. చర్మంలో డర్మిస్ కింద ఉంటాయి.
నీవస్ డీ-పిగ్మెంటోసిస్ / నీవస్ ఏక్రోమికస్
ఈ తరహా తెల్లటి పుట్టుమచ్చలు సాధారణంగా పుట్టుకతోనే ఉంటాయి. కాబట్టి మన చర్మం పెరుగుతున్న కొద్దీ ఈ పుట్టుమచ్చలు కూడా చర్మంతో పాటు పెరుగుతూ పెద్దవవుతుంటాయి. తెలుపు రంగు కారణంగా వీటిని లోకలైజ్‌డ్ ఆల్బినిజమ్‌గా అభివర్ణిస్తారు. ఇవి పిండదశలోనుంచే పెరిగే ఒక తరహా లోపం అన్నమాట.
పుట్టుకతోనే వచ్చే పుట్టుమచ్చలు
జెయింట్ పిగ్మెంటెడ్ నీవస్: ఇవి పెద్దగా ఉండటంతో పాటు, వాటిపై వెంట్రుకలు కూడా ఉంటాయి. ఇవి సాధారణంగా 20 సెం.మీ. కంటే పెద్దవిగా ఉంటాయి. వీటిలో మెలనోమా పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.
నీవస్ ఆఫ్ ఓటా: ఇవి పుట్టుకతోనే ఉంటాయి. అయితే కాస్త ఆకుపచ్చరంగులో లేదా ముదురుగోధుమ నుంచి నల్ల రంగు ప్యాచ్‌లుగా కనిపించే ఇవి ముఖంలోని ఒక పక్క భాగంలో కంటిచుట్టూ రావచ్చు. ఒకవేళ మెడ కిందిభాగంలో ఉంటే ‘నీవస్ ఆఫ్ ఈటా’ అంటారు.
మంగోలియన్ స్పాట్స్: ఇవీ పుట్టుకతోవచ్చేవే. వయసు పెరుగుతున్న కొద్దీ మాయమవుతాయి.
నీవస్ స్పైలస్: ఇవి లేత గోధుమరంగులో దగ్గరదగ్గరగా ఉన్న మచ్చల ప్యాచ్‌లా కనిపిస్తాయి.
హెయిరీ కంజెనిటల్ నీవస్: ఇవి పుట్టుకతోనే చిక్కటి వెంట్రుకలతో కనిపించే మచ్చలు.
స్మాల్ కంజెనిటల్ నీవస్: ఇవి పుట్టుకతోనే వచ్చే మచ్చలు. వీటి పరిమాణం 1.5 సెం.మీ కంటే తక్కువగా ఉంటుంది.
మీడియమ్ కంజెనిటల్ నీవస్: ఇవి కూడా పుట్టుకతోనే వస్తాయి. అయితే వీటిపరిమాణం 1.5 సెం.మీ. నుంచి 10 సెం.మీ. వరకు ఉంటుంది.
అక్వైర్‌డ్ మెలనోసైటిక్ నీవస్
ఇవన్నీ పుట్టుకతోనే కాకుండా, ఆ తర్వాత వచ్చేవి. అయినా వీటిని మనం పుట్టుమచ్చలనే పిలుస్తాం. సాధారణంగా పింక్, డార్క్‌బ్రౌన్, నల్లటిరంగులో ఉంటాయి. నల్లటి శరీర వర్ణం ఉన్నవారిలో ఎక్కువ. అక్వైర్‌డ్ పుట్టుమచ్చల్లో రకాలివి...
కామన్ నీవస్: ఇవి సాధారణంగా కనిపించే నల్లటి పుట్టుమచ్చలు.
నీవస్ ఇన్ డార్క్ స్కిన్: ఇవి నల్లటి శరీర వర్ణం ఉన్నవారిలో కనిపించే నల్లరంగు పుట్టుమచ్చలు.
టిపికల్ నీవస్: ఈ పుట్టుమచ్చలకు నిర్దిష్టమైన గుణాలుంటాయి. అవి 5 మి.మీ. కంటే పెద్ద పరిమాణంలో ఉండి, అంచులు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఒక్కోసారి ఫ్లాట్‌గానూ, ఒక్కోసారి కాస్త ఉబ్బెత్తుగానూ ఉంటాయి. ఇవి సాధారణంగా తెల్లటివారిలో కనిపిస్తాయి. ఒకటి లేదా గుంపులుగానూ కనిపిస్తాయి.
సెల్యులార్ నీవస్: ఈ రకం పుట్టుమచ్చల్లో రంగునిచ్చే పదార్థం ఉండదు. దాంతో రంగులేకుండా కనిపిస్తాయి.
మేషర్ నీవస్: డోమ్ షేప్‌లో, నున్నగా ఉండి, సాధారణంగా ముఖంపై వస్తాయి. ఉన్నా నీవస్: ఇవి తాకడానికి రఫ్‌గా ఉంటాయి. కాస్తంత ఉబ్బెత్తుగా ఉంటాయి. మేయర్‌సన్స్ నీవస్: ఇవి సాధారణ పుట్టుమచ్చలే అయినా వీటి చుట్టూ కాస్త ఎగ్జిమా వచ్చినట్లుగా ఉంటుంది.
హ్యాలోనీవస్ లేదా సట్టన్ నీవస్: వీటి చుట్టూ తెల్లటి ఖాళీ ప్రదేశం ఉన్నట్లుగా ఉంటుంది. సాధారణంగా ఈ తరహా మచ్చలు ఒకదశ తర్వాత చెరిగిపోతాయి.
రీడ్ నీవస్: ఇవి కాస్త చర్మం కంటే ఉబ్బెత్తుగా, దారపు కండె ఆకృతిలో (మధ్యన వెడల్పుగా అంచుల్లో సన్నగా) కనిపించే ముదురురంగు కలిగి ఉంటే మెలనోసైట్స్‌తో వచ్చే పుట్టుమచ్చలు. సాధారణంగా ఇవి కాళ్లూ, చేతుల(లింబ్స్)పై కనిపిస్తాయి.
రికరెంట్ నీవస్: కొన్నిసార్లు మనం ముదురు రంగు పుట్టుమచ్చను శస్త్రచికిత్స ద్వారా తొలగించినా, అక్కడ మళ్లీ మెలనోసైట్స్ వచ్చి, తొలుత ఉన్న పుట్టుమచ్చలాగే అభివృద్ధి చెందుతాయి. నిర్దిష్ట ఆకృతి లేకుండా ఉంటాయి.
ఆగ్మినేట్ నీవస్: కొన్ని పుట్టుమచ్చలన్నీ కలిసి ఒక పెద్ద పుట్టుమచ్చలా కనిపిస్తాయి. ఏక్రల్ నీవస్: ఈ తరహా పుట్టుమచ్చలు అరచేతిలో, అరికాళ్లలో కనిపిస్తాయి. నెయిల్ యూనిట్ నీవస్: ఇవి గోటిలోపల ఉండి, అక్కడ ఒక పొడవైన మచ్చలా గోరులోంచి కనిపిస్తుంటాయి.
సిగ్నేచర్ నీవై: ఇవి చాలా రకాలైన పుట్టుచ్చలన్నీ కలిసి ఒకే పుట్టుమచ్చగా కనిపిస్తాయి. ఇందులోనూ కొన్ని రకాలున్నాయి. అవి...
సాలిడ్ బ్రౌన్ నీవస్: వీటిలో ఒకే తరహా బ్రౌన్ పిగ్మెంట్ ఉంటుంది.
సాలిడ్ పింక్ నీవస్: ఇవి పింక్ రంగులో ఉంటాయి.
ఎక్లిప్స్ నీవస్: ఈ డార్క్ పిగ్మెంట్ ఉంగరపు ఆకృతిలో గుండ్రగా ఉంటుంది. సాధారణంగా మాడుపై ఎక్కువగా కనిపిస్తుంది.
కాకేడ్ నీవస్: ఇవి కూడా మధ్యన ఒక డార్క్ మచ్చ ఉండి, దాని చుట్టూ కాస్తంత లైట్, డార్క్ సర్కిల్స్ ఆకృతిలో కనిపిస్తుంటుంది.
ఫ్రైడ్ ఎగ్ నీవస్: ఆమ్లెట్ వేసినప్పుడు పచ్చసొన చుట్టూ తెల్లసొన ఉన్నట్లుగా కనిపించే కాంపౌండ్ నీవస్ ఇవి.
నీవస్ విత్ ఎక్సెంట్రిక్ పిగ్మెంటేషన్: ఈ తరహా మచ్చల్లో వేర్వేరు రంగుల మచ్చలు, డార్క్‌వి, లైట్‌వి ఉంటాయి.
పుట్టుమచ్చ ఎప్పుడు ప్రమాదకరం అంటే...
దాని పరిమాణం అకస్మాత్తుగా, విపరీతంగా పెరిగినా,
అకస్మాత్తుగా పుట్టుమచ్చలో దురద మొదలైనా...
పుట్టుమచ్చ నుంచి రక్తస్రావం మొదలైనా...
పుట్టుమచ్చలోంచి ఏవైనా స్రావాలు కనిపించినా...
పై నాలుగు అంశాల్లో ఏది కనిపించినా వెంటనే డర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మరచిపోవద్దు. ఎందుకంటే పై లక్షణాలకు ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే, అది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి నుంచి అంతగా కాపాడుతుంది.
నిర్వహణ: యాసీన్
పుట్టుమచ్చలతో ప్రమాదాలు గుర్తించడంఎలా::: పుట్టుమచ్చలతో వచ్చే ప్రమాదాలను మామూలుగా సాధారణ కంటితో చూసి గుర్తుపట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో డర్మటోస్కోపీ అనే పరీక్ష ద్వారా లేదా, పుట్టుమచ్చనుంచి కొంతభాగాన్ని సేకరించి బయాప్సీ (ముక్క పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. పుట్టుమచ్చలతో సాధారణంగా ఎలాంటి ప్రమాదం లేకపోయినా, ఒక్కోసారి అవి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అలాంటి ప్రమాదం రాకముందునుంచే జాగ్రత్తపడాలంటే, వాటి తాలూకు ఐదు అంశాలను తరచూ గమనిస్తూ ఉండాలి. అవే... ఏ, బీ, సీ, డీ, ఈ. అదెలాగంటే...
ఏ అంటే ఎసిమెట్రీ - మీ పుట్టుమచ్చ గతంలోని సౌష్ఠవాన్ని (సిమెట్రీని) కోల్పోయి కనిపించినా; అంటే మచ్చను మడతపెట్టినట్లుగా ఊహిస్తే అన్ని అంచులూ కలవనట్లుగా ఉన్నప్పుడు.
బీ అంటే బార్డర్ - పుట్టుమచ్చ అంచులు మారిపోయినా,
సీ అంటే కలర్ వేరియేషన్ - గతంలో ఆ మచ్చకున్న రంగుకు భిన్నంగా కనిపించినా; డీ అంటే డయామీటర్ - దాని వ్యాసం (సైజు) ఆరు మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా లేదా అది పెన్సిల్ ఎరేజర్ కంటే పెద్దదిగా అనిపించినా.
ఈ అంటే ఎలివేటెడ్ - అది ఉబ్బెత్తుగా (ఎంబోజింగ్ ఎఫెక్ట్‌తో) కనిపించినా... ఈ ఐదు గుణాల్లో ఏది మారినా అది చర్మ క్యాన్సర్ అయిన మెలనోమా కావచ్చు. అందుకే పుట్టుమచ్చల్లోని పై ఐదు లక్షణాలను తరచూ పరీక్షించుకుంటూ ఉండి, ఏదైనా మార్పు కనిపించగానే వెంటనే చర్మవ్యాధినిపుణులను సంప్రదించాలి.
పుట్టుమచ్చలు - సమస్యలు - చికిత్సలు :
పుట్టుమచ్చలతో అందానికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. వాటిని ఈ కింది విధాలుగా పరిష్కరించవచ్చు.
ఎలక్ట్రోకాటరైజేషన్: పుట్టుమచ్చ అసహ్యంగా అనిపిస్తే కరెంట్ ద్వారా దాన్ని తొలగించవచ్చు.
షేవ్ ఎక్సిషన్: పుట్టుమచ్చ పై పొరల్లోనే ఉంటే, దానిలోని మెలనోసైట్లను తొలగించడం.
పంచ్ ఎక్సిషన్: పుట్టుమచ్చ కాస్తంత లోపలి పొరల్లో ఉన్నా తొలగించడం.
ఎక్సిషన్ ఇన్ టోటో: శస్త్రచికిత్స ప్రక్రియతో పుట్టుమచ్చను పూర్తిగా తొలగించడం, ఈ ప్రక్రియలో కుట్లు వేయాల్సిన అవసరం ఉంటుంది.
క్రయోసర్జరీ: మైనస్ 140 డిగ్రీస్ వద్ద నిల్వ ఉంచిన లిక్విడ్ నైట్రోజన్ సహాయంతో
ఆధునిక పద్ధతుల్లో పుట్టుమచ్చను తొలగించే ఒకరకం ప్రక్రియ.
లేజర్: లేజర్ ద్వారా పుట్టుమచ్చను తొలగించే ప్రక్రియ.
Advertisement
Advertisement