ఆడవాళ్లకు మాత్రమే!
నేపాల్‌లో బస్సు ప్రయాణం అంటే మామూలు విషయమేమీ కాదు. ఒక బస్సులో ఒకటిన్నర బస్సు ప్రయాణికులు కనిపిస్తారు. కూరగాయలన్నింటినీ ఒకేదానిలో పట్టించాలన్నట్లు ఒక చిన్నమూటలో కుక్కేస్తుంటారు చూడండి... అలా కిక్కిరిసిన బస్సులో అష్టకష్టాలు ఎదురైనా...ప్రయాణించడం మాత్రం అనివార్యం! ఎందుకంటే అందరూ సొంత వాహనాలు సమకూర్చుకోలేరు కదా. ఇక మహిళల విషయానికి వస్తే... బస్సు ప్రయాణం అనేది నరకాన్ని తలపింపజేస్తుంది. ముఖ్యంగా లైంగికవేధింపులు. వీటికి భయపడి ఉద్యోగం మానుకున్న మహిళలు కూడా ఉన్నారు.
కాగా బస్సుల్లో మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల లైంగిక వేధింపులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మహిళలకు మాత్రమే ప్రత్యేకించిన మినీ బస్సులను ప్రవేశపెట్టింది.‘‘ఖాట్మండ్‌లో మరిన్ని ఉమెన్-ఓన్లీ బస్సులను ప్రవేశపెట్టాలని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయి’’ అంటున్నారు నేపాల్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ అధ్యక్షుడు భరత్ నేపాల్.