
కోల్‌కతాలోని బెంగాలీ కుటుంబంలో జన్మించారు భారతీ ముఖర్జీ(1940–2017). ఒకే కాంపౌండులో సుమారు యాభై మంది నివసించేంత పెద్ద ఉమ్మడి కుటుంబం వాళ్లది. పన్నెండు వేల మంది భారతీయులు మాత్రమే అమెరికాలో ఉంటున్న కాలంలో అమెరికాలో స్థిరపడిన తొలితరం భారతీయుల్లో భారతీ ముఖర్జీ ఒకరు. అమెరికా కంటే ముందు ఆమె కొన్నేళ్లు కెనడాలో జీవించారు. సహజంగానే ఇరు దేశాల మధ్యన సాంస్కృతిక తేడాలు, వర్ణ వివక్ష, భయాందోళనలు ఆమె రచనల్లోకి ప్రవేశించాయి. పరదేశంలోని పరాయితనం ఒకవైపూ, తిరిగి మాతృదేశానికి వచ్చినప్పుడు గుర్తించలేనంతగా జరిగిన మార్పులు మరోవైపూ ఆమె పాత్రలు అనుభవిస్తాయి.
భారతీయ స్త్రీగా అధిగమించాల్సిన అవరోధాలు ఉండనే ఉన్నాయి. ‘ఒక మరణం, మరెన్నో పునర్జన్మలు’. ‘జాస్మిన్’, ‘ద టైగర్స్ డాటర్’, ‘వైఫ్’ ఆమె ప్రసిద్ధ నవలలు. తనను తాను అమెరికా రచయితగానే భావించుకున్న భారతీ ముఖర్జీ, అమెరికా బహుళత్వంలో తానూ భాగమంటారు. 1985లో సిక్కు ఉగ్రవాదులు పేల్చిన విమాన బాంబులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల ఆత్మఘోష నేపథ్యంలో సాగే ‘ద మేనేజ్‌మెంట్ ఆఫ్ గ్రీఫ్’ కథ ఎన్నో అమెరికా కథాసంకలనాల్లో చోటు చేసుకుంది. కెనడా రచయిత క్లార్క్ బ్లెయిజ్‌ను ఆమె వివాహమాడారు. ఇద్దరూ కలిసి ‘డేస్ అండ్ నైట్స్ ఇన్ కోల్‌కతా’ రాశారు.