గుడ్ బెటర్ బ్రెడ్ | Good Better Bread | Sakshi
Sakshi News home page

గుడ్ బెటర్ బ్రెడ్

Published Fri, Dec 12 2014 10:55 PM | Last Updated on Thu, Jul 11 2019 5:41 PM

గుడ్ బెటర్ బ్రెడ్ - Sakshi

గుడ్ బెటర్ బ్రెడ్

బ్రెడ్డు సూపర్లేటివ్ ఫుడ్డు.
నేరుగా తింటే గుడ్ .
కలిపి తింటే బెటర్.
కొత్తగా కనిపెట్టి చేస్తే.. బెస్ట్.
బ్రెడ్‌తో చేయగల ‘ది బెస్ట్’ ఐటమ్స్‌ని
ఫ్యామిలీ ఈవారం మీకు అందిస్తోంది.

 
బ్రెడ్ పిజ్జా

 
కావలసినవి: బ్రెడ్ స్లైసులు  - 6; ఉల్లిపాయ - 1 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి); టొమాటో - 1 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి); క్యాప్సికమ్ - 1 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి); మోజెరిల్లా చీజ్ - పైన వేయడానికి తగినంత; టొమాటో/పాస్తా/పిజ్జా సాస్ - 2 టేబుల్ స్పూన్లు; ఆలివ్ ఆయిల్ - 2 టీ స్పూన్లు; ఎర్ర మిరియాల పొడి - పైన చల్లడానికి తగినంత... తయారీ:   ముందుగా అవెన్‌ను 200 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి  బ్రెడ్‌స్లైసులను ఒక మూతతో గుండ్రంగా వచ్చేలా కట్ చేయాలి  మఫిన్ ట్రేకి నూనె పూసి, కట్ చేసిన బ్రెడ్‌లను దాని మీద ఉంచి గుంటలా వచ్చేలా చేయాలి  వాటి మీద టొమాటో లేదా పాస్తా సాస్‌ను ఒక పొరలా పూసి, పైన కూరముక్కలు వేయాలి  వాటి మీద చీజ్, ఆ పైన ఆలివ్ ఆయిల్, ఎర్ర మిరియాల పొడి వే సి, బేకింగ్ ట్రేలో ఉంచి అవెన్‌లో పెట్టాలి  సుమారు 10 నిమిషాలు ఉంచాక తీసేయాలి.
 
బ్రెడ్ గార్లిక్
 
కావలసినవి: బ్రెడ్ పిండి - అర కప్పు (సూపర్ మార్కెట్‌లో రెడీగా దొరుకుతుంది); ఈస్ట్ - టేబుల్ స్పూను; పాలు - పావు కప్పు; ఆలివ్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు; నువ్వు పప్పు - 2టీ స్పూన్లు; పంచదార - టేబుల్ స్పూను; ఉప్పు - టీ స్పూను; బటర్ - 3 టేబుల్ స్పూన్లు; పర్మేజన్ చీజ్ తురుము - 2 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి తురుము - టీస్పూను; కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు.... తయారీ:   అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి  ఒక పాత్రలో బ్రెడ్ పిండి, ఈస్ట్, పంచదార, ఉప్పు వేసి బాగా కలపాలి  చిన్న గిన్నెలో పాలు, నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి గోరువెచ్చగా కాచి, బ్రెడ్ మిశ్రమం ఉన్న గిన్నెలో పోసి పిండి సాగేలా అయ్యేవరకు సుమారు పది నిమిషాలు బాగా కలిపి పైన మూత ఉంచి సుమారు గంటసేపు పిండి రెట్టింపు అయ్యేవరకు నాననివ్వాలి  మరొకసారి బాగా కలిపి వెడల్పుగా అయ్యేలా చేతితో ఒత్తి సుమారు పది నిమిషాలు పక్కన ఉంచాలి  పాలతో నెమ్మదిగా బ్రష్ చేసి, పైన నువ్వుపప్పు చల్లాలి  అవెన్‌లో ఉంచి సుమారు 20 నిమిషాలు బేక్ చేయాలి  ఒక పాత్రలో వెల్లుల్లి తురుము, బటర్ తురుము, పర్మేజన్ చీజ్, కొత్తిమీర తురుము బాగా కలిపి ఉంచాలి  బేక్ అయిన బ్రెడ్‌ను సుమారు 20 నిమిషాలు చల్లారాక, బ్రెడ్‌ను స్లైసులుగా కట్ చేయాలి  సర్వ్ చేయడానికి ముందు, తయారుచేసి ఉంచుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని రెండు స్లైసుల మధ్య జాగ్రత్తగా చాకుతో పూసి, 200 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసిన అవెన్‌లో సుమారు ఏడెనిమిది నిమిషాలు ఉంచి తీసేయాలి.
 
ఎగ్‌లెస్ ఫ్రెంచ్ టోస్ట్
 
కావలసినవి:  బ్రెడ్ స్లైసులు - 6; కస్టర్డ్ పొడి - 2 టేబుల్ స్పూన్లు (వెనిలా); పంచదార - 2 టేబుల్ స్పూన్లు; పాలు - అర కప్పు; నెయ్యి - తగినంత
 
తయారీ:  పెద్ద పాత్రలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాక, కస్టర్డ్ పొడి, పంచదార వేసి బాగా కలిపి మిశ్రమం దగ్గర పడ్డాక దించేయాలి  నాన్‌స్టిక్ పాన్ వేడి (సన్న మంట మీద )చేసి కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి  బ్రెడ్ స్లైస్‌ను కస్టర్డ్ పొడి మిశ్రమంలో ముంచి పాన్ మీద వేసి, రెండువైపులా గోధుమరంగులోకి వచ్చేలా త్వరత్వరగా తిప్పుతూ కాల్చాలి  ఇష్టమైనవారు పైన పంచదారతో కలిపిన దాల్చినచెక్క పొడి మిశ్రమం కొద్దిగా చల్లుకోవచ్చు.
 
బ్రెడ్ ఉప్మా
 
కావలసినవి: బ్రెడ్ స్లైసులు - 4; ఉల్లిపాయ - 1; టొమాటో - 1; పచ్చి మిర్చి - 2; సాంబారు పొడి - టేబుల్ స్పూను; పసుపు - చిటికెడు; అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; కొత్తిమీర - చిన్న కట్ట; నిమ్మరసం - టీ స్పూను; నూనె - టేబుల్ స్పూను; ఆవాలు - టీ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; సెనగ పప్పు - టేబుల్ స్పూను; కరివేపాకు  - రెండు రెమ్మలు; జీడిపప్పులు - 10
 తయారీ:   బ్రెడ్ స్లైసులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి  టొమాటో, ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి  పచ్చి మిర్చిని ముక్కలు చేయాలి  బాణలిలో నూనె వేసి కాగాక, మినప్పప్పు, సెనగపప్పు, ఆవాలు, కరివేపాకు వరసగా ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి  ఉల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాక, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపాలి  టొమాటో తరుగు, జీడిపప్పులు, ఉప్పు జత చేసి ముక్కలు మెత్తబడే వరకు కలపాలి  పసుపు, సాంబారు పొడి వేసి ఒకసారి కలిపి, కొద్దిగా నీరు చిలకరించాలి  బ్రెడ్ ముక్కలు వేసి కలిపాక, నెయ్యి వేయాలి.  మంట బాగా తగ్గించి, సుమారు రెండు మూడు నిమిషాలు ఉంచి దించే ముందర టీ స్పూను నిమ్మరసం, కొత్తిమీర వేయాలి సూచన: కావాలనుకుంటే టొమాటో ముక్కల బదులు టొమాటో సాస్ ఉపయోగించవచ్చు.;  వైట్ బ్రెడ్ కంటె వీట్ బ్రెడ్ అయితే మంచిది.; ఇష్టపడే వారు పల్లీలను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని కూడా జత చేయవచ్చు.
 
బ్రెడ్ కార్న్ రోల్స్
 
కావలసినవి: బ్రెడ్ స్లైసులు - 4; క్రీమ్ కలిపి ఉడికించిన స్వీట్ కార్న్ - ముప్పావు కప్పు; ఉల్లి తరుగు - అర కప్పు; వెల్లుల్లి తరుగు - టీ స్పూను; మిరియాల పొడి - అర టీ స్పూను; టొమాటో సాస్ - తగినంత; ఉప్పు - తగినంత; కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు; నువ్వు పప్పు - టీ స్పూను; నూనె - టేబుల్ స్పూను
 
తయారీ:   బాణలిలో నూనె వేసి కాగాక వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి  ఉల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి  క్రీమ్ స్టయిల్ కార్న్ జత చేయాలి  ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్, పావు కప్పు నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి, వేసి పిండి గరిటెజారుగా కలపాలి  బాణలిలో నూనె పోసి కాచాలి  బ్రెడ్ స్లైసుల అంచులను తీసేసి, పల్చగా అయ్యేలా  అప్పడాల కర్రతో ఒత్తి, అందులో 2 టీ స్పూన్లు ఉల్లితరుగు, స్వీట్‌కార్న్ మిశ్రమం ఉంచి బ్రెడ్‌ను రోల్ చేయాలి  అంచులలో కార్న్‌ఫ్లోర్ పూసి, బ్రెడ్ అంచులను మూసేసి, వెంటనే కార్న్‌ఫ్లోర్‌లో బజ్జీ మాదిరిగా ముంచి, నువ్వు పప్పు మీద ఒకసారి దొర్లించి, కాగిన నూనెలో వేసి వేయించి, పేపర్ టవల్ మీదకు తీయాలి  టొమాటో సాస్‌తో అందించాలి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement