![He Went Abroad As A Child From The Hamlet And Made Unlimited Money - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/21/hoem.jpg.webp?itok=QXETw27r)
అతడు ఒక కుగ్రామం నుండి చిన్నప్పుడే విదేశాలకు వెళ్లిపోయి అపరిమితంగా డబ్బు సంపాదించాడు. పాతికేళ్ల తర్వాత సంపాదన మీద విసుగొచ్చి తన స్వగ్రామానికి తిరిగొచ్చి గ్రామ స్వరూపం చూసి నివ్వెరపోయాడు. చిన్నప్పుడు తన స్నేహితులతో ఈత కొట్టిన కాలువగట్లు, కోతికొమ్మచ్చి ఆడిన పచ్చని చెట్లు, విశాలమైన వీధులు, మండువా లోగిళ్లు అన్నీ మాయమైపోయాయి! ఉదయాన్నే పక్షుల కిలకిలరావాలు, నాగళ్లు భుజాన వేసుకుని పొలాలకు వెళ్లే రైతులు, పచ్చని పంట పొలాలు, అన్నా.. అక్కా.. తాతా.. మామా.. అంటూ పిలుచుకునే ఆప్యాయత నిండిన జనాలు ఎక్కడా కనిపించలేదు. రహదారి విస్తరణలో ఆధునిక సౌకర్యాలతో తన చిన్ననాటి గ్రామం ఆనవాళ్లు కూడా మిగల్లేదు! ఆనాటి గ్రామాన్ని మళ్లీ పునరుద్ధరించాలని అనుకున్నాడు.
తన దగ్గరున్న డబ్బుతో ఒక పెద్ద స్థలం ఖరీదు చేసి తను చిన్నప్పుడు తిరిగిన గ్రామంలా తయారు చేశాడు. విశాలమైన మట్టి రహదారులు, దగ్గర్లో చెరువులు, కాలువగట్లు, వాటిపక్కన ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి అడవుల్లో ఉన్న పచ్చని చెట్లను తీసుకొచ్చి నాటించాడు. ఒక చలనచిత్రంలో వేసే కృత్రిమ కళాకృతిలా పాత గ్రామం కనిపించేట్టు చేశాడు. ఊళ్లో తిండిదొరక్క పై ఊళ్లకు వలస వెళ్లిపోయిన తన చిన్ననాటి స్నేహితులను పిలిపించి వారికి గృహాలు కట్టించి బతకడానికి డబ్బు కూడా ఇచ్చి ఆ గ్రామంలో నివాసం ఏర్పాటు చేశాడు. కానీ ఎన్నాళ్లయినా ఉదయాన్నే పొలాలకెళ్లే రైతులు, ఆప్యాయత ఒలికించే పిలుపులు వినిపించడం లేదు! పైగా ‘విదేశాలకి వెళ్లి బాగా సంపాదించి మనకి పెట్టాడు. అలాగని విద్యుత్ సౌకర్యంలేని ఈ పల్లెటూళ్లో ఎన్నాళ్లుండగలం?’ అంటూ రుసరుసలాడసాగారు!
– లోగిశ లక్ష్మీనాయుడు
Comments
Please login to add a commentAdd a comment