ఆమెకు 60  ఇప్పుడు అనుమానం | Her age 60 but she Suspicion her husband | Sakshi
Sakshi News home page

ఆమెకు 60  ఇప్పుడు అనుమానం

Published Thu, Jan 31 2019 12:08 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

Her age 60 but she Suspicion her husband - Sakshi

ఇంతకుముందు ‘ఎమ్టీనెస్ట్‌ సిండ్రోమ్‌’ గురించి మాట్లాడాం. వృద్ధ దంపతులు.. పిల్లలు దగ్గర లేకపోవడం వల్ల ఎన్నో మానసిక వ్య«థలకు గురి అవుతారు.అలాంటి వ్యధే.. ‘లేట్‌ ఆన్‌సెట్‌ సైకోసిస్‌’ కూడా.పిల్లల్లాగే, భర్తా దూరమైపోతాడేమోనన్న మానసిక స్థితి ఇది. షష్టిపూర్తి అయిపోయినా.. దంపతులు ప్రేమించుకోవడమే కాదు.. ప్రేమను వ్యక్తం చేసుకోవడమూ అవసరమే అంటున్నారు డాక్టర్లు.

అమ్మ ఎలా ఉంది నాన్నా? వారానికి ఒకసారి ఫోన్‌ మోగుతుంది. అమెరికా నుంచి అబ్బాయి. ‘ఎలా ఉన్నావు నాన్నా’ ‘బాగున్నారా’ ‘అమ్మ ఎలా ఉంది?’ ‘బాగుంది. దానికేం?’ ‘ఏమైనా కావాలా నాన్నా’ ‘నాకేం కావాలిరా? నీకేమైనా కావాలంటే చెప్పు పంపుతా’ ‘ఏం అక్కర్లేదు నాన్నా.. ఇక్కడ ఏం కావాలన్నా దొరుకుతుంది. ఉండనా?’ ఫోన్‌ పెట్టేస్తాడు. మరి కాసేపట్లో ఫోన్‌ మోగుతుంది. అమెరికా నుంచే.ఈసారి అమ్మాయి. ‘ఫోన్‌ దగ్గర పెట్టుకోండి నాన్నా. కాల్‌ చేసినప్పుడు ఎత్తరు’ ‘వాకింగ్‌కు వెళ్లానమ్మా’ ‘కాదులెండీ... అమ్మ ఏదో తెమ్మనుంటుంది వెళ్లుంటారు’ ‘సరిగ్గా చెప్పావు’‘అమ్మను మరీ గారాం చేస్తారు మీరు. అమ్మ ఎలా ఉంది? బాగుంది కదా’‘అయ్యో... దానికేం తల్లీ... బ్రహ్మాండంగా ఉంది’‘ఈ సంవత్సరం కూడా రావడం కుదిరేలా లేదు నాన్నా. పిల్లలకు ఎగ్జామ్సు. ఇంకా ఈయనకు కూడా లీవు దొరకదు’‘పర్లేదమ్మా... ఏం పర్లేదు. మీరు హ్యాపీగా ఉండండీ చాలు’‘థ్యాంక్యూ నాన్నా. ఉంటాను’ పెట్టేస్తుంది.అబ్బాయి ఒక మాట అని ఉంటే బాగుండేది.‘అమెరికాలో అన్నీ దొరుకుతున్నాయి... ఒక్క అమ్మానాన్న ప్రేమ తప్ప’ అని.అమ్మాయి ఇంకో మాట కూడా అనాల్సింది– ‘ఈసారి ఏమైనా సరే వచ్చి ఒక నెల రోజులు ఉంటాం నాన్నా’ అని. కొడుకు, కూతురు ఇలా ఫోన్‌ పలకరింపులు కాకుండా నేరుగా ఆ అమ్మానాన్నలను చూసి ఉన్నా, తమతో తీసుకెళ్లి ఉన్నా కథ వేరేగా ఉండేది.


శ్రీనివాసరావు, సీత ఇద్దరూ ఆ కాలనీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నారు. ఇద్దరినీ ఎవరూ పేర్లతో పిలువరు. ఆయనను ‘సారు గారు’ అనీ ఆమెను ‘మేడమ్‌ గారు’ అని పిలుస్తారు. ఇద్దరూ కాలేజీలో లెక్చరర్లుగా పని చేసి రిటైర్‌ అయ్యారు. ఇద్దరూ ఒకప్పుడు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకొని వార్తలు సృష్టించారు. కులాలు వేరు కావడం వల్ల ఇరు వర్గాల వాళ్లు పిల్లలు పుట్టి కొంచెం పెద్దవాళ్లు అయ్యేవరకు కూడా దూరం పెట్టారు. ఆ తర్వాత కలిసినా మునుపటి బంధం మిస్సయినట్టే. అంతవరకూ సీతా మేడమ్‌కు భర్తే తోడు. పిల్లలు తోడు. కాలనీవాసులు తోడు. ఆయనకు ఆమె అంటే చాలా ప్రేమ. కొంగు పట్టుకునే తిరుగుతాడు. తనకు క్లాసులు లేకపోయినా ఆమెకు క్లాసులు ఉన్నంత వరకూ ఉండి ఇంటికి తీసుకువెళతారు. ఇద్దరికీ చదువు విలువ తెలుసు. కనుక పిల్లలను బాగా చదివించారు. పిల్లలూ బాగా చదువుకున్నారు కనుక అమెరికాలో స్థిరపడ్డారు. కొడుక్కు కోడలు అమెరికాలోనే దొరికింది. కూతురుకు అల్లుడూ అమెరికాలోనే దొరికాడు.రిటైరయ్యాక ‘ఇన్నాళ్లూ అలవాటు పడ్డ ప్రాణాలు ఇక్కడే ఉంటాం’ అని వాళ్లు అన్నారు. ‘లేదు.. మీరొచ్చి మా దగ్గర ఉండాల్సిందే’ అని పిల్లలు బలవంత పెట్టడం మర్చిపోయారు.

ఒకరోజు శ్రీనివాసరావు బజారు నుంచి వచ్చేసరికి సీత వీధిలోనే నిలబడి అనుమానంగా చూస్తూ ఉంది.‘ఏమిటి?’ అన్నాడాయన గేటు వరకూ వచ్చాక.‘అదే... ఎవత్తది’ అందామె.‘మీరు వీధి చివర ఎవర్తోనో కబుర్లు చెప్పి వచ్చారు. ఏమీ ఎరగనట్టు నాటకాలాడుతున్నారే’ అంది.శ్రీనివాసరావుకు అయోమయంగా అనిపించింది.‘ఎవర్తోనూ మాట్లాడలేదే’‘అన్నీ గమనిస్తున్నాను. ఈ వయసులో మీకు వేషాలు మొదలయ్యాయి. ఎవరితోనో పోయి నా కొంప ముంచడానికేగా’ ఏడుస్తూ లోపలికి పరిగెత్తుకుని పోయింది.శ్రీనివాసరావు జీవితంలో దురదృష్టకరమైన దశ నాటితో మొదలైంది.


అతనికి అరవై ఆరు. ఆమెకు అరవై. ఈ వయసులో ఒక మధురమైన జీవితం గడపాలని అనుకున్నాడు శ్రీనివాసరావు. ప్రేమ వివాహం కావడం వల్ల, పెద్దల ఆదరణ లేకపోవడం వల్ల, పేదరికం నుంచి రావడం వల్ల, ఉద్యోగమే సర్వస్వమనుకుని చేశాడు. ఆమె కూడా అంతే కష్టపడింది. ఇన్నాళ్లకు బాధ్యతలు తీరి సంతోషాలు పంచుకుందామనుకుంటే ఈ సమస్య వచ్చిపడింది. అనుమానం. తీవ్ర అనుమానం. అతడు ఏం చేస్తున్నాడు... ఎవరితో మాట్లాడుతున్నాడు... ఇంట్లో నుంచి ఎన్నింటికి బయటకు వెళ్లి ఎన్నింటికి వస్తున్నాడు... ఇవన్నీ ఆమె ఆరా తీసేది. అసలు ఏమీ చేయకుండా కిటికీలో నుంచి ఆకాశం వైపు చూస్తూ నిలుచున్నా ‘ఎవరిని చూస్తున్నారు?’ అని వెనగ్గా వచ్చి అడిగేది.శ్రీనివాసరావు మెల్లగా కాలనీలో ఆడవాళ్లతో మాట్లాడటం మానేశాడు. అప్పుడప్పుడు డౌట్స్‌ కోసం గర్ల్‌ స్టూడెంట్స్‌ వచ్చేవారు. వాళ్లను రాకుండా చేశాడు. సమస్య సాల్వ్‌ కాలేదు.చివరికి పనిమనిషిని కూడా తీసేయాల్సి వచ్చింది. ఊహు... లాభం లేకపోయింది.  అతడికి కోపంగా ఉంది. బాధగా ఉంది. భార్య మీద ప్రేమ క్షణక్షణానికి తరిగిపోయి విసుగూ చిరాకూ ఎక్కువవుతున్నాయి. పిల్లలకు చెప్పాలంటే ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఇరుగూ పొరుగూ వారికి చెప్తే పరువు పోతుందని అదో భయం.లోపల లోపల నలిగిపోయి ఒళ్లు అలసిపోయి ఒంటిమీద స్పృహలేనట్టు నిద్ర పోతున్నా ఆమె అనుమానంగా వచ్చి అతడి గదిలో తొంగి చూసేది.

‘దీనిని లేట్‌ ఆన్‌సెట్‌ సైకోసిస్‌ అంటారు’ అన్నాడు సైకియాట్రిస్ట్‌ ఆమెను తీసుకొని వచ్చిన శ్రీనివాసరావుతో.‘ఆమె లోలోపల ఏదో తీవ్రమైన భయం ఉంది. పిల్లలు ఎలా అయితే తనను వదిలి వెళ్లిపోయారో మీరు కూడా అలా వదిలివెళ్లిపోతారనే భయం గూడుకట్టిపోయింది. అనుమానం హేతువును తినేస్తుంది. మానసిక అస్థిమితం చిత్తాన్ని దెయ్యాల కార్ఖానా చేసేస్తుంది. మనం చాలా ప్రయత్నించాలి. మందులతోనూ మందులు లేకుండానూ’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.‘ఇదేం జబ్బు డాక్టర్‌. ఎవరికైనా చెప్పుకోవడానికైనా సిగ్గుగా ఉంది. ఈ వయసులో నా మీద అభాండాలు వేస్తుందంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ఈ ట్రీట్‌మెంట్‌ను సీక్రెట్‌గా పెట్టి చేయండి’ రిక్వెస్ట్‌ చేశాడు శ్రీనివాసరావు.‘చూడండి శ్రీనివాసరావుగారూ... అసలు ముందు మనం చేయాల్సిన పని మీ పిల్లలను ఇన్‌వాల్వ్‌ చేయడమే. ఎందుకంటే, మీరు బయటి వ్యక్తి. కాని పిల్లలు ఆమె లోపలి నుంచి వచ్చారు. తల్లికి పిల్లల స్పర్శ, స్పందన, పరామర్శ, ఎదురుగా ఉండటం ఇవెప్పుడూ ఆమెకు బలాన్ని ఇస్తాయి. ఆమెకు ఏ అనారోగ్యం వచ్చిందో ఆమెకు తెలియదు. ఆమె బిహేవియర్‌ కూడా ఆమెకు గుర్తు ఉండదు. మెల్లగా ఆమెను పిల్లల్లో పడేయండి. మందులు ఇద్దాం. కౌన్సెలింగ్‌ కూడా చేద్దాం’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.‘అలాగే మీరు కూడా మీలో ఉన్న ప్రేమ ఆమెకు తెలిసేలా చేయండి. మీరు ఆమెను ప్రేమించే రోజుల్లో ఎన్నో ప్రేమలేఖలు రాసి ఉంటారు. నువ్వంటే నాకు ప్రేమ అని ఉంటారు. అని పెళ్లయ్యాక ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆ మాట అని ఉండరు. అన్నారా?’‘లేదు డాక్టర్‌’‘అనుమానం జబ్బు కానీ ప్రేమ ఆశించడం జబ్బు కాదు. మీ ప్రేమ ప్రదర్శనే ఆమెకు సగం మందు. మగవాళ్ల ప్రపంచాన్ని ఫిల్‌ చేయడానికి చాలా ఉంటాయి. కాని స్త్రీల ప్రపంచాన్ని ఫిల్‌ చేసేది మాత్రం తన కుటుంబ సభ్యుల ఆప్యాయత, కన్సర్న్‌ మాత్రమే’....

రోజులు గడిచాయి. మొదటిసారి వీసాలు కట్టించుకుని శ్రీనివాసరావు, సీత అమెరికా వెళ్లారు.కొడుకు, కూతురు ఇద్దరూ అక్కడి నుంచే డాక్టర్‌తో ఆమెకు తెలియకుండా మాట్లాడారు.ఒడిలో ఎగిరొచ్చి కూచునే మనవడు ఆమెకు సగం నయం చేశాడు. ఆమె దగ్గర వేమన పద్యం అతి కష్టం మీద నేర్చుకున్న మనవరాలు మరో సగం నయం చేసింది. శ్రీనివాసరావు చాటుమాటుగా అందించే ప్రేమలేఖలు ఆమె సిగ్గులమొగై్గ అందుకుంటోంది.‘అమ్మ ఎలా ఉంది’ అని ఫోన్‌లో అడిగితే అమ్మకు ఎప్పుడూ నయం కాదు.అమ్మ సమక్షంలో అమ్మతో గడిపితేనే అమ్మ ఎలా ఉందో తెలుస్తుంది.
‘మా అమ్మ చాలా బాగుంది’ అని నమ్మకంగా చెప్పగలిగే పిల్లలు ఇప్పుడు ఎందరు ఉన్నారు?

– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement