చెప్పాలని ఉంది! వినేవాళ్లున్నారా?
దేశంలో మహిళలపై నిత్యం ఏదో ఒక చోట దౌర్జన్యమో, అఘాయిత్యమో జరక్కుండా తెల్లారడం లేదు. దీనిని మహిళల దుస్థితి అనే కన్నా, పురుషుల దురహంకారం అనడం సబబు. మహిళల్లో ఏ ఒక్క వర్గం మీదనో మగవాళ్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారనేందుకు లేదు. వయోభేదం లేకుండా; ధనిక, పేద వ్యత్యాసం లేకుండా, సగటు మనుషులు, సెలబ్రిటీలు అని లేకుండా మహిళలు లైంగిక వివక్షకు, ఇతర దురాగతాలకు గురవుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి గౌహర్‌ఖాన్ అలాంటి బాధితుల జాబితాలో చేరారు. ముంబైలో నవంబర్ 30న షూటింగ్ జరుపుకుంటున్న ‘ఇండియాస్ రా స్టార్’ రియాల్టీ షో చివరి ఘట్టానికి గౌహర్‌ఖాన్ యాంకరింగ్ చేస్తున్నప్పుడు ప్రేక్షకులలోంచి ఒక యువకుడు వేగంగా వేదిక మీదకు వచ్చి ఆమె చెంపను ఛెళ్లుమనిపించాడు! ఆ చర్యకు నిశ్చేష్టురాలైన గౌహర్ వేదిక మీదే వలవల ఏడ్చేశారు.
బౌన్సర్లు ఆ ఆగంతకుడిని పట్టి, పోలీసులకు అప్పగించారు. ‘‘ఎందుకు కొట్టావు’’ అని అడిగినప్పుడు అతడు చెప్పిన సమాధానం... ‘‘ముస్లిం అయి ఉండీ ఒంటి నిండా బట్టలు వేసుకోనందుకు అలా బుద్ధి చెప్పాను’’ అని!! నిజానికి అతడి దుశ్చర్య వెనుక పురుషాహంకారం తప్ప మరొక ఉద్దేశం లేదు. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడేందుకు అతడేమీ కంకణం కట్టుకుని అక్కడకు రాలేదు. మిగతా అందరిలా తనూ ‘షో’ను తిలకించడానికే కదా వచ్చాడు.
ఇలాంటిదే ఇటీవలి ఘటనే మరొకటి. హరియానా (చండీగఢ్) లో కాలేజీకి వెళుతున్న ఇద్దరు అమ్మాయిలను బస్సులో కొందరు ఆకతాయులు అసభ్యకరమైన చేష్టలతో వేధించారు. విసిగిపోయిన ఆ అమ్మాయిలు తిరగబడి వారికి బుద్ధి చెప్పారు.
అసలెందుకు మగవాళ్లు ఆడవాళ్ల పట్ల ఇంత దురహంకారంతో ప్రవర్తిస్తారు? వీళ్ల ధోరణిలో ఎలా మార్పు తేవడం? సాటి మనుషులుగా మహిళల బాధలను, ఇబ్బందులను, అసౌకర్యాలను ఎందుకని మగవాళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారు. వీళ్లకు ఎలా చెబితే, ఎవరు చెబితే మారతారు? ఈ ప్రశ్నలకు తరాలుగా సమాధానాలను వెతుకుతూనే ఉన్నాం. ప్రయోజనం మాత్రం శూన్యం. ఈక్రమంలో మగవాళ్ల కళ్లు తెరిపించేందుకు కోరా.కామ్ అనే సైటు ఒక చిన్న ప్రయత్నం చేసింది. ఈ దేశపు మగవాళ్లకు మీరేం చెప్పదలచుకున్నారు అని వివిధ రంగాలలోని మహిళలను అడిగింది. వారిలో కొందరు తమ పేరును వెల్లడించవద్దన్న షరతుతో తమ మనోగతాన్ని వెలిబుచ్చారు. వాటిలో ఆసక్తికరమైన కొన్ని అభిప్రాయాలివి:
► నేను ఆడపిల్లను అయిన కారణంగానే నీ ప్రవర్తన తీరు మారితే కనుక నువ్వు నా నుంచి మర్యాదను ఆశించకు.
► ఆడపిల్ల నవ్వితే చేటు అనే మాటలో నిజం లేదు.
► క్లబ్బులకు, పార్టీలకు వెళ్లే అమ్మాయిలు కూడా మంచి భార్యగా ఉండగలరు.
► దయచేసి మా శరీరాకృతుల గురించి కామెంట్ చెయ్యకండి. అది మాకు ఇబ్బందికరంగా ఉంటుంది.
► తమ దారిన తాము పోయే అమ్మాయిలను వెకిలిగా చూస్తూ ఏదో ఒక మాట అనేయడం వల్ల మీరు గొప్పవాళ్లైపోతారా?
► మీ గర్ల్‌ఫ్రెండ్‌ని గానీ భార్యను గానీ మీ అమ్మగారితో పోల్చకండి. ఎందుకంటే వారు మీ అమ్మ కాదు కదా. మిమ్మల్ని మీ అమ్మచూసుకున్నట్లే వాళ్లూ తమ పిల్లల్ని చూసుకోగలరు.
► అధునాతనంగా ఉన్నంత మాత్రాన అందుబాటులో ఉన్నట్లు కాదు. స్నేహంగా ఉన్నంత మాత్రాన మీకు పడిపోడానికి సిద్ధంగా ఉందనీ కాదు.
► మీకో అబ్బాయి ఉన్నట్లయితే అతను కూడా మీలాగే ఉండాలని కోరుకుంటారా? మీకో అమ్మాయి ఉన్నట్లయితే మీలా ఉండే వ్యక్తే ఆమెకు భర్తగా దొరకాలని ఆశిస్తారా? ఈ రెండు ప్రశ్నలకు ‘కాదు’ అనేదే మీ సమాధానం అయితే మీరేమిటో మీకు తెలిసే ఉంటుంది.
మంచి తల్లి అవడానికి అందం, ఆకర్షణ ఉండనక్కర్లేదు. ఆ సంగతి గుర్తించండి.
► మీ భావోద్వేగాలను అణుచుకోలేకపోయినంత మాత్రాన మీరు మాకేమీ లోకువైపోరు. కన్నీళ్లొస్తే రానివ్వండి. కానీ మమ్మల్ని కన్నీళ్లు పెట్టనివ్వకండి.
► ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఒక బాధ్యతగా భావించండి. దాన్నొక అవకాశంగా తీసుకోకండి.
► మీ కూతుళ్లను ఇల్లు కదలొద్దని కట్టడి చేసేకంటే, మీ కొడుకులను ఆడపిల్లల పట్ల సరిగా ప్రవర్తించమని చెప్పడం మంచిది.
ఇదండీ సంగతి. అబ్బాయిలూ/పురుషోత్తములూ... వింటున్నారా?