
అది, జపాన్‌లోని ఒక పాఠశాల. విద్యార్థులకు ఆటల పోటీలు జరుగుతున్నాయి. అంతా ఒకటి, రెండు తరగతులు చదివే చిన్న పిల్లలు. దూరం నుంచి పరుగెత్తుకొచ్చి ఒక హర్డిల్ దాటాలి. ఒక పిల్లాడు పరుగెత్తుకొచ్చాడు. ఊహు, శక్తి చాలలేదు. ఫెయిల్. మళ్లీ రెండోసారి మరింత దూరం నుంచి ఉరుకుతూ వచ్చాడు. అయినా లాభం లేదు. ఈసారీ ఆ ఎత్తు దగ్గర చిత్తయిపోయాడు. పరుగెత్తి వచ్చి, మూడోసారి మళ్లీ ఎగిరాడు. ప్చ్. అయినా జయం కలగలేదు. ఇక నాలుగోసారి కూడా దాన్ని దాటలేకపోయేసరికి పిల్లాడి కళ్లల్లో చెమ్మ. అప్పుడు జరిగిందో అద్భుతం! ఆ పిల్లలకు ఎవరూ ప్రత్యేకంగా అలా చేయమని చెప్పలేదు. అయినా ఆ అబ్బాయి క్లాస్‌మేట్స్ అందరూ వారి వారి స్థానాల్లోంచి పరుగెత్తుకొచ్చారు. పిల్లాడి వెన్నుతట్టారు. భుజం భుజం కలిపి గుండ్రంగా నిలబడ్డారు.ఆ భుజాల్లోంచి భుజశక్తి ఏమైనా ప్రవహిస్తుందా?
మళ్లీ పిల్లలంతా వెనక్కి వెళ్లి తమ తమ సీట్లలో కూర్చున్నారు. ఈ అబ్బాయి వెనక్కి పరుగెత్తాడు. పొజిషన్లో నిల్చుని, కొద్దిగా ముందుకు వంగి, శక్తి కూడదీసుకుని పరుగెత్తుతూ వచ్చి హర్డిల్ మీదుగా ఇట్టే లంఘించేశాడు. దానికి ఏమాత్రం తాకకుండా పిట్టలాగా అవతలికి దూకేశాడు. సక్సెస్!అందరమూ జీవితంలో పరుగెడుతున్నవాళ్లమే. హర్డిల్స్ దాటడానికి శాయశక్తులా కృషి చేస్తున్నవాళ్లమే. అవసరమైతే అందరికంటే ముందు దాటి ఆ ట్రోఫీ ఏదో చేతబట్టాలని కలలు కంటున్నవాళ్లమే. ఆ ట్రోఫీ కొందరికి పేరు ప్రఖ్యాతులు కావొచ్చు, మరికొందరికి డబ్బు సంపాదన కావొచ్చు, మరేదైనా కావొచ్చు. మనం ఆ హర్డిల్ దాటగలుగుతాం సరే. మరి దాటలేనివాళ్ల సంగతేమిటి? ఆ జపాన్ చిన్నారులు మనకేమైనా చెబుతున్నారా! ఒక సంస్కృతిగా మనం కూడా వారి ప్రోత్సాహగుణాన్ని అలవాటు చేసుకోగలగాలి. ముందు వెళ్లడంలో ఆనందం ఉంది; కానీ మనం మాత్రమే ముందుకు వెళ్లడంలో ఏమీలేదు. అందరమూ కలుపుకొని పోవాలి. అందరితో కలిసిపోవాలి. మనలోని చిట్టచివరి మనిషి కూడా గెలిచినప్పుడే ఆ గెలుపు నిజమైన గెలుపు అనిపించుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment