అమ్మాయిలకో అకాడమీ.... | Grils cricket Academy .... | Sakshi
Sakshi News home page

అమ్మాయిలకో అకాడమీ....

Published Fri, Apr 4 2014 11:12 PM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

అమ్మాయిలకో అకాడమీ.... - Sakshi

అమ్మాయిలకో అకాడమీ....

దేశంలోనే ఏకైక క్రికెట్ శిక్షణ కేంద్రం అత్యున్నత స్థాయి సౌకర్యాలు

భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల శిక్షణ కోసం బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) పని చేస్తోంది. ప్రధాన టోర్నీలకు ముందు ప్రత్యేక క్యాంప్, ఆటగాళ్లు గాయపడితే పునరావాస కార్యక్రమాలకు ఎన్‌సీఏ వేదికగా ఉంటోంది. అయితే ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న మహిళా క్రికెట్‌కు కూడా అలాంటి ఒక అకాడమీ ఎందుకు ఉండకూడదు? ఆలోచన వచ్చిందే తడవుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) దీనిని ఆచరణలో పెట్టింది. ఫలితంగా దాదాపు మూడున్నరేళ్ల క్రితం గుంటూరులో జాతీయ మహిళా క్రికెట్ అకాడమీ ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా మహిళల కోసం బీసీసీఐ తరఫున నిర్వహించబడుతున్న ఏకైక అకాడమీ ఇదే కావడం విశేషం.
 
గుంటూరులోని ఉమెన్ క్రికెట్ అకాడమీ   పనితీరు,  సాధిస్తున్న ఫలితాలు  బీసీసీఐ గుర్తించింది.  పురుషుల కోసం ఉన్న బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీ స్థాయిలో మహిళా క్రికెటర్లకు గుంటూరు ఏసీఏ ఉమెన్ అకాడమీని ప్రధాన కేంద్రంగా చేసింది.  దాదాపు అండర్-16, 19 దగ్గర నుంచి సీనియర్ ఉమెన్ క్రికెట్ జట్లకు ఈ అకాడమీలో కోచింగ్ క్యాంప్‌లు నిర్వహించి శిక్షణ  ఇస్తున్నారు.  అంతే కాకుండా సౌత్‌జోన్ ఇంటర్ స్టేట్, బీసీసీఐ  ఉమెన్ క్రికెట్ టోర్నీలు కూడా ఇక్కడ  నిర్వహిస్తున్నారు. ఏసీఏ ఉమెన్ వింగ్ చైర్మన్ నరేంద్రనాథ్‌చౌదరి సారథ్యంలో  ఉమెన్ క్రికెట్ అకాడమీలో విదేశీ మహిళా కోచ్ మారియా ఫాహే (న్యూజిలాండ్), బీసీసీఐ లెవల్-2 కోచ్ ఎస్.  శ్రీనివాసరెడ్డి కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు.

దాదాపు అన్ని ఏజ్ కేటగిరీల్లో  ఆంధ్ర ఉమెన్ క్రికెట్ జట్లు ఇక్కడ శిక్షణ పొందుతున్నాయి. సౌత్‌జోన్,  జాతీయ స్థాయి కోచింగ్  క్యాంప్‌లు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఏసీఏ  ఉమెన్ క్రికెట్ అకాడమీ నుంచి స్నేహదీప్తి(విశాఖపట్నం) టీమిండియాకు ఆడగా, సీహెచ్.ఝాన్సీలక్ష్మి (గుంటూరు), మేఘన(కృష్ణా) బీసీసీఐ ప్రెసిడెంట్స్ ఎలెవన్, ఆర్.కల్పన(కృష్ణా) బీసీసీఐ చాలెంజర్స్ ట్రోఫికి ఎంపికైంది. వీరంతా భవిష్యత్తులో  టీమిండియాలో ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  
 
అన్నీ ఇక్కడే...
 
గుంటూరులోని మంగళగిరి జేకేసీ కళాశాల ఆవరణలో ఈ అకాడమీని ఏర్పాటు చేశారు.  మహిళా అకాడమీలో మొత్తం నాలుగు ప్రాక్టీస్ వికెట్‌లు ఉన్నాయి. దీంతో పాటు సమీపంలోనే అదనంగా ఆస్ట్రోటర్ఫ్, సిమెంట్ వికెట్ కూడా ఏర్పాటు చేశారు. వీటిపై కదిలే (మూవబుల్) నెట్స్ పెట్టి ప్రాక్టీస్ చేస్తారు. అమ్మాయిల ఫిట్‌నెస్ కోసం అధునాతన జిమ్ కూడా అందుబాటులో ఉంది. శిక్షణ పొందుతున్న క్రీడాకారిణులకు ఇక్కడ రెసిడెన్షియల్ సౌకర్యం ఉంది.  ఇక్కడ మొత్తం 16 గదులు ఉన్నాయి. ఇందులో 12 డబుల్ బెడ్ రూమ్‌లు కాగా, మరో నాలుగు సింగిల్ బెడ్ రూమ్‌లు. మొత్తం 50 మందికి ఇక్కడ వసతి సౌకర్యం ఉంది.
 
ఎంపిక ఇలా...
 
సాధారణంగా ఈ అకాడమీలో ఆంధ్ర సీనియర్ జట్టుకు రెగ్యులర్‌గా శిక్షణా శిబిరం కొనసాగుతుంది. దాంతో పాటు భారత జట్టుకు, సీనియర్ సౌత్‌జోన్ టీమ్‌లకు కూడా ఇక్కడ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. అయితే వీరితో పాటు వర్ధమాన క్రీడాకారిణులను తీర్చిదిద్దేందుకు ఏసీఏ పూర్తి స్థాయి శిక్షణను అందిస్తోంది. ఏసీఏ పరిధిలోని 13 జిల్లాలను మూడు జోన్లుగా విభజించారు. ముందుగా జిల్లా స్థాయిలో, ఆ తర్వాత జోనల్ స్థాయిలో సెలక్షన్స్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రతిభ గలవారిని ఎంపిక చేసి అండర్-16, అండర్-19 జట్లుగా విభజించారు. ఎంపికైన ప్లేయర్లకు పూర్తిగా ఉచిత శిక్షణ లభిస్తుంది. తగిన ఫీజు చెల్లించి ఇతర రాష్ట్రాల క్రీడాకారిణులు కూడా ఇక్కడ శిక్షణ పొందవచ్చు. గుంటూరులో మహిళా అకాడమీ నెలకొల్పిన తర్వాతే ఆంధ్ర జట్టు జోనల్, జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించడం విశేషం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement