ఆదాయంలో మిన్న.. మడోన్నా
యాభై ఏళ్లు దాటిపోయినా.. బిజీ బిజీగా టూర్లు తిరిగేస్తూ, పాప్ సాంగ్స్‌తో ఉర్రూతలూగిస్తున్న మెటీరియల్ గర్ల్ మడోన్నా.. నిరంతరం వివాదాలతో డోన్ట్ కేర్ అన్నట్లుగా కనిపించినా డబ్బు, పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తుంది. అందుకే మహిళా పాప్ సింగర్స్‌లో మొట్టమొదటి బిలియనీర్‌గా ఎదిగింది. ఆల్బమ్స్, బిజినెస్ వెంచర్స్, రియల్ ఎస్టేట్, తన పేరిట అమ్ముడయ్యే వస్తువులు, ప్రకటనలు.. ఇలాంటివన్నీ ఇందుకు తోడ్పడ్డాయి. తెలివైన పెట్టుబడి నిర్ణయాలూ సహకరించాయి.
కేవలం సంగీతానికి మాత్రమే పరిమితం కాకుండా... దానితో ముడిపడి ఉన్న ఇతరత్రా సాధనాలన్నింటి నుంచి ఆదాయాన్ని ఆర్జించడం.. డబ్బు విషయంలో మడోన్నాకి ఉన్న దూరదృష్టిని తెలియజేస్తుంది. తన పేరు, పాటలకు ఉన్న పాపులారిటీని బాగానే క్యాష్ చేసుకుంటుంది మడోన్నా.
అందుకే మెటీరియల్ గర్ల్ పేరిట దుస్తులు, పాదరక్షల కలెక్షన్‌ని ప్రవేశపెట్టింది. వీటి నుంచి ఏడాదికి సగటున 1 కోటి డాలర్ల పైగా ఆదాయం వస్తోంది. అలాగే, ట్రూత్ ఆర్ డేర్ పేరుతో విడుదల చేసిన పెర్ఫ్యూమ్ అమ్మకాలతో ఏకంగా ఆరు కోట్ల డాలర్లు వస్తున్నాయి. అటు స్మిర్నాఫ్ వోడ్కా, హార్డ్ క్యాండీ జిమ్ సెంటర్స్‌తో ఒప్పందాలూ ఇతోధికంగా ఆర్జించి పెట్టాయి.
పాప్ మ్యూజిక్ పరిశ్రమ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ .. తనకు రావాల్సినది రాబట్టుకునే విషయంలో మడోన్నా అస్సలు రాజీ పడదు. తన పేరును వాడుకునేందుకు లెసైన్స్ ఇవ్వడం, ఆల్బమ్స్‌ను విక్రయించడం, పాప్ షోలను నిర్వహించడం తదితర అంశాలన్నీ చూసుకునే కంపెనీ నుంచి అత్యంత కష్టతరమైన పరిస్థితులలో కూడా 12 కోట్ల డాలర్లు రాబట్టింది. వీటా కోకో అనే హెల్త్ డ్రింక్ కంపెనీలో ఆమె 10 లక్షల పౌండ్లు పెట్టుబడి పెట్టగా అది కొన్నాళ్లలోనే 70 లక్షల పౌండ్లు తెచ్చిపెట్టింది.
ఈ రకంగా మొత్తం మీద వంద కోట్ల డాలర్ల (సుమారు రూ. 6 వేల కోట్లు) సంపదను సాధించింది. ఇలా 54 ఏళ్ల వయస్సులోనూ యువ ఆర్టిస్టులను ఎదుర్కొంటూ, పాపులారిటీ తగ్గకుండా చూసుకుంటూ.. కోట్లు ఆర్జిస్తూ.. సంపాదనను కాపాడుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతోంది మడోన్నా.