
అవును... నాక్కొంచెం తిక్కుంది!
గ్లామర్ పాయింట్
బెబో (కరీనా కపూర్) మాట్లాడినా అందమే, మాట్లాడకపోయినా అందమే. మాట్లాడితే మాత్రం ఎలాంటి మొహమాటాలు లేకుండా మాట్లాడుతుంది. ఆమె మాటల్లో కొన్ని... ‘సినిమానే నా ప్రపంచం...సినిమానే తాగుతాను, తింటాను...’ ఇలా ఏవేవో అంటూ ఉంటారు. నేను మాత్రం ఈ టైప్ కాదు. సినిమాకు అవతల చాలా ప్రపంచం ఉంది అనుకుంటాను. అందుకే నేను నటించిన సినిమాలను చూడడానికి కూడా ఇష్టపడను. సైఫ్‌కు నాకు మధ్య సినిమాల ప్రస్తావన ఎప్పుడూ రాదు. ఎందుకంటే సినిమాలే మా జీవితం కాదు ‘గోరి తేరే ప్యార్ మే’ సినిమాలో ‘కాస్త తిక్క ఉన్న అమ్మాయి’ పాత్రలో నటించాను. నిజజీవితంలో కూడా నేను అంతే. ఒక ప్రాజెక్ట్ నాకు నచ్చకపోతే ఎన్ని విధాలుగా చెప్పినా సరే నేను ‘నో’ అంటూనే ఉంటాను. అందుకే కొందరు నా గురించి ‘‘ఈ అమ్మాయికి కొంచెం తిక్క ఉంది’’ అని అనుకుంటారు!
‘ఇంత అందమైన జీవితం ఇచ్చావు. దేవుడా నీకు కృతజ్ఞతలు’ అని నేను ఎప్పుడూ చెప్పను. కాకపోతే ఒక కోరిక మాత్రం ఉంది. నేను అరవై సంవత్సరాల్లోకి ప్రవేశించినప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే... నన్ను నేను ‘యాక్టర్’గా గుర్తు తెచ్చుకోవాలి తప్ప ‘స్టార్’గా కాదు. ఎందుకంటే స్టార్‌లు వస్తుంటారు పోతుంటారు... నిలబడేది మాత్రం యాక్టరే!