ఇంటర్నెట్ సేద్యానికి క్రోమ్ సాయం! | Google Chrome Key to enter the web world from PC | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్ సేద్యానికి క్రోమ్ సాయం!

Published Fri, Aug 23 2013 11:54 PM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

ఇంటర్నెట్ సేద్యానికి క్రోమ్ సాయం!

ఇంటర్నెట్ సేద్యానికి క్రోమ్ సాయం!

ఇంటర్నెట్‌కు, పీసీకి అనుసంధానమైంది గూగుల్ క్రోమ్.
 పీసీ నుంచి వెబ్ ప్రపంచంలోకి ప్రవేశించడానికి తాళంచెవి గూగుల్‌క్రోమ్.
 ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్‌లను చిత్తు చేస్తూ కంప్యూటర్‌లలో ఐకాన్ రూపంలో కొలువైనది గూగుల్‌క్రోమ్. ఈ గూగుల్ క్రోమ్‌తో చేయగల గమ్మత్తులెన్నో...
 క్లిక్ చేసి.. కావాల్సిన వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసుకోవడమేగాక ఇంటర్నెట్ సర్ఫింగ్‌ను సులభతరం చేసే, సరదాను తెచ్చే సదుపాయాలనెన్నో అందుబాటులో ఉంచింది క్రోమ్. అలాంటి వాటిలో కొన్ని... ఇవన్నీ క్రోమ్‌స్టోర్‌లో లభిస్తాయి...

 
 యాడ్ ఫ్రీ ఇంటర్నెట్ సర్ఫింగ్‌లో తేలియాడాలనుందా? వెబ్‌పేజ్ ఓపెన్ చేయగానే హాయ్ అంటూ వచ్చే అడ్వర్టైజ్‌మెంట్‌లతో విసుగొచ్చిందా? యూట్యూబ్ వీడియోలు చూస్తున్నప్పుడు మధ్యలో ప్రత్యక్షమయ్యే యాడ్ అవాంతరాలను నిరోధించాలనుందా? అయితే మీ గూగుల్‌క్రోమ్ బ్రౌజర్‌కు ‘యాడ్‌బ్లాక్’ను యాడ్ చేయండి. ఇది మీ నెట్‌బ్రౌజింగ్‌లో యాడ్‌లు లేకుండా చూస్తుంది. క్రోమ్‌లో మోస్ట్‌పాపులర్ ఎక్స్‌టెన్షన్ ఇది. దాదాపు రెండుకోట్ల మంది పీసీ ఓనర్లు ఈ పొడిగింపు సేవను ఇన్‌స్టాల్ చేసుకున్నట్టు క్రోమ్ గణాంకాలు చెబుతున్నాయి. ఇది పూర్తిగా ఉచితం.  
 
 స్క్రీన్‌షాట్స్ కోసం...
 స్క్రీన్‌షాట్ తీసుకోవడం అంటే అది అధునాతన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉపయోగించే వారికే పరిమితమైన సదుపాయం కాదు. పాతతరం విండోస్ ఓఎస్‌పై గూగుల్‌క్రోమ్‌తో కూడా ఈ గమ్మత్తు చేయవచ్చు. అందుకోసం చేయాల్సిందల్లా ‘ఆసమ్ స్క్రీన్‌షాట్స్’ ఎక్స్‌టెన్షన్‌ను జోడించుకోవడమే. వెబ్‌పేజ్‌ను ఇమేజ్ రూపంలోకి మార్చుకోవడానికి ఈ ఎక్స్‌టెన్షన్ ఉపయోగపడుతుంది. మొత్తం పేజ్ మాత్రమే కాకుండా వృత్త, చతుర స్ర, దీర్ఘ చతురస్రాకారాల్లో కూడా స్క్రీన్‌షాట్‌లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్క్రీన్‌షాట్ ఇమేజ్‌లు పీఎన్‌జీ ఫార్మాట్‌లో సేవ్ అవుతాయి.
 
 నాణ్యమైన ఇంగ్లిష్ రాత...
 ‘గ్రేట్ ఇంగ్లిష్ న్యాచురలీ’ అనే ట్యాగ్‌లైన్‌తో గ్రామర్ చెక్కర్, టెక్ట్స్‌రీడర్, పర్సనల్ ట్రైనర్, సెంటెన్స్ రిఫ్రెషర్‌గా ఉపయోగపడుతుంది ‘జింజర్’ ఎక్స్‌టెన్షన్. మీరు సెంటెన్స్ ఫార్మేషన్‌లో ఎంత వీక్ అయినా... స్పెల్లింగ్ మిస్టేక్ట్స్‌లో ఎంత పీక్‌అయినా... మీతో చక్కటి ఇంగ్లిష్ కంపోజ్ చేయించడం తన బాధ్యతగా తీసుకుంటుంది ఈ ఎక్స్‌టెన్షన్. పదాలను కాక వాక్యాలనే సజెషన్‌గా ఇస్తుంది. www.gingersoftware.com నుంచి ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
 ట్యాబ్‌ల వ్యూ కోసం...

 కంప్యూటర్ అంటే ఒక మిషన్. దానిమీద ఎంత పనిపెట్టినా అది చేయాల్సిందే..అనే భావనతో ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ఎక్కువ ట్యాబ్‌లు ఓపెన్ చేసి బాదే వారు చాలా మందే ఉంటారు. ఇలా బాదే ఉద్దేశమున్న వారు గూగుల్ క్రోమ్‌నే ఎంచుకుంటారు.  ఎందుకంటే ఇది గూగుల్ క్రోమ్‌తో మాత్రమే సాధ్యమయ్యే ఫీట్. ఒక్క గూగుల్ క్రోమ్‌విండోపై 20కి పైగా ట్యాబ్స్ ఓపెన్ చేసుకుని పనిచేసుకునే వారు ఎంతోమంది ఉన్నారు. ఇలా ఎక్కువ ట్యాబ్స్‌ను ఓపెన్ చేసుకోవడానికి అవకాశమిస్తున్న క్రోమ్ బ్రౌజరే... వాటి ప్రివ్యూ విషయంలో ‘టూ మెనీట్యాబ్స్’ అనే ఎక్స్‌టెన్షన్‌ను తీసుకొచ్చింది. ఓపెన్‌లో ఉన్న ట్యాబ్స్ విషయంలో విహంగవీక్షణానికి అవకాశమిస్తోంది ఇది.  
 
 ట్రాన్స్‌లేషన్‌కు కూడా...
 ఇంటర్నెట్ బ్రౌజింగ్ విషయంలో గూగుల్ ఎన్నో సదుపాయాలను తెచ్చి పెట్టింది. అవి కేవలం సౌకర్యవంతమైనవే కాదు, విశ్వసనీయమైనవి కూడా. అయితే ట్రాన్స్‌లేషన్ విషయంలోనే గూగుల్‌ను పూర్తిస్థాయిలో విశ్వసించలేం. వందశాతం కచ్చితమైన అనువాదాన్ని అందించలేకపోతోంది గూగుల్. ఇప్పటికే గూగుల్ హోమ్‌పేజ్‌లో ట్రాన్స్‌లేషన్ ఉంది. ఇది గాక ‘ఇన్‌స్టంట్ ట్రాన్స్‌లేట్’ క్రోమ్ ద్వారా లభించే ఎక్స్‌టెన్షన్. ఇంగ్లిష్ నుంచి ప్రాంతీయ భాషల్లోకి, ప్రాంతీయ భాషల మధ్య అనువాదంలో ఈ ఎక్స్‌టెన్షన్ కూడా ఫెయిల్యూర్. అయినా.. అంతర్జాతీయ భాషల మధ్య ట్రాన్స్‌లేషన్ వరకూ దీన్ని నమ్మవచ్చునేమో!
 
 ఫొటో ఎడిటింగ్ కోసం...
 ఇంటర్నెట్ బ్రౌజింగ్, వెబ్ సంబంధిత వ్యవహారాల్లోనే కాదు.. కొన్ని ఆఫ్‌లైన్ సేవలను కూడా అందిస్తోంది గూగుల్ క్రోమ్. ఫొటోగ్రఫీకి సంబంధించి రిచ్ అండ్ ఆర్టిస్టిక్ ఫీల్ తీసుకువచ్చే ‘బీ ఫంకీ’ ఎక్స్‌టెన్షన్‌ను అందుబాటులో పెట్టింది. సాధారణ ఫొటోగ్రఫీ ఎడిటింగ్స్ అయిన బ్యాడ్‌లైటింగ్, డిజిటల్ నాయిస్ వంటి వాటిని ఒకే క్లిక్‌తో సవరించుకోవచ్చు. కట్, రొటేట్, అడ్జెస్ట్ మెంట్‌తో పాటు 190 రకాల ఫొటో ఎఫెక్ట్‌లను యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
 
 సైట్‌లోని సమాచారాన్ని బుక్‌గా మారుస్తుంది...
 వెబ్ బ్రౌజింగ్ సమయంలో సైట్‌లోని ఇన్ఫర్మేషన్ అంతా చదివే అవకాశం ఉండదు, చదవాలనుకునే సమయంలో ఇంటర్నెట్ ఉండదు.. అంటూ ఫీల్ అయ్యే వారికి ఒక మంచి సదుపాయం డాట్ ఇ పబ్. ఒక వెబ్ పేజ్‌లోని సమాచారాన్ని ఆన్‌లైన్ కనెక్షన్ ఉన్నప్పుడే కాకుండా, సిస్టమ్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా చదువుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఎక్స్‌టెన్షన్. వెబ్‌పేజ్‌ను డివైజ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని, సేవ్ చేసుకుంటే... ఈ అప్లికేషన్ ఆ టెక్ట్స్ డాటాను ఒక ఇ-బుక్‌గా మార్చేస్తుంది.
 
 దాచే యొచ్చు, రీస్టోర్ చేసుకోవచ్చు...

 ఇంటర్నెట్‌ను సరదాగా ఉపయోగిస్తాం, సీరియస్‌గా ఉపయోగిస్తుంటాం, ‘రహస్యం’గా ఉపయోగిస్తుంటాం.. ప్రొఫెషనల్‌గా కావొచ్చు, పర్సనల్‌గా కావొచ్చు.. కొన్నిసార్లు పక్కవారు మన పీసీ దగ్గరకు వచ్చినప్పుడో, హఠాత్తుగా బ్రౌజర్‌ను క్లోజ్ చేయాల్సి వచ్చినప్పుడు ‘ప్యానిక్ బటన్’ ఉపయోగకరం. అనుకోకుండా వచ్చే డిస్ట్రబెన్స్‌తో మొత్తం ట్యాబ్‌లన్నింటినీ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ప్యానిక్ బటన్ మీద క్లిక్ చేస్తే అవన్నీ ఆటోమెటిక్‌గా సేవ్ అవుతాయి. ట్యాబ్‌లన్నీ ఒక బుక్‌మార్క్‌గా సేవ్ అయ్యుంటాయి. అవసరైమైనప్పుడు తిరిగి వాటన్నింటినీ ఒకేసారి రీస్టోర్ చేసుకోవచ్చు.  
 
 వీడియోలను  కన్‌వర్ట్ చేయొచ్చు...
 యూట్యూబ్ నుంచి స్మార్ట్‌ఫోన్, ఐఫోన్‌లకు తగిన ఫార్మాట్‌లో వీడియోలను కన్‌వర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ టూల్. ఒకే క్లిక్‌తో వీడియోను ఎమ్‌పీ3, ఎమ్‌పీ4, ఏవీ1, డబ్ల్యూఎమ్‌వీ, త్రీజీపీ ఫార్మాట్‌లోకి మార్చుకోవచ్చు. http://www.freemake.com/free_youtube_converter ద్వారా ఈ ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకోవచ్చు.
 
 రిఫ్రెష్‌మెంట్ లుక్ కోసం...
 కొత్త ట్యాబ్‌ను ఓపెన్ చేయగానే అందులో అనవసరమైన యాడ్స్ లేకుండా.. ఫ్రెష్ అట్మాస్పియర్ కలిగించేలా డేట్, టైమ్, వెదర్ తదితర సమాచారాన్ని ఇచ్చే వెబ్‌పేజ్ డిస్‌ప్లే అవ్వడానికి ‘కరెంట్లీ’ ఎక్స్‌టెన్షన్ ఉపయోగపడుతుంది.
 
 ఇష్టమైన పేజ్‌ల డిస్‌ప్లే కోసం...
 ఇది కూడా కొత్త ట్యాబ్‌ను క్లిక్‌చేసినప్పుడు డిస్‌ప్లే అయ్యే రిఫ్రెష్‌మెంట్‌పేజ్. మీరు తరచూ క్లిక్ చేసే పేజ్‌లు, ఉపయోగించే అప్లికేషన్‌లను డిస్‌ప్లే చేస్తుంది ఈ ఎక్స్‌టెన్షన్.
 
 వాయిస్ కమాండ్స్ హైలెట్...
 మీరు వేరే పనిలో ఉన్నప్పుడు మీ మెయిల్‌కు వచ్చే మెయిల్స్ సారాంశాలను చదివి వినిపిస్తాయి. గూగుల్ క్రోమ్‌కు ఇటువంటి ఎక్స్‌టెన్షన్స్ లభిస్తాయి. ఇంకా వాయిస్‌ను రికగ్నైజ్ చేసి టైప్ చేసే ఎక్స్‌టెన్షన్‌లున్నాయి.
 
 ఇన్‌స్టలేషన్ చాలా సులభతరం...
 ఈ ఎక్స్‌టెన్షన్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం కష్టమూ కాదు, వాటిని కొనుక్కోవాలనే భయమూ లేదు. వీటిని ఒకే క్లిక్‌తో యాడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సేద్యాన్ని సులభతరంగా, సౌకర్యవంతంగా చేయొచ్చు!
                 
 - జీవన్ రెడ్డి.బి

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement