
మోకాళ్ల నొప్పులను నివారించడం ఎలా...?
నాకు ఇటీవల మోకాళ్ల నొప్పులు కాస్తంత ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంతమంది ఫ్రెండ్స్‌ని అడిగితే ఇవి పాత నొప్పులనీ, భవిష్యత్తులో మరింత పెరుగుతాయని అంటున్నారు. వీటికి ఆపరేషన్ అవసరమా? ఇవి మరింత పెరగకుండా నివారణ చర్యలను సూచించండి.
- వెంకటేశ్వరావు, ఆదోని
మోకాళ్లలో నొప్పి మొదట్లో కొద్దిగా కనిపించగానే, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వారు తమ జీవనశైలిని తప్పక మార్చుకోవాలి. సమతులాహారం తీసుకోవడం, క్రమబద్ధమైన జీవనం గడపడంతో పాటు ఆల్కహాల్, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయాలి. స్థూలకాయం ఉన్నవారు తమ బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేయాలి. పాదాలకు సౌకర్యంగా ఉండే పాదరక్షలనే ఎంచుకోవాలి. బాసిపట్లు వేసుకొని కూర్చోవడం, కింద కూర్చోవడం వంటివి చేయకూడదు. లావెటరీ విషయంలోనూ వెస్ట్రన్ ఉపయోగించడం మేలు.
ఇక కొందరు మోకాళ్ల నొప్పులు కనిపించగానే మసాజ్ చేయిస్తుంటారు. ఇది అంత మంచి పరిష్కారం కాదు. మరికొందరు మోకాళ్ల నొప్పులనగానే నీ-రీప్లేస్‌మెంట్ సర్జరీ గురించి ఆలోచిస్తారు. కానీ అది ఖరీదైన ప్రక్రియ. పైగా చివరి ఆప్షన్‌గా మాత్రమే దాన్ని ఆలోచించాలి. ఈలోపు జీవనశైలిలో మార్పులతోనే దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించాలి. నొప్పులు ఎక్కువగా ఉన్నాయి కదా అని అదేపనిగా నొప్పి నివారణ మందులు (పెయిన్‌కిల్లర్స్) వాడకూడదు.
భవిష్యత్తులో మోకాళ్ల నొప్పులను రాకుండా చేయడానికి లేదా వీలైనంత ఆలస్యం చేయడానికి సైక్లింగ్, ఈత వంటి ఎక్సర్‌సైజ్‌లు, బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఒకేచోట కుదురుగా కూర్చోడాన్ని నివారించడం చేస్తుండాలి. కూర్చున్న చోటే చేసే వ్యాయామంలాగా... కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక కాలిని రోజూ 20-30 సార్లు ముందుకు చాపడం చేస్తూ ఉండాలి. రెండో కాలి విషయంలోనూ అదే వ్యాయామాన్ని చేయాలి. ఇలాంటి జాగ్రత్తలతో మోకాళ్ల నొప్పులను చాలావరకు నివారించవచ్చు.
డాక్టర్ భక్తియార్ చౌదరి
స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్‌నెస్ నిపుణుడు, హైదరాబాద్