తమిళసినిమా: డేరింగ్ అండ్ బోల్డ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్. పోడా పోడీ చిత్రం ద్వారా నటుడు శింబుకు కథానాయకిగా పరిచయమైన ఈమె తర్వాతి కాలంలో ట్రెండ్ మార్చుకుని ప్రతినాయకిగా అవతారం ఎత్తారు. అప్పటి నుంచి వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ప్రశంసలు, విజయాలు వరిస్తున్నాయి. ఇప్పుడు తమిళంతో పాటు తెలుగు, మలయాళం తదితర భాషల్లోనూ ఈమె కెరీర్ పీక్స్‌లో కొనసాగుతోంది.
నాయకిగా, ప్రతినాయకిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఏ పాత్రకైనా రెడీ అంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. తమిళంతో పాటు తెలుగులోనూ వరలక్ష్మి శరత్‌కుమార్‌కు మంచి డిమాండ్ ఉంది. సంక్రాంతి బరిలోకి దిగుతున్న బాలకృష్ణ కథానాయకుడుగా నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో ఈమె విలనిజం ప్రదర్శించారు. ప్రస్తుతం చేతిలో అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రతినాయకిగా నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు వరలక్ష్మి శరత్‌కుమార్ ఇటీవల ఒక భేటీలో బదులిస్తూ గ్లామర్ పాత్రలు తనకు వర్కౌట్ కాదని భావించానని, అయినా అలాంటి పాత్రలు చేయడానికి చాలామంది ఉన్నారని అన్నారు.
అందుకే తాను ప్రతినాయక బాటను ఎంచుకున్నానని తెలిపారు. ఇలాంటి కొన్ని పాత్రలు తానే చేయగలనని అభిప్రాయపడ్డారు. అయితే తనకు గురువు, దర్శకుడు బాల అని పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో తారై తప్పట్టై చిత్రంలో గరగాటకారిగా నటించి ప్రశంసలు అందుకున్నట్లు చెప్పారు. అయినా తాను ప్రతినాయకి పాత్రల్లో నటిస్తూ సంతోషంగానే ఉన్నానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment