పూర్వం అరబ్బు సమాజంలో కట్టు బానిసత్వం ఉండేది. బానిసను పశువుకంటే హీనంగా చూసేవారు యజమానులు. ఏదైనా తేడా వస్తే గొడ్డును బాదినట్లు బాదేవారు. రెండు పూటలా తిండి దొరికితే చాలన్నట్లు బానిసలు గొడ్డు చాకిరీ చేసేవాళ్లు. ఆ కాలంలో నీగ్రో జాతికి చెందిన హజ్రత్ బిలాల్ (రజి) అనే కట్టు బానిస ఉండేవారు. ఆయన ఒకరోజు తాను ఇస్లామ్ ధర్మం పట్ల ఎలా ఆకర్షితులయ్యారో వివరించారు. ‘‘నాకు ఒకరోజు తీవ్ర చలి జ్వరం సోకింది. బండెడు చాకిరీ చేయించే నా యజమాని అంత జ్వరంలోనూ ఎన్నో కిలోల బార్లీ విసరాలని పురమాయించాడు. చలికి తోడు జ్వరం ఇబ్బందిపెట్టడంతో కంబళి కప్పుకొని పాలు తాగి కాసేపు విశ్రాంతి తీసుకుందామని మేను వాల్చేసరికి నిద్రపట్టింది. అంతలోనే అటుగా వచ్చిన నా యజమాని నేను నిద్రించడం చూసి నన్ను గొడ్డును బాదినట్లు నిర్దయగా కొట్టాడు. చలిజ్వరంతో బాధపడుతున్నానన్న కనికరం కూడా చూపకుండా నా ఒంటిపై కంబళిని లాక్కొని పిండి విసరాలని నిర్బంధించాడు. చేసేదేం లేక రోదిస్తూ బార్లీ గింజలను విసుర్రాయిలో వేసి బలాన్ని కూడగట్టుకుని విసరసాగాను. అంతలో ముహమ్మద్ ప్రవక్త (సఅసం) అటు పక్కనుంచే వెళుతున్నట్లున్నారు. నేను మూలుగుతున్న శబ్దానికి లోనికి వచ్చి ‘‘ఎందుకేడుస్తున్నావు. ఏం కష్టమొచ్చింది’’ అని అడిగారు. దానికి నేను ‘పోపో నీ పని నువ్వు చూసుకో. అందరూ అడిగేవారే కానీ ఆదుకునేందుకు ఎవ్వరూ ముందుకు రారు.
పోపో’ అని విసుక్కున్నాను. నా మాటలకు ప్రవక్త మహనీయులు అక్కడినుంచి వెళ్లిపోయారు కానీ కాసేపటికే వారు ఒక చేతిలో వేడి వేడి పాలచెంబు, మరో చేతిలో ఖర్జూరాలను తీసుకొచ్చారు. పాలను తాగించారు. ఖర్జూరాలను తినిపించారు. ఆ తరువాత నన్ను ‘‘వెళ్లి కంబళి కప్పుకొని హాయిగా విశ్రాంతి తీసుకో, నీ బదులు నేను విసురుతాను.’’ అని విసుర్రాయి తిప్పడం మొదలెట్టారు. ఉదయాన్నే లేవగానే రాత్రంతా పట్టిన పిండిని నాకు అప్పజెప్పి వెళ్లిపోయారు. రెండోరోజు రాత్రి కూడా ప్రవక్త మహనీయులు పాలచెంబు, ఖర్జూరాలతో ప్రత్యక్షమయ్యారు. నన్ను వెచ్చటి దుప్పటిలో నిద్రపుచ్చి విసుర్రాయి విసరసాగారు. ఇలా మూడు రోజులు ప్రవక్త మహనీయులు నా పని తన భుజాలపై వేసుకుని నాకు విశ్రాంతి కల్పించారు. మూడోరోజు ఉదయాన్నే ప్రవక్త వెళుతుండగా నేను ఆయనను ఆలింగనం చేసుకుని ‘మీగురించి సమాజం తప్పుగా మాట్లాడుతోంది. మీపై బురదజల్లేందుకు మీగురించి దుష్పచ్రారం చేస్తున్నారు. బానిసలపట్ల జాలి, దయ, కరుణ చూపే మీరు నిజంగా దేవుని ప్రవక్త అని నేను విశ్వసిస్తున్నానని విశ్వాసం ప్రకటించాను.’’ అని చెప్పుకొచ్చారు. బలహీను లకు అండగా నిలిచేవారే నిజమైన నేతలు, ప్రవక్తలు.
– ముహమ్మద్ ముజాహిద్
బలహీనులకు అండ మహా ప్రవక్త
Published Wed, Nov 21 2018 12:03 AM | Last Updated on Wed, Nov 21 2018 12:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment