ఆయిల్ ఫ్రీడమ్ | good health for Oil Freedom | Sakshi
Sakshi News home page

ఆయిల్ ఫ్రీడమ్

Published Fri, Aug 12 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

ఆయిల్ ఫ్రీడమ్

ఆయిల్ ఫ్రీడమ్

అనారోగ్యం నుంచి ఫ్రీడమ్ కావాలి.
అజీర్తి నుంచి ఫ్రీడమ్ కావాలి.
స్థూలకాయం నుంచి ఫ్రీడమ్ కావాలి.
బద్దకం నుంచి ఫ్రీడమ్ కావాలి.
ఐ వాంట్ గుడ్ హెల్త్ !
నాకు ఆయిల్ నుంచి ఫ్రీడమ్ కావాలి.
ఓహో! వెరీ సింపుల్!!
ఓ ఉడుకు ఉడికించండి.
ఆరోగ్యాన్ని వడ్డించండి!!


వెజ్ క్రంచీ క్రిస్పీ కట్‌లెట్
కావలసినవి:  బంగాళదుంపలు-6 (ఉడికించి చిదమాలి)  బీన్స్ - 6 (తరిగి ఉడికించాలి)  బీట్‌రూట్ (మీడియం) - 1 (తురమాలి)  పచ్చిబఠాణి-అరకప్పు (ఉడికించి చిదమాలి) జీలకర్ర పొడి - అర టీ స్పూన్  సన్నగా తరిగిన అల్లం- ఒక టీ స్పూన్  పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి)  కారం - ఒక టీ స్పూన్; ఉప్పు - తగినంత  గరం మసాలా- ఒక టీ స్పూన్ జీడిపప్పు-10 (వేయించి పలుకులు చేయాలి) కొత్తిమీర  తరుగు - 2 టేబుల్ స్పూన్‌లు కార్న్‌ఫ్లేక్స్ - 2 కప్పులు (పొడి చేయాలి)  నిమ్మరసం - ఒక టీ స్పూన్


తయారీ: ఉడికించిన బంగాళదుంపలో బీన్స్, బఠాణి, బీట్‌రూట్ తురుము, జీడిపప్పు పలుకులు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్రపొడి, అల్లం, నిమ్మరసం వేసి బాగా కలపాలి. పై మిశ్రమాన్ని పెద్ద గోళీ అంత తీసుకుని గుండ్రంగా చేసి కార్న్‌ఫ్లేక్స్ పొడిలో అద్దాలి. కట్‌లెట్ ఆకారం వచ్చేలా మెల్లగా వత్తాలి. ఇలా మిశ్రమం మొత్తాన్ని చేసుకుని ఒక ప్లేట్‌లో సర్ది ఒవెన్‌లో 120 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఏడు నిమిషాల సేపు ఉంచాలి. కట్‌లెట్‌లను తిరగవేసి మరో ఏడు నిమిషాలు ఉంచాలి.

 
గమనిక: ఒవెన్‌కు బదులు మందపాటి పెనాన్ని వేడి చేసి కట్‌లెట్‌లను సర్ది సన్న మంట మీద నూనె వేయకుండా కాల్చుకోవచ్చు.

 

బేబీ కార్న్ పాలక్
కావలసినవి: పాలకూర- ఒక కట్ట బేబీకార్న్- ఆరు; జీలకర్ర- అర టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్లు- అర టీ స్పూన్  ధనియాల పొడి- ఒక టీ స్పూన్ నిమ్మరసం- అర టీ స్పూన్, ఉల్లిపాయ తరుగు - టేబుల్ స్పూన్: ఉప్పు - తగినంత, ఎండు మిర్చి- 2,  మీగడ- రెండు టేబుల్ స్పూన్‌లు (కావాలనుకుంటేనే)


తయారీ:   బేబీ కార్న్‌ను గుండ్రంగా తరిగి పావు టీ స్పూన్ ఉప్పు కలిపి, కొద్దిగా నీరు పోసి ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. పాలకూర శుభ్రంగా కడిగి వేడి నీటిలో వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. నీటిలో నుంచి తీసి చల్లార్చి మెత్తగా గ్రైండ్ చేయాలి.   నాన్‌స్టిక్ పెనంలో జీలకర్ర వేసి అవి పేలిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి వేసి సన్నమంట మీద రెండు నిమిషాల సేపు వేయించాలి. ఇప్పుడు పాలకూర పేస్టు, బేబీకార్న్ ముక్కలు (ఉడికించిన నీటితో సహా), ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. మంట తీసేసిన తరవాత నిమ్మరసం వేసి కలిపి మూతపెట్టాలి. చివరగా మీగడ కలుపుకోవచ్చు. ఖాళీ పెనంలో ఎండుమిర్చి, ఉల్లిపాయ వేయించి గార్నిష్ చేయాలి.

 
గమనిక: బేబీ కార్న్ బదులు పనీర్‌తోనూ చేసుకోవచ్చు. పనీర్‌ని ఉడికించనవసరం లేదు.

 

బ్రౌన్ రైస్ రిసోట్టో
కావలసినవి: ముడిబియ్యం (బ్రౌన్ రైస్) - 2 కప్పులు   (కడిగి మునిగేలా నీటిని పోసి అరగంట సేపు నానబెట్టి, వడపోయాలి) వెల్లుల్లి రేక - 1 (సన్నగా తరగాలి) తరిగిన ఉల్లిపాయ - 1/3 కప్పు వెజిటబుల్ స్టాక్ - 6 కప్పులు (నీటిలో క్యారట్, ఆనియన్,  బఠాణి, క్యాలిఫ్లవర్ అన్నీ కలిపి వందగ్రాములు ఉడికించాలి)  కొత్తిమీర- రెండు రెమ్మలు; మిరియాల పొడి- ఒక టీ స్పూన్  చీజ్ - అర కప్పు (సన్నగా తరగాలి)  బిర్యానీ ఆకు - ఒకటి; ఉప్పు- తగినంత

 
తయారీ: ఒవెన్‌ను 220 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసి అందులో వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలను రోస్ట్ చేయాలి.


వెడల్పాటి పాత్ర వంటి పెనంలో బియ్యం వేసి ఒక మోస్తరుగా వేడి చేసిన తర్వాత అందులో బియ్యం నానబెట్టిన నీటిని పోసి, బిర్యానీ ఆకు, చీజ్ తరుగు, ఉల్లి, వెల్లుల్లి పలుకులు, ఉప్పు వేసి ఉడికించాలి. 8-10 నిమిషాలలో తేమ ఆవిరవుతుంది. ఇప్పుడు కూరగాయలు ఉడికించిన నీటిని కలపాలి. అడుగు పట్టకుండా తేమ ఆవిరయ్యే వరకు రెండు-మూడు సార్లుగా కలపాలి. బియ్యం ఉడికిన తర్వాత మంట ఆపేసి మిరియాల పొడి చల్లి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. మెత్తగా కావాలనుకుంటే మరో కప్పు నీటిని వేడి చేసి చివరగా కలుపుకోవచ్చు.

 

క్యారట్ కుకుంబర్ సూప్
కావలసినవి: పెద్ద కీరకాయలు- 2 (చెక్కు తీసి తరగాలి) క్యారట్‌లు (చిన్నవి)- 2 (చెక్కు తీసి తరగాలి) ఉల్లిపాయ (పెద్దది) - 1 (తరగాలి) నీరు - 7 కప్పులు, ఉప్పు - తగినంత క్రీమ్ - 2 కప్పులు (కావాలనుకుంటేనే వేసుకోవాలి)


తయారీ: కూరగాయ ముక్కలలో నీటిని పోసి ఉడికించి మూతపెట్టాలి. 20 నిమిషాల తర్వాత మొత్తాన్ని బ్లెండ్ చేయాలి. ఇందులో ఉప్పు కలిపి సన్నమంట మీద ఉడికించాలి. క్రీమ్ వేసి లేదా అలాగే సర్వ్ చేయాలి.

 

వెజిటబుల్ స్టాక్
ఇది కూరగాయలు ఉడికించిన నీరు. క్యారట్, బీన్స్, బఠాణి, క్యాలిఫ్లవర్ వంటివి కొద్ది కొద్దిగా మిగిలిపోయి ఉన్నప్పుడు వాటికి ఓ ఉల్లిపాయను చేర్చి ఉడికించి చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. దీనిని సూప్, ఇతర కూరల్లోనూ వాడుకోవచ్చు. ఈ స్టాక్ నాలుగైదు రోజుల వరకు తాజాగా ఉంటుంది. 

చెఫ్: అరుణ్ కుమార్ హోటల్: తాజ్ వివంతా, బేగంపేట, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement