ఎంత ఇష్టమైతే మాత్రం...?!
విచిత్రం
సినిమా హీరోలను ఇష్టపడటం, పిచ్చిగా ఆరాధించడం చాలామంది చేస్తారు. కానీ డానియెల్లె డేవిస్ అంతటితో ఆగి పోలేదు. తన అభిమాన నటుడితో కలిసి బతకాలను కుంది. అందుకో విచిత్రమైన మార్గం ఎంచుకుంది.
న్యూజెర్సీకి చెందిన డానియెల్లె (39)కి హాలీవుడ్ నటుడు బ్రాడ్‌లీ కూపర్ అంటే చచ్చేంత ఇష్టం. ఎంత ఇష్టమంటే... అతడితో కలిసి జీవించాలని నిర్ణయించుకునేంత! అయితే అది కుదరదని తనకూ తెలుసు కాబట్టి అతడి బొమ్మతో కాపురం మొదలుపెట్టింది. కార్‌డ బోర్డుతో డానియెల్లె నిలువెత్తు బొమ్మను తయారు చేయించుకుంది.
ఎక్కడికి వెళ్లినా దాన్ని తీసుకుని వెళ్తుంది. తినేటప్పుడు, తాగేటప్పుడు, వంట చేసేటప్పుడు, చివరకు నిద్రపోయేటప్పుడు కూడా పక్కన అతగాడి బొమ్మ ఉండాల్సిందే. ఇవన్నీ చదివి డ్యానియెల్లె పెళ్లి కాని అమ్మాయి అయి ఉంటుంది అనుకునేరు. ఆమెకి పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వాళ్లెవరికీ ఈమె ఇలా చేయడంలో అభ్యంతరం లేదట. తనకు అలా ఉండటం ఇష్టం, మనమేం చేయగలం అంటూ లైట్‌గా తీసిపారేస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు.
చివరికి కూపర్ బొమ్మని మంచం మీద తన పక్కనే ఉంచుకుని నిద్రపోతున్నా అభ్యంతరం చెప్పడం లేదు. అలా ఎలా ఉంటారు అని అంటే... ‘‘మా వాళ్లందరికీ నేనంటే చాలా ప్రేమ. నాకు కూపర్ అంటే ఎంత ఇష్టమో వాళ్లకు తెలుసు. నాకిష్టమైనదాన్ని వాళ్లు కాదనరు’ అంటోంది నవ్వుతూ. కూపర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ మరీ ఇంత వెర్రి ఏమిటి అని అంటున్నారు కొందరు. కాని డానియెల్లెకి మాత్రం అవేమీ బుర్రకెక్కడం లేదు!