మనీషా కోయిరాల, ప్రియా దత్
మనోధైర్యం
స్త్రీలకు శిరోజాల మీద ఉండే మమకారం అందరికీ తెలుసు. స్త్రీ సౌందర్యం శిరోజాలతోనే ముడిపడి ఉంది. కాని కేన్సర్ బాధితులు తమ చికిత్సలో భాగంగా మొదట కోల్పోయేది శిరోజాలనే. కిమోథెరపీలో శిరోజాలు ఎక్కువగా రాలిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో వ్యాధి వల్ల కలిగే వ్యాకులత కంటే శిరోజాల లేమి వల్ల కలిగే న్యూనత ఎక్కువగా ఉంటుంది. ఇది మగవారి కంటే ఆడవారినే ఎక్కువగా బాధిస్తుంది. ‘ఈ దశ తాత్కాలికమే. మళ్లీ శిరోజాలు వస్తాయి. కేన్సర్ బాధితులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వెంట్రుకలను కాపాడుకోవచ్చు. అందంగా తీర్చి దిద్దుకోవచ్చు’ అని ధైర్యమూ చైతన్యమూ ఇవ్వడానికి ముంబైలోని ‘నర్గిస్‌దత్ ఫౌండేషన్’ కొన్ని కార్యక్రమాలు చేస్తోంది.
నర్గిస్‌దత్–సునిల్‌దత్‌ల కుమార్తె, సంజయ్ దత్ సోదరి అయిన ప్రియా దత్ ఈ కార్యక్రమాలకు రూపకర్త. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో నటి మనీషా కోయిరాల ప్రత్యేకంగా వచ్చి కేన్సర్ బాధితులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. మనీషా కేన్సర్ సర్వైవర్ అనే సంగతి అందరికీ తెలుసు. ఒవేరియన్ కేన్సర్ బారిన పడి దానిని ధైర్యం ఎదుర్కొని దాని నుంచి బయటపడిన మనీషా ఆ సందర్భంలో అందరి మల్లే తానూ శిరోజాలను కోల్పోయారు. ఇప్పుడు మంచి కేశాలతో ఆమె అందరినీ ఆకట్టుకుంటున్నారు. ‘ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడి ఎదుర్కొనవచ్చు’ అని ఆమె అంటున్నారు.
మనీషా ఇప్పుడు ఉత్సాహంగా సినిమాల్లో కూడా నటిస్తున్నారు. సంజయ్ దత్ ఆత్మకథ ఆధారంగా రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఆమె నటిస్తున్నారు. నర్గిస్‌దత్ జీవితకథ ఆధారంగా రానున్న సినిమాలో ఆమె నర్గిస్‌దత్ పాత్రను పోషిస్తున్నట్టుగా కూడా వార్త. కష్టకాలం గడిచిపోతుంది... మంచి కాలం ఎప్పుడూ ముందు ఉంటుంది అనడానికి మనీషా ఒక ఉదాహరణ.