
మగాడి కోసం కొన్ని మొబైల్ యాప్స్!
వృత్తిగతమైన, వ్యక్తిగతమైన బాధ్యతలతో సూర్యుడితో పాటు నిద్రలేచే మగాడికి కొంచెం విరామం కావాలి... ఆ విరామంలో కొంత వినోదం కావాలి... ఏకాంతంగా ఉన్నప్పుడు, అవసరం అనుకొన్నప్పుడు అలరించే కొన్ని ఆనందాలు కావాలి... ఇలాంటి అవసరాలను గమనించి హాయ్ చెబుతున్నాయి కొన్ని మొబైల్ అప్లికేషన్లు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే, అందులో ఈ అప్లికేషన్లు ఉంటే సంపూర్ణమైన వినోదం దొరికినట్టే!
సంగీతం కోసం స్పాటిఫై...
మనసుకు ప్రశాంతతను ఇచ్చే వాటిలో సంగీతానికి మించిన సాధనం లేదు. అలాంటి సంగీతాన్ని స్టోర్ చేసుకోవడంలో స్పాటిఫైకి మించిన అప్లికేషన్ లేదు. ఇందులో లెక్కలేనన్ని మ్యూజిక్‌ట్రాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసే ఈ అప్లికేషన్ కొంచెం ఖరీదైనది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద పని చేస్తుంది.
ఎప్పటికప్పుడు స్పోర్ట్స్ సమాచారం...
అంతులేని వినోదాన్ని ఇచ్చేవి క్రీడలు. ఆడే అవకాశం లేకపోయినా వాటిని చూడటం కూడా వినోదమే. అలా చూసే అవకాశం లేనప్పుడు ఎప్పటికప్పుడు సమాచారం కావాలంటే స్ఫోర్ట్స్ ఛానల్ అప్లికేషన్లను స్టోర్‌చేసుకోవడమే. అప్‌డేట్స్‌ను, ఎప్పటికప్పుడు స్కోర్స్‌ను తెలుసుకోవడానికి అవకాశం ఇస్తాయి స్పోర్ట్ అప్లికేషన్లు. ఈఎస్‌పీఎన్, స్టార్ స్పోర్ట్స్ వంటి చానల్స్‌కు సంబంధించిన అప్లికేషన్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఐఓస్ అయినా, ఆండ్రాయిడ్ అయినా వీటి ఇన్‌స్టలేషన్ ఉచితమే!
ఆరోగ్యంపై అవగాహనకై....
ఇన్‌స్టంట్ హాట్‌రేట్
ఆరోగ్యం గురించి సెల్ఫ్ చెకింగ్‌కు ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్. టచ్‌స్క్రీన్ స్మార్ట్‌ఫోన్స్ తెరపై చూపుడు వేలిని పెడితే చాలు పల్స్ రేట్ డిస్‌ప్లే అవుతుంది. వ్యక్తిగత ఆరోగ్యం గురించి ఆసక్తిని ఉంటే ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది.
బ్యాంక్ ఖాతాల నిర్వహణ కోసం మనిల్లా
బ్యాంక్ బ్యాలెన్స్‌ను, బ్యాంక్‌స్టేట్‌మెంట్స్‌ను రికార్డు చేస్తూ ఉంటుంది ఈ అప్లికేషన్. నెల నెలా చెల్లించాల్సి పేమెంట్స్‌ను గుర్తు చేస్తూ గైడ్‌లా ఉపయోగపడుతుంది. ఉచిత అప్లికేషన్ ఇది.
గూగుల్ గాగుల్స్
ఈ అప్లికేషన్‌ను ఇచ్చినందుకు గూగుల్‌కు మరోసారి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు, అర్థం కాని విషయాలను తెలుసుకోవడానికి ఈ అప్లికేషన్ ఉపయుక్తంగా ఉంటుంది.ఫోటో తీసి దాన్ని అప్‌లోడ్ చేస్తే చాలు అందుకు సంబంధించిన సమాచారాన్ని అందించడం ఈ అప్లికేషన్ ప్రత్యేకత!