స్వీట్ 60 | hero chiru birthday special | Sakshi
Sakshi News home page

స్వీట్ 60

Published Fri, Aug 21 2015 10:51 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

స్వీట్ 60 - Sakshi

స్వీట్ 60

జీవితం ఒక అందమైన మెమరీ.
ప్రతి మెమరీ... ఆల్బమ్‌లో ఓ కాగితం.
కొన్ని సీపియా షేడ్స్‌లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్.
కొన్ని ఫేడ్ అయిపోయిన కలర్స్‌లో ఎమోషన్స్.
ఇంకొన్ని రంగురంగుల ఆత్మీయతలు.
తల్లిదండ్రులు, తోబుట్టువులు, పెళ్లిళ్లు, పిల్లలు, సినిమాలు...
అన్నీ గుండెను అదుముకున్న మెమరీస్.
కొన్ని హృదయానికి గుచ్చుకుంటాయి... కొన్ని మందు రాస్తాయి...
కొన్ని ఒంటరిగా నిలబడతాయి... ఇంకొన్ని ఆప్యాయంగా హత్తుకుంటాయి.
తప్పు ఒప్పు. మంచి చెడు. ప్రేమ ద్వేషం. గెలుపు ఓటమి. ధనము వనము.
ఆకలి ఉబ్బరం. బాధ సంతోషం. ఎడారి సస్యశ్యామలం. నీడ నిజము. భయము దైవము. కల పీడ. కావ్యము కర్కశము. కోవెల కోర్టు.
బంధము బంధనము. నిత్యము సత్యము. శ్వాస శాశ్వతము. వేము తీపి.
చిరు దీపము చిరు గాలి. ఒంటరితనము ఏకాంతము. పార్శ్వము ఏకము. ద్వైతము అద్వైతము. ‘మెగా’నుభవం మేఘసందేశం.
ఈ జ్ఞాపకాలన్నీ ఆ అనంత ఆకాశంలో విహరిస్తున్న బాష్పాల కలశాలు.
ఈ అనుభవాలు మన గడియారం ముళ్లల్లో ఇరుక్కున్న దూదిపూలు.
ఈ ఎమోషన్స్ భూమి భ్రమణంలో సూర్యుడి ఉదయాస్తమయాల ఇల్యూజన్.
మన వయసుకు లెక్కలాంటి పితలాటకం... ఒట్టి భ్రమ.
ఏజ్ షుడ్ బి కౌంటెడ్ ఇన్ మెమరీస్. స్వీట్ మెమరీస్.
అభిమానుల స్వీట్ మెమరీస్.

 
60 ఏళ్లొచ్చినా యంగ్‌గా ఉన్నారు. స్పెషల్ ఫొటో షూట్‌లో గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత బర్త్‌డే సందర్భంగా ఇలా ఫొటోషూట్‌లో పాల్గొనడం ఎలా అనిపించింది.
చాలా హ్యాపీగా అనిపించింది. అరె ఇది కదా మన ఎరీనా, ఇది కదా మన సామ్రాజ్యం అనిపించింది. సెట్లు, లైటింగ్, మేకప్... ఆ వాసన తగిలితే పుట్టింటికి మళ్లీ వచ్చినట్టుంటుంది.

‘మెగాస్టార్’ అనే స్థానం ఖాళీ అయ్యాక అది ఇప్పటికీ భర్తీ కాలేదని అభిమానులు అనుకుంటున్నారు. మళ్లీ మీరు ఆ స్థానాన్ని క్లయిమ్ చేసుకోవడానికి వ స్తున్నారని భావించవచ్చా?
అభిమానుల గుండెల్లో ఇంకా సుస్థిర స్థానం ఉంది. రాజకీయంగా కొంచెం స్తబ్దత ఏర్పడిన పరిస్థితులు మళ్లీ సినిమాల్లోకి నా రీ ఎంట్రీకి అవకాశం కల్పించాయి. అందుకు ఆహ్వానం పలుకుతున్న అభిమానులకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను.     

రాజకీ యంగా ఇదో విరామం అనుకోవచ్చా?
రాజకీయంగా ఇదేమీ విరామం అనుకోవడం లేదు. ఉన్న సమయాన్ని ఇటు కూడా వినియోగించుకోవాలనుకుంటున్నా.

మీ 150 వ సినిమా స్టేటస్ ఏంటి?
నిజంగా చాలా కథలు వింటున్నాం. విన్న వాటిలో కొన్ని మంచి కథలు కూడా ఉంటున్నాయి, కానీ బాగున్న స్టోరీ లైన్స్‌ను ఎక్స్‌పాండ్ చేసేటప్పటికి అంత సంతృప్తికరంగా ఉండటం లేదు. బాగా ఆకలిగా ఉన్న ప్రేక్షకుడికి అన్ని రుచులతోనూ భోజనం పెట్టాలి. ఈ తాపత్రయమే ఈ సినిమా ఆలస్యానికి కారణం. ఒకటి రెండు నెలల్లో కథ ఫైనలైజ్ అవుతంది. వాటిని డెవలప్ చేయడంలో రైటర్స్ బిజీగా ఉన్నారు.

పూరి చెప్పిన కథ పక్కా అయిపోయినట్టేనా?
పూరిగారు చెప్పిన స్టోరీ లైన్ చాలా బాగుంది. దాన్ని పొడిగించే తరుణంలో ప్రథమార్ధం బాగానే వచ్చింది గానీ ద్వితీయార్ధం నాకే కాదు ఆయనకూ నచ్చలేదు. కొంచెం వర్క్ చేద్దామన్నారు. కానీ ఈలోగా ఆయన వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. దాంతో కథ డిలే అయింది. ఈ లోగా వేరే కథ కుదిరితే అది చేస్తా. లేకపోతే పూరి గారి కథను మళ్లీ వర్క్ చేసుకుని ఆయనతోనే చేస్తా. దర్శకుడిని కథే డిసైడ్ చేస్తుంది.

అసలు ప్రేక్షకులు కథ నుంచి ఎక్కువ ఆశిస్తున్నారా? లేదా హీరో నుంచి ఎక్కువ ఆశిస్తారా ?
 మీ ఇన్నేళ్ల అనుభవంలో దీని మీద మీ అభిప్రాయం?
హీరో ద్వారా వాళ్లు కథను చూస్తారు. అతని ద్వారా ఓ ఎమోషన్‌ను ఫీల్ అవుతారు. అంతేగానీ హీరోను చూసి సంతృప్తి పడరు. హీరో అన్నది కథలో వాళ్లకో ఆలంబన. నా దృష్టిలో హీరో అనేవాడు కథకు కళ్లద్దాల్లాంటి వాడు.

మీ కుటుంబం నుంచి తొమ్మిది మంది స్టార్స్ ఉన్నారు. మీ రాబోయే సినిమాకు సంబంధించి వాళ్లేమైన అడుగుతుంటారా?
అంత మంది స్టార్స్ ఉన్నారా! (ఆశ్చర్యంగా) నేనెప్పుడూ కౌంట్ చేయలేదు. మీరు అంటూంటే నాకు ఇప్పుడే తెలిసింది. మేమందరం కలిసినప్పుడు వాళ్ల సినిమాల కంటే నా సినిమా గురించి అడుగుతూ ఉంటారు. ఏదైనా చిన్న అవకాశం ఉంటే చిన్న రోల్ కూడా చేస్తామంటున్నారు. అలాగని అన్ని కాంబినేషన్లు కుదరవు కదా. కానీ ‘మనం’ సినిమా చాలా బాగా సెట్ అయింది.

పేరుకు మాత్రం మీరు వేరే జనరేషన్.. కానీ అభిమానులు మాత్రం చరణ్‌ను, మిమ్మల్ని ఒకటే జనరేషన్ అనుకుంటున్నారు!
అవునా... చరణ్ వినాలండీ ఇది(నవ్వేస్తూ)...చాలా థ్యాంక్యూ.

షష్టిపూర్తికి ఏం ప్లాన్ చేస్తున్నారు?
నేనైతే అలా ఏం అనుకోవడం లేదు. ఫ్యాన్స్‌ను కూడా నిన్ననే కలిశాను. ఈ రోజు మాత్రం ఇంటి పట్టునే ఉండి కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతాను. మా వాళ్ల కోరిక కూడా అదే.

ఇప్పటికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా?
మా కుటుంబంలోని అందరి పిల్లలతో ఆడుకుంటూ, వాళ్లలో ఒక్కడిగా ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతోంది. సండేస్, ఏమైనా పండుగలు, హాలిడేస్ వస్తే కచ్చితంగా కలుస్తాం. కుటుంబంలో అరమరికలు, పొరపొచ్చాలు ఏమైనా ఉంటే అవి సమసిపోతాయి. అది ఇప్పటికీ అందరూ ఆచరిస్తున్నారు కూడా.

మిమ్మల్ని కష్టపెట్టే ప్రశ్న అడుగుతున్నా... ఏమనుకోవద్దు... రాజకీయంగా వేర్వేరు భావజాలంతో ఉన్న మీరు, మీ తమ్ముడు పవన్‌కల్యాణ్‌తో మాట్లాడుతున్నారా?
అసలు అలాంటి క్వశ్చనే ఉండదు. మేము ఎందుకు మాట్లాడుకోం? నాకు రామ్‌చరణ్ ఎంతో పవన్ కూడా అంతే. వారిద్దరూ నాకు రెండు కళ్ల లాంటి వారు. పవన్ నాకు మొదటి బిడ్డ. మీడియా వాళ్లు ఏదో సరదా కోసం అల్లిన కథలవి. మేమందరం ఎప్పుడూ కలుస్తూ ఉంటాం. కానీ కలిసినప్పుడు మాత్రం రాజకీయ చర్చలకు తావుండదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు సెలైంట్ అయిపోతాం.

పవన్‌కల్యాణ్, మీరు ఒకేసారి ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కదా..! మళ్లీ అన్నదమ్ములు ఒకటయ్యే అవకాశాలున్నాయా?
ఇప్పుడు నేను ఉంటున్న పార్టీ నాది కాదు. నా ఇష్టయిష్టాలతో సంబంధం లేదు. భవిష్యత్తులో ఇద్దరం క లుస్తాం అని నేనైతే ఇప్పుడేం అనుకోవడం లేదు.

ఎనిమిదేళ్లుగా డ్యాన్స్‌కు దూరంగా ఉన్నారు? మరి ఈ మధ్యలో డ్యాన్స్ క్లాసెస్‌కు ఏమైనా వెళ్లారా?
అసలు అవసరం లేదండి... చిటికేస్తే స్టెప్ పడిపోతుంది. ఇది ఏదో సినిమా షూటింగ్స్ నుంచి సడన్‌గా వచ్చింది కాదు. బాడీలో ఇన్‌బిల్ట్ క్వాలిటీ అది. మ్యూజిక్ వినగానే స్టెప్ పడాల్సిందే. ఎన్‌సీసీలో ఉన్నప్పుడు క్యాంప్ ఫైర్స్‌కు వెళినప్పుడు జ్యోతిలక్ష్మీ, హెలెన్ నంబర్స్‌కు స్టెప్స్ వేసి అందరినీ ఎంటర్‌టైన్ చేయడం అప్పట్లో నాకు సరదా. డ్యాన్స్ నాకు పుట్టుకతోనే వచ్చింది. దానికి ఏ మాత్రం ైట్రైనింగ్ అవసరం లేదు. ఏదైనా ఆడియో ఫంక్షన్స్‌కు వెళినప్పుడు అక్కడ ప్లే చేస్తున్న మ్యూజిక్‌కు ఆల్రెడీ నాలో ఉన్న డ్యాన్సర్ లోపల డాన్స్ చేస్తూనే ఉంటాడు. కానీ పైకి మాత్రం చాలా సీరియస్‌గా ఏమీ తెలియనట్టు ఉంటాను. ‘రేసుగుర్రం’లో శ్రుతీహాసన్‌లాగా (నవ్వుతూ).

మీ మెమరబుల్ డ్యాన్స్ సీక్వెన్స్?
నా దృష్టిలో డ్యాన్స్ అనేది చాలా ఫ్రీగా అలవోకగా ఉండాలి. ఒక ఫ్లో ఉండాలి. కిందపడి, మీదపడి చేసేవాటిని విన్యాసాలంటారు.. అది కూడా గొప్ప డాన్స్ ఫామ్. కానీ డాన్స్ అనేది చూసేవాళ్లకు చాలా సింపుల్‌గా ఉండాలి. ఇన్నేళ్లు గడిచినా నాకు బాగా నచ్చిన డాన్స్ మూమెంట్స్ ఉన్న పాట ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాలో ‘అబ్బ నీ తీయని దెబ్బ’ పాట. చాలా సింపుల్ మూమెంట్స్. గ్రేస్ కూడా ఉంటుంది. ఎక్కడా విరగదీస్తున్నట్టు ఉండదు. ఎన్ని తరాలు మారినా ఆ పాట అలానే నిలిచిపోయింది.

మీ సినిమాలు మళ్లీ వేసుకుని చూస్తూంటారా?
లేదండి! కానీ చానల్స్‌లో వేసినప్పుడు మాత్రం చూస్తూ ఉంటా. మ్యూజిక్ చానల్స్‌లో నా పాటలు చూస్తున్నప్పుడు మాత్రం అప్పటి రోజుల్లోకి వెళిపోతా.

అబ్బ అప్పట్లో ఇంత అందంగా ఉన్నానా అని అనిపించిందా?
లేదు. కానీ నాలో నాకు లోపాలు కనిపిస్తాయి. అప్పుడలా చేసుంటే బాగుండేదే, ఇలా చేసుండకూడదే అని అనిపిస్తూంటుంది. ఇంత అనుభవం మీద అలా కనిపిస్తోందని కానీ ఆ రా...రస్టిక్‌లో అదే కరెక్ట్. అంతేగానీ ఆడపిల్లలాగా నాకెప్పుడూ అనిపించలేదు.

కులాల పరంగా అభిమానులు విడిపోయారు కదా! మరి బాధ కలుగుతూ ఉంటుందా?
డె ఫినెట్లీ అండి. ఎందుకంటే ఇది చాలా అనారోగ్యకరమైన వాతావరణం. అంత దిగజారి పోవడం హర్షణీయం కాదు. చాలా దురదృష్టకరం.

మీ భవిష్యత్ రాజకీయ చిత్రం ఎలా ఉండబోతుందనుకుంటున్నారు?
చాలా మందికి ఎన్నికల్లో గెలుపా, ఓటమా...అనేది మాత్రమే లెక్క. కానీ పార్టీ అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేస్తే ఒకదాంట్లో గెలిచి, మరొక దాంట్లో ఓడిపోవడం , పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం, ఆ తర్వాత ఆ పార్టీలో ఇప్పుడు ఎంపీగా కొనసాగుతున్నా నా పార్టీ రెండు రాష్ట్రాల్లో ఎక్కడా కనపడకుండా పోవడం... ఇన్ని వేరియేషన్స్ ఎవరూ చూడరేమో. ఇది నాకో సీరియస్ అండ్ కాస్ట్‌లీ ఎక్స్‌పీరియన్స్.

చిరంజీవి అంటే చాలా సెన్సిటివ్, మనసుకు కష్టం కలిగినప్పుడు ఆ బాధను ఎవరితో పంచుకున్నారు? అరవింద్‌గారు మీకు బాగా క్లోజ్ అంటూంటారు కదా?
సంతోషం, దు:ఖం, అన్నీ నేను నా భార్య సురేఖతోనే పంచుకుంటా. ఆమె చాలా సెన్సిటివ్. ఆమె ఏదైనా అంటే దానికో కారణం ఉంటుంది. మా ఇద్దరి మధ్య దాంపత్య బంధం కన్నా దానికి మించిన అవినాభావ బంధం ఎక్కువ. ఆ తర్వాత మా పిల్లలు చరణ్, సుస్మిత, శ్రీజ.

మీ సినిమా మీరే తీసుకుంటే (డెరైక్షన్) బాగుంటుందని కొంతమంది భావిస్తున్నారు. దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు!
‘ఠాగూర్’, ‘ఇంద్ర’ ఇలా నా సూపర్ హిట్స్ అన్నీ తీసుకోండి. నేను కేవలం నటించా అంతే. వాటి వెనక ద ర్శకుల, రచయితల, నిర్మాతల కృషి ఎంతో ఉంది. నన్ను ఎలా చూపించాలో, నా కంటే వాళ్లకే బాగా తెలుసు. వాళ్లే ఇంకా అత్యద్భుతంగా తీస్తారు. వర్మకు అనిపించి ఉండవచ్చేమో. ఆయనతో నేను ఏకీభవించను.

ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన సినిమా?
‘బాహుబలి’ బాగా నచ్చింది. దాని గ్రాఫిక్స్‌తో తెలుగు సినిమా స్టామినాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళిది. ఇలాంటి భారీ స్థాయిలో సినిమా తీయడానికి వెనుకంజ వేయనవసరం లేదని చెప్పిన సినిమా ఇది. ఈ సినిమాకు శంకర్ సినిమాలు, హాలీవుడ్ చిత్రాలు స్ఫూర్తి కావచ్చు. కానీ ఇక మీదట ఈ స్థాయి సినిమాలకు బాహుబలే స్ఫూర్తిగా నిలుస్తుంది
 
రాజమౌళిగారు మీ 150వ సినిమాను ఎందుకు తీయడం లేదు?

ఈ ప్రశ్న ఆయన్నే అడగండి(నవ్వేస్తూ). ఆయనే చేస్తే నేనింకా సంతోషపడతా!
 
- స్వప్న, సాక్షి టీవీ
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement