అతను చాలా పేదవాడు. అయితేనేం, మానవత్వం మెండుగా ఉన్నవాడు. తను కష్టపడి సంపాదించినదానిలోనే తనకన్నా పేదలకు సాయం చేస్తుంటాడు. అనాథలకు, వృద్ధులకు సేవ చేస్తుంటాడు. ఓ రోజు రాత్రి అతను బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. వచ్చేటప్పుడు తెచ్చుకున్న ఆహారంలో అధికభాగం ఆకలితోఅలమటించిపోతున్న ఓ అభాగ్యుడికి ఇచ్చేశాడు. మిగిలింది తిని, మేనువాల్చగానే కళ్లు మూతలు పడ్డాయి. కాసేపటిలోనే గాఢనిద్రలోకి జారిపోయాడు. అర్ధరాత్రివేళ అద్భుతమైన సుగంధ పరిమళాన్ని మోసుకు వస్తున్న గాలి వీచింది. చంద్రుడి కాంతి లాంటి చల్లటి వెలుగేదో తన ఇంటిలో మెరుపులు సృష్టిస్తోంది. కళ్లు తెరిచి చూశాడు. అక్కడ ఒక దేవదూత కూర్చుని ఉంది. ఆమె తల వంచుకుని తన వద్ద ఉన్న పుస్తకంలో ఏదో రాసుకుంటోంది. ఆమె దగ్గరకి Ðð ళ్లి, ‘అమ్మా! ఎవరు మీరు? ఏమి రాస్తున్నారు?‘ అని అడిగాడు. ‘దేవుడంటే ఎంతమందికి ప్రేమ, భక్తి ఉన్నాయో తెలుసుకుని వారి పేర్లను ఈ పుస్తకంలో రాస్తున్నాను’ అని చెప్పిందామె. ‘ఆ పుస్తకంలో నా పేరు ఉందేమో చూసి చెప్పమ్మా!‘ అడిగాడు ఆత్రుతగా. వెంటనే పుస్తకమంతా వెదికి పెదవి విరిచిందామె. ‘అవునులే, ఎలా ఉంటుంది మరి, తోటి వారికి సాయం చేయడం, కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవడం.. అంతకు మించి నేను పూజలేమీ చేయను. కనీసం గుడికి కూడా వెళ్లనెప్పుడూ’’ అంటూ నిట్టూర్చాడతను. దేవదూత నవ్వుతూ వెళ్లిపోయింది.
కొద్దిరోజుల తర్వాత మళ్లీ ఒక అర్ధరాత్రి అంతకుమునుపు కలిగిన అనుభవమే ఎదురైందతనికి. కళ్లు తెరిచి చూశాడు. అప్పుడు కనిపించిన ఆమే మళ్లీ ఏదో రాసుకుంటూ కనిపించింది. ఆమె చేతిలోని పుస్తకాన్ని అలాగే చూస్తున్నాడతను. ఈసారి అతనేమీ అడగకుండానే దేవదూత అతనివైపు చూసి నవ్వింది చల్లగా. ‘ఏంటి అలా చూస్తున్నావు, ఇది దేవుడు ప్రేమించే వారి పేర్లు ఉన్న పుస్తకం. చూస్తావా?’ అనడిగింది.
‘తప్పక చూస్తాను తల్లీ!‘ అంటూ అతను ఆ పుస్తకాన్ని అందుకున్నాడు. తన పేరు ఎలాగూ ఉండదని వెనకనుంచి అందులోని ఒక్కోపేజీ తిరగేస్తున్నాడు. తన పేరు ఎక్కడా కనిపించడం లేదు. కొంచెం బాధతోటీ, అపనమ్మకంతోటీ అలా తిరగేస్తూ మొదటిపేజీకి వచ్చాడు. ఆశ్చర్యం! అందులోని మొదటి పేరు తనదే! దేవుడిని అందరూ ప్రేమిస్తారు. కానీ దేవుడి ప్రేమను అందుకోవాలంటే ముందు మన తోటివారిని ప్రేమించగలగాలి.
– డి.వి.ఆర్.
దేవుడి పుస్తకం
Published Sat, Dec 1 2018 5:02 AM | Last Updated on Sat, Dec 1 2018 5:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment