ఘోస్ట్‌ రైటర్‌ | Ghost Writer | Sakshi
Sakshi News home page

ఘోస్ట్‌ రైటర్‌

Nov 26 2017 12:13 AM | Updated on Nov 26 2017 12:13 AM

Ghost Writer - Sakshi

భూతవైద్యుడిలా, డేనియల్‌ వర్మ భూతకథకుడు. దెయ్యాలు, భూతాల కథలు తప్ప మనుషుల కథలు రాయడు. కమిటెడ్‌ రైటర్‌. మనిషి కూడా చూడ్డానికి దెయ్యంలాగే ఉంటాడు. దెయ్యాల కథలు రాసి రాసి డేనియల్‌ వర్మ అలా అయిపోయి ఉంటాడని చుట్టుపక్కల వాళ్ల అనుమానం. పత్రికల్లో తన కథతో పాటు రెగ్యులర్‌గా వచ్చే ఫొటోలో అరవై ఏళ్లవాడిలా కనిపిస్తాడు డేనియల్‌ వర్మ. నిజానికి డేనియల్‌ వర్మ ఆ వయసుకు రీచ్‌ అవడానికి ఇంకా పదేళ్ల టైమ్‌ ఉంది! ‘‘ఎవరో అమ్మాయి వచ్చింది మీ కోసం..’’ అని చెప్పింది కుంకుమ. దెయ్యాల గదిలో కూర్చొని దెయ్యం కథ రాసుకుంటున్నాడు డేనియల్‌ వర్మ.‘‘కూర్చోబెట్టు, కథ ఎండింగ్‌లో ఉన్నాను’’ అన్నాడు భార్యతో. కుంకుమ ఇక ఆయన్ని డిస్టర్బ్‌ చెయ్యలేదు.

 డేనియల్‌ వర్మ దెయ్యాల గదిలో తప్ప ఇంకో గదిలో కూర్చొని కథ రాయడు. ఓసారెప్పుడో భోజనానికి పిలిస్తే ఎంతకూ రావడం లేదని, ‘‘ఆ దెయ్యాల గది నుంచి డైనింగ్‌ హాల్లోకి వస్తారా లేదా?’’ అని కుంకుమ పెద్దగా పిలిచింది. అప్పట్నుంచీ అది దెయ్యాల గది అయింది. కథ రాయడం పూర్తయ్యాక ఒళ్లు, వేళ్లు విరుచుకుంటూ గది నుంచి బయటికి వచ్చి, హాలును దాటుకుని ముందు గదిలోకి వెళ్లాడు డేనియల్‌ వర్మ. ఆ గదిలో కూర్చొని ఉన్న అమ్మాయి చప్పున లేచి నిలబడింది. ‘‘నమస్తే అంకుల్‌. మీ కథలంటే నాకు ఇష్టం’’ అంది. నవ్వాడు డేనియల్‌ వర్మ. ‘‘కూర్చోమ్మా’’ అన్నాడు. ‘అమ్మా’ అనడం ఆ అమ్మాయికి నచ్చింది. చేతిలో ఉన్న స్వీట్‌బాక్సును పక్కన పెట్టి, వంగి అతడి కాళ్లకు నమస్కరించింది. ‘‘అయ్యో... ఎందుకు తల్లీ’’ అని, ఆ అమ్మాయిని పైకి లేపాడు.‘‘ఈ రోజు నా పుట్టినరోజు అంకుల్‌’’ అంది. 

‘‘అవునా! గాడ్‌ బ్లెస్‌ యు తల్లీ’’ అని, ఇంట్లోకి చూస్తూ ‘‘కుంకూ’’ అని పిలిచాడు డేనియల్‌ వర్మ. భార్యను అతడు అలాగే పిలుస్తాడు. పిలుపు కన్నా ముందే.. కుంకుమ టీ ట్రేతో వచ్చి ఆ అమ్మాయికి, భర్తకి ఇచ్చి, తనూ ఒక కప్పు తీసుకుని వాళ్లతోపాటు కూర్చుంది. ‘‘తన పుట్టిన రోజట’’ అని భార్యకు చెప్పి, ‘‘నీ పేరేమిటమ్మా?’’ అని అడిగాడు డేనియల్‌ వర్మ ఆ అమ్మాయిని. ‘‘ప్రతిమ’’ అని చెప్పింది. భార్యాభర్తలిద్దరూ వాత్సల్యంగా ఆ అమ్మాయి వైపు చూశారు. ప్రతిమ అందంగా ఉంది.   ‘‘చెప్పమ్మా.. ఎక్కడ ఉంటున్నావ్‌? ఏం చదువుతున్నావ్‌?’’ అని అడిగాడు డేనియల్‌ వర్మ. ‘‘ఇక్కడే ఉంటాను అంకుల్‌. మీ కథలు ఇష్టంగా చదువుతాను’’ అంది ప్రతిమ. నవ్వారు భార్యభర్తలిద్దరూ. ఇక్కడే ఉంటాను అంది కానీ, ఎక్కడ ఉంటోందో చెప్పలేదు ప్రతిమ. ఆ సంగతి డేనియల్‌ వర్మ గ్రహించాడు. ‘‘మీ కథలన్నీ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చదివాను అంకుల్‌. ఐ లవ్‌ టు ఎంజాయ్‌ యువర్‌ డెవిలిష్‌ స్టెయిల్‌ ఆఫ్‌ రైటింగ్‌’’ అంది ప్రతిమ.   ‘‘థ్యాంక్స్‌ అమ్మా’’ అన్నాడు. మళ్లీ అతడు ‘అమ్మా’ అనడం ప్రతిమకు నచ్చింది. 

ఒక్క క్షణం ఆగి మళ్లీ ఆ అమ్మాయే అంది..‘‘అంకుల్‌.. మీతోపాటే నేనూ మీ ఇంట్లో ఉండొచ్చా’’ అని!డేనియల్‌ వర్మ రాసే దెయ్యాల కథల్లో ఏదో ఒక క్యారెక్టర్‌ ఎక్కడో ఒకచోట కంపల్సరీగా గతుక్కుమంటుంది. ఫస్ట్‌టైమ్‌ డేనియల్‌ వర్మ గతుక్కుమన్నాడు.‘‘ఐయామ్‌ సీరియస్‌ అంకుల్‌. మీ ఇంట్లో.. ఆంటీతో, మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను’’ అంది ఆ అమ్మాయి వాళ్లిద్దర్నీ ఆర్ద్రతగా చూస్తూ. దెయ్యాల రైటర్‌గా డేనియల్‌ వర్మ ముప్పై ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి అనుభవం లేదు. ‘మీ కథ చదివి మా ఇంటిల్లపాదీ భయపడ్డాం’ అని ఉత్తరాలు రాసినవాళ్లే కానీ, ఇలా భయం లేకుండా ఇంటికొచ్చిన వాళ్లు లేరు. పైగా ఈ అమ్మాయి మీ ఇంట్లో ఉంటాను అంటోంది. కుంకుమ నవ్వింది. ‘‘ఆంటీ లవ్‌లీగా ఉన్నారు అంకుల్‌’’ అంది ప్రతిమ. థాంక్స్‌ చెప్పింది కుంకుమ.‘‘మిమ్మల్ని భర్తగా పొందడం ఆంటీ అదృష్టం అంకుల్‌’’ అంది ప్రతిమ.‘‘కాదు.. నా అదృష్టం’’ అన్నాడు డేనియల్‌ వర్మ. ‘‘కాదు.. కాదు.. నా అదృష్టమే’’ అంది కుంకుమ. 

‘‘మీ ఇంట్లో ఉండే అదృష్టాన్ని నాక్కూడా కొంచెం కలిగించండి ఆంటీ’’ అంది ఆ అమ్మాయి. డేనియల్‌ వర్మ నవ్వాడు.‘‘సరే.. మీ అమ్మానాన్నతో మాట్లాడి అలాగే మాతో ఉందువులే’’ అంది కుంకుమ. ఆ తర్వాత కూడా కొద్దిసేపు ఆ అమ్మాయితో ప్రేమగా మాట్లాడారు భార్యాభర్తలు. వెళ్లేటప్పుడు గేటు బయటి వరకు తోడుగా వెళ్లారు. ప్రతిమను సాగనంపి ఇంట్లోకి రాగానే డేనియల్‌ వర్మని గట్టిగా కావలించుకుంది కుంకుమ. డేనియల్‌ వర్మ ఆమెను ఇంకా గట్టిగా హత్తుకుని ముద్దుపెట్టుకున్నాడు. ఆమెను లవ్‌ చేసి పెళ్లి చేసుకున్నాడతను. చేసుకున్నాక అతడిని లవ్‌ చెయ్యడం మొదలుపెట్టింది ఆమె. భార్య అంటే అతడికి ఎంత ఇష్టమంటే.. ఆమె కాలేజీలో ఉండగా లవ్‌ చేసి, పెళ్లి చేసుకోలేకపోయిన డేనియల్‌ అనే అబ్బాయి పేరును తన పేరుకు ముందు పెట్టుకున్నాడు వర్మ! ఈ జన్మకిక పిల్లలొద్దు అని కుంకుమ అంటే.. ‘సరే’ అని కూడా అన్నాడు. 

ఆ రాత్రి ఇద్దరూ చాలాసేపు ప్రతిమ గురించి మాట్లాడుకున్నారు. ‘‘మనకే ఒక అమ్మాయి ఉండి ఉంటే ప్రతిమలా ఉండేది కదూ’’ అంది కుంకుమ. ‘నేనూ అదే అనుకున్నా’ అని భర్త అంటాడనుకుంది ఆమె. అయితే డేనియల్‌ వర్మ అలా అనలేదు. ‘‘ప్రతిమ మన కూతురు కాదని ఎందుకనుకుంటున్నావ్‌ కుంకూ’’ అన్నాడు.కుంకుమ నిర్ఘాంతపోయి చూసింది. ‘‘ఒకటి గమనించావా కుంకూ.. పెళ్లికి ముందు మీవాళ్లు నీకు అబార్షన్‌ చేయించిన రోజు, ఇవాళ మన ఇంటికి వచ్చిన ప్రతిమ పుట్టిన రోజు రెండూ ఒకటే..’’ అన్నాడు డేనియల్‌ వర్మ.‘‘అంటే.. ప్రతిమ..’’ అంటూ ఆగిపోయింది కుంకుమ. ‘‘మళ్లీ కనిపించకపోతే మనమ్మాయే... మన కోసం తిరుగుతోందని’’ అన్నాడు. ‘‘మళ్లీ కనిపిస్తే?’’ అంది కుంకుమ. ‘‘అప్పుడూ మనమ్మాయే. మన అమ్మాయి అనుకోవడం మనకు బాగుంది కాబట్టి’’ అన్నాడు.  ఆ తర్వాత కుంకుమ నిద్రపోయింది. డేనియల్‌ వర్మ చాలాసేపటి వరకు మేల్కొనే ఉన్నాడు. చనిపోయి దెయ్యం అయిన మనిషికి.. మనిషిగా చనిపోయిన రోజే దెయ్యంగా పుట్టినరోజు అవుతుందా అనే థాట్‌తో ఒక కొత్త కథకు ప్లాట్‌ తయారయ్యాకే అతడికి నిద్రపట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement