అర్టికేరియా దద్దుర్లు తగ్గుతాయి | Home Counseling : The acicaria is rash | Sakshi
Sakshi News home page

అర్టికేరియా దద్దుర్లు తగ్గుతాయి

Published Wed, Oct 25 2017 11:59 PM | Last Updated on Thu, Oct 26 2017 2:11 AM

Home Counseling : The acicaria is rash

హోమియో కౌన్సెలింగ్స్‌

నాకు 24 ఏళ్లు. అప్పుడప్పుడూ చర్మం మీద ఎర్రని దద్దుర్లు కనిపిస్తున్నాయి. మర్నాటికి అవి తగ్గుతున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే ‘అర్టికేరియా’ అన్నారు. మందులు వాడుతున్నా ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. హోమియో చికిత్స ద్వారా సమస్య పూర్తిగా నయమవుతుందా?   – సంజయ్, హైదరాబాద్‌
అర్టికేరియా చాలా సాధారణంగా కనిపించే చర్మ సమస్య. ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఇది ఏ వయసు వారికైనా కనిపించవచ్చు. కొందరిలో ఈ సమస్య 24 గంటల్లో దానంతట అదే తగ్గుతుంది. కానీ మరికొందరిలో ఇది దీర్ఘకాలం కొనసాగుతూ తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది. దీన్ని రెండురకాలుగా విభజించవచ్చు. అవి...
∙అక్యూట్‌ అర్టికేరియా: సమస్య ఆరు వారాల కంటే తక్కువ రోజులు ఉన్నట్లయితే దాన్ని అక్యూట్‌ అర్టికేరియా అంటారు. సమస్యను ప్రేరేపించే అంశాలు ఎదురైనప్పుడు ఇది కలుగుతుంది.

∙క్రానిక్‌ అర్టికేరియా: ఆరువారాలకు పైబడి కొనసాగితే దాన్ని క్రానిక్‌ అర్టికేరియా అంటారు. ఇలా దీర్ఘకాలిక సమస్యగా మారడానికి కారణాలు ఇంకా స్పష్టంగా లభించలేదు. అయితే మన ఒంట్లో అంతర్లీనంగా ఉండే ఆరోగ్య సమస్యలైన థైరాయిడ్, లూపస్‌ వంటి వాటి వల్ల ఆర్టికేరియా కనిపించవచ్చు.

కారణాలు: మన శరీరానికి సరిపడని పదార్థాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిస్పందనగా మన ఒంట్లో హిస్టమైన్స్‌ అనే పదార్థంలో పాటు కొన్ని రకాల రసాయనాలు రక్తప్రవాహంలోకి విడుదల అవుతాయి. వాటి ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. ఇదే సమస్య మన రోగ నిరోధక శక్తి మనపైనే దుష్ప్రభావం చూపినప్పుడు కూడా కనిపిస్తుంది.
అర్టికేరియాను ప్రేరేపించే అంశాలు: ∙నొప్పి నివారణకు ఉపయోగించే మందులు ∙కీటకాలు, పరాన్నజీవులు ∙ఇన్ఫెక్షన్‌ కలిగించే బ్యాక్టీరియా, వైరస్‌లు ∙అధిక ఒత్తిడి, సూర్యకాంతి ∙మద్యం, కొన్ని సరిపడని ఆహార పదార్థాలు ∙అధిక లేదా అల్ప ఉష్ణోగ్రతలు ∙జంతుకేశాలు, పుప్పొడి రేణువులు వంటి చాలా అంశాలు అర్టికేరియాను ప్రేరేపిస్తాయి.

లక్షణాలు: ∙చర్మంపై ఎరుపు లేదా డార్క్‌ కలర్‌లో దద్దుర్లు ఏర్పడటం ∙విపరీతమైన దురదగా అనిపించడం ∙దద్దుర్లలో మంట, నొప్పి కూడా అనిపించడం ∙కళ్లచుట్టూ, చెంపలు, చేతులు, పెదవులపై కూడా అవి ఏర్పడవచ్చు ∙గొంతులో వాపు ఏర్పడి అది వాయునాళాలకు అడ్డుగా పరిణమించి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు ∙దద్దుర్ల పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ వాటిని ప్రేరేపించే అంశాలకు గురైనప్పుడు కనిపిస్తూ... ఆ తర్వాత అదృశ్యమవుతూ ఉండవచ్చు.

చికిత్స: అర్టికేరియా సమస్యకు హోమియో ప్రక్రియ ద్వారా కాన్‌స్టిట్యూషన్‌ పద్ధతుల్లో అత్యంత సునిశితమైన పరిశీలనతో తగిన మందులు ఇవ్వవచ్చు. వాటి వల్ల రోగనిరోధక కణాల్లో పునరుజ్జీవనం కలిగి అవి అర్టికేరియాను సమర్థంగా ఎదుర్కొంటాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లావర్‌
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

మీ సమస్య ఐబీఎస్‌ కావచ్చు

నా వయసు 30 ఏళ్లు. ఐదేళ్లుగా విరేచనాలు, మలబద్దకంతో బాధపడుతున్నాను. ఏ టైమ్‌లో విరేచనం అవుతుందో తెలియక  బయటకు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. ప్రయాణాలు చేయలేకపోతున్నాను. ఎన్నో మందులు వాడాను. హోమియోలో దీనికి చికత్స ఉందా? – నరేశ్‌కుమార్, తుని
మీరు చెబుతున్న లక్షణాలతో మీరు ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌)తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. పెద్ద పేగుల్లోని అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలగజేసే వ్యాధి ఇది. ఈ సమస్యకు జీర్ణ వ్యవస్థలోని అసలు లోపమే కారణం. జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్లకు గురైన వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య వచ్చిన వారికి ఎన్ని పరీక్షలు చేసినా ఫలితాలు సాధారణంగానే ఉంటాయి. కానీ వ్యాధి తాలూకు బాధలు మాత్రం కనిపిస్తూనే ఉంటాయి. వరసపెట్టి విపరీతమైన విరేచనాలు లేదంటే అసలు కొంతకాలం విరేచనం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇంతటి ఇబ్బంది అనుభవిస్తున్నా పరీక్షల్లో మాత్రం పేగుల్లో ఎలాంటి తేడా కనిపించదు. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఎప్పుడు విరేచనాలు మొదలవుతాయో ఊహించలేం. దాంతో దూరప్రయాణాలు చేయలేరు. ఐబీఎస్‌ వ్యాధిగ్రస్తులు శక్తిహీనులవుతారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి, నిరంతరం ఏదో ఒక వ్యాధికి గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇది రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంది.
కారణాలు: ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙సరైన సమయంలో భోజనం చేయకపోవడం ∙మద్యం, పొగతాగడం వంటి దురలవాట్లు ఎక్కువ కాలం కొనసాగుతూ ఉండటం.
లక్షణాలు: ∙మలబద్దకం / విరేచనాలు ∙తరచూ కడుపునొప్పి రావడం ∙కడుపు ఉబ్బరం ∙విరేచనంలో జిగురు పడటం ∙భోజనం చేయగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం ∙చికాకు, కోపం.
హోమియో చికిత్స: మానసిక ఒత్తిడిని తగ్గించి, పేగుల్లోని అసాధారణ కదలికలను నియంత్రించే ఔషధాలను ఇస్తారు. నక్స్‌వామికా, ఆర్సినిక్‌ ఆల్బ్, అర్జెంటికమ్‌ నైట్రికమ్, లైకోపోడియం, పల్సటిల్లా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. హోమియోలో వ్యక్తి రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి మందులు నిర్ణయిస్తారు. అవి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో)
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌

స్పాండిలోసిస్‌ తగ్గుతుంది

నా వయసు 30 ఏళ్లు. గత ఏడాది కాలం నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్‌ అంటున్నారు. దీనికి మందులు వాడుతున్నాను. నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – జి. సుకుమార్, నకిరెకల్లు  
స్పాండిలోసిస్‌ అనేది వెన్నెముకకు సంబంధించిన సమస్య. ఇది ఒక రకమైన ఆర్థరైటిస్‌. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అని, నడుము భాగంలో వస్తే లంబార్‌ స్పాండిలోసిస్‌ అంటారు.
కారణాలు: ∙కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్‌ ఉంటాయి. ఈ జాయింట్స్‌ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు ∙జాయింట్స్‌లో వాటర్‌ తగ్గడం వల్ల కూడా నొప్పి రావచ్చు ∙స్పైన్‌ దెబ్బతిని కూడా నొప్పి రావచ్చు ∙వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి దారి ఉంటుంది. ఆ దారి సన్నబడితే నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది.
లక్షణాలు: నడుమునొప్పి, నడుము నొప్పితో పాటు మెడ నొప్పి. నొప్పి నడుము నుంచి ఒకవైపు కాలు, పాదం వరకు వ్యాపించడం  (సయాటికా నొప్పి). నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, దాంతో నడవడానికి ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి.

నిర్ధారణ: ∙వ్యాధి లక్షణాలను బట్టి ∙ఎక్స్‌–రే ∙ఎమ్మారై, సీటీ స్కాన్‌
నివారణ: వెన్నెముక వ్యాయామాలు చేయడం, పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం.
చికిత్స: హోమియో విధానంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా పరిష్కారం ఉంది. రోగి లక్షణాలను, శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. ఇలా కాన్‌స్టిట్యూషనల్‌ చికిత్స అందిస్తే క్రమంగా రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధి తీవ్రత తగ్గి, పూర్తిగా నయమవుతుంది.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ
పాజిటివ్‌ హోమియోపతి,హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement