తల్లికి ఒక పేరు ఉంటుందని పిల్లలకు గుర్తుండదు. తమకు జన్మనిచ్చిన ఆ మూర్తి పేరు.. అమ్మ. అంతే. అయినా ఎంత మంచి పేరున్నా ‘అమ్మ’ అనే పేరు కన్నా మంచి పేరు ఉంటుందా?!
హీరోలు కథల్లో ఉంటారు. సినిమాల్లో ఉంటారు. పాఠకులను, ప్రేక్షకులను ఉత్తేజపరుస్తుంటారు, జీవితాలకు కావల్సినంత స్ఫూర్తిని నింపుతుంటారు. అయితే అలాంటి హీరోలు జీవితంలోనూ ఉంటారు. అసలు ఎవరి జీవితానికి వాళ్లే హీరోలు. మనలో ప్రతి ఒక్కరి దగ్గరా మన జీవితాలకే కాదు మరో పదిమందికి స్ఫూర్తినిచ్చే ప్రేరణశక్తి ఉంటుంది. అలాంటి ఒక ప్రేరణ, ఒక స్ఫూర్తి ప్రదాత మా అమ్మ అంటోంది నికితా శెట్టి.
ఈ అమ్మాయిది ముంబై. ‘మా అమ్మ పర్వతాలను కదిలించేటంత ప్రేమను పంచుతుంది. ఆమెలో ఓ పోరాటయోధురాలు ఉంది. స్థిరంగా ఉంటూ సమస్యల్ని సంయమనంతో చక్కదిద్దే చాతుర్యమూ ఉంది. నా జీవితంలో నేను చూసిన ఏకైక హీరో ఆమె. ఒక్కమాటలో చెప్పాలంటే ‘మా అమ్మ ఉక్కుమహిళ’ అంటోంది నికిత ఉద్వేగంగా. ఇటీవల ఆమె తల్లి గొప్పతనం గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది.
బాధ్యతల బరువు
‘‘మా అమ్మ పదహారేళ్లకే తల్లిలేని పిల్లయింది. మా అమ్మమ్మ కేన్సర్‌తో పోయింది. ఆమె పోవడంతో ఆ ఇంటిని ఓ కుదుపు కుదిపేసినట్లయింది. మా అమ్మకు వచ్చిన కష్టం తల్లిని కోల్పోవడం ఒక్కటే కాదు. వాళ్ల నాన్న ఒక్కసారిగా కుంగిపోయాడు. ఆ క్షణం నుంచి ఆ ఇంటి బరువును మోయాల్సిన బాధ్యత ఆమె మీద పడింది.
తమ్ముళ్లకు, చెల్లికి తల్లి అయింది. కాలేజీకి పోతూ సాయంత్రాలు పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసింది. ఆ వంద రూపాయలే ఇంటి సరుకులకు ఆధారం. డిగ్రీ పూర్తి కాగానే డైమండ్ వ్యాపార దుకాణంలో ఉద్యోగంలో చేరి చిన్న పిల్లలను చదివించే బాధ్యత తలకెత్తుకుంది. చెల్లికి పెళ్లి చేసింది. ఆ తర్వాత తాను పెళ్లి చేసుకుంది.
కష్టాలకు ఎదురీత
‘‘నాన్నను పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితం ఒక ఒడ్డుకు చేరిందనే అనుకుంది అమ్మ. నిండా ఐదేళ్లు గడిచాయో లేదో 1999లో ఓ ప్రమాదం. అమ్మ జీవితంలో అది ఒక హఠాత్పరిణామం. నాన్న పోవడం ఆమెను మరింతగా రాయిలా మార్చేసింది. కష్టాలకు ఎదురీదడానికి తనను తాను మరింత దృఢంగా మార్చుకుంది.
తన జీవితానికి అన్నీ తానే, తనకు ఆసరాగా ఎవరూ లేరనే వాస్తవం ఆమెలో నిర్వేదాన్ని నింపలేదు. నాకు అమ్మానాన్న తానే అయి తీరాలనే నిజం ఆమెను నడిపించింది. నాన్న పోయిన ఆరేళ్లకు మేము సొంత ఫ్లాట్‌కు మారాం. బ్యాంకు లోన్, ఫ్లాట్ రిజిస్ట్రేషన్ వంటి క్లిష్టమైన పనులన్నీ సొంతంగా చేసుకుంది. వర్కింగ్ ఉమన్, ఇండిపెండెంట్ ఉమన్ ఎలా ఉంటే సొసైటీలో మనగలదో ఆమెను చూసి నేర్చుకోవాలి.
నమ్మకమే.. శక్తి
‘‘నాకు ఊహ తెలిసిన తరవాత ఇన్నేళ్లలో అమ్మ పని నుంచి సెలవు తీసుకున్నది పది రోజులే. తనకు ఎదురైన ప్రతి సవాల్‌కూ సమాధానం వెతుక్కుంటూ సాగిపోయేది అమ్మ. నాకు ఎందులోనూ తక్కువ చేయకుండా, నన్ను ఎప్పుడూ ఫస్ట్‌గా ఉంచడానికే ప్రయత్నిస్తుండేది. అలాగని నన్ను మరీ గారాం చేస్తూ ఏమీ పెంచలేదు. చాలా స్ట్రిక్టుగా ఉండేది. కొంచెం ఓల్డ్ స్కూల్ పెంపకం మా అమ్మది.
నాకు మంచి ఫ్రెండ్ కూడా అమ్మే. ‘నీకింత ధైర్యం, శక్తి ఎక్కడ నుంచి వస్తాయి? అని అడిగితే, ‘ఈ విశ్వంలో ప్రతి దానిని నడిపించేది దేవుడు. ఆ దేవుడే నన్ను కూడా నడిపిస్తున్నాడు. ఆ నమ్మకమే నా శక్తి’ అంటుంది. నేను అమ్మలో సగం అయినా కాగలనా అనిపిస్తుంటుంది. నేను చూసిన రియల్ హీరో ఆమె. నేను ఈ రోజు సగర్వంగా నిలబడగలిగానంటే అమ్మ వల్లనే’’ అని చెప్పింది నికిత.
ఈ పోస్ట్‌కి విపరీతమైన ఆదరణ వచ్చింది. ఇందులో కొసమెరుపు ఏమిటంటే... నికితా శెట్టి తన కథనంలో ఆద్యంతం ‘మా అమ్మ మాఅమ్మ’ అంటూనే చెప్పింది తప్ప అమ్మ పేరు చెప్పనేలేదు. పిల్లలకు తల్లికి ఒక పేరు ఉంటుందని గుర్తుండదు. తనకు జన్మనిచ్చిన ఆ మూర్తి పేరు.. అమ్మ. అంతే.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment