
గ్రామీణుల నోటిగాథలు, పౌరాణిక పాత్రలతో కూడిన కథలు, దయ్యాల కథలు ఆసక్తిగా వినేవాడు లూ షన్ (1881–1936) చిన్నతనంలో. అసలు పేరు ఝో షురెన్. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ సంపద తరిగిపోవడమూ, ఒక కేసులో తండ్రికి శిక్ష పడి జైలు పాలై, ఆనక మరణించడమూ, చిన్న ఉద్యోగంలో కుదురుకోవడానికి కుటుంబ ప్రతిష్ట అడ్డుపడటమూ లాంటి కారణాలతో ఇంటిపరువు తీయకుండా ఉండేందుకు కలంపేరు వైపు మొగ్గాడు. హన్ చైనీయులు విధిగా ఉంచుకునే ముందంతా గుండుతో వెనకాలి పొడవాటి జడను కత్తిరించుకున్నాడు. బోధనారంగంలో పనిచేశాడు. డాక్టర్ కావాలనుకుని వైద్యం చదవలేకపోయినందువల్ల, కనీసం సాహిత్య వైద్యునిగా మారాలనుకున్నాడు. ఆయన ‘ఎ మాడ్‌మాన్స్ డైరీ’ని చైనా మొదటి ఆధునిక కథగా చెబుతారు. ‘కాల్ టు ఆర్మ్స్’, ‘వాండెరింగ్’ ఆయన కథా సంకలనాలు. మావో జెడాంగ్ ఎంతో అభిమానించిన రచయిత. సామ్యవాద భావనలవైపు మొగ్గు ఉన్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీలో చేరలేదు. చైనా ఆధునిక సాహిత్యంలో దిగ్గజంగా పేరొందిన లూ షన్ విమర్శకుడు, సంపాదకుడు, అనువాదకుడుగానూ సేవలందించాడు. శృంగార సంబంధాల వల్ల చెడిన కుటుంబ బంధాలు, అధిక మద్యం, క్షయ ఆయన్ని మృత్యువు వైపు త్వరగా నడిపించాయి.