సిలిండర్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఇలా తెలుసుకోవాలి...
సిలిండర్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఇలా తెలుసుకోవాలి...
Published Wed, Aug 7 2013 1:37 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
గ్యాస్ సిలిండర్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందనే విషయం తెలియడం ఎంత ముఖ్యమో ఆ ఎక్స్‌పైరీ డేట్‌ని ఎలా తెలుసుకోవాలనేది కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా సులభం, సిలిండర్ మీదనే ఉంటుంది. ఇక్కడ ఫొటోలు చూడండి... ఇంగ్లిష్ అక్షరం ‘డి-06’ అని నల్లరంగులో పెయింట్ చేసిన అక్షరాలున్నాయి గమనించారా? అంటే ఈ సిలిండర్‌ని ఉపయోగించే కాలం 2006వ సంవత్సరం డిసెంబర్‌తో ముగుస్తుంది అని అర్థం. అలాగే ‘డి-13’ అని ఉన్న సిలిండర్ కాలపరిమితి 2013వ సంవత్సరం డిసెంబర్‌తో ముగుస్తుంది. ఇక్కడ సూచించిన ఇంగ్లిష్ అక్షరం ‘డి’ని డిసెంబర్‌గా అర్థం చేసుకోవచ్చు కానీ ఇది ఆ నెల పేరులో మొదటి అక్షరానికి సూచిక కాదు. గ్యాస్ సిలిండర్ ఎక్స్‌పైరీని నిర్దేశించడానికి ఏడాదిని నాలుగు క్వార్టర్లుగా విభజిస్తారు.
ఇంగ్లిష్ అక్షరంతో పాటు ఆ ఏడాదిలో చివరి రెండు అంకెలను సూచించే ఈ విధానాన్ని అల్ఫా న్యూమరికల్ సిస్టమ్ అంటారు. ‘ఎ’ అంటే ఏడాదిలో మొదటి మూడు నెలల కాలం, ‘బి’ అంటే ఏప్రిల్‌నుంచి జూన్, ‘సి’ అంటే జూలై నుంచి సెప్టెంబరు, ‘డి’ అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అన్నమాట. ఉదాహరణకు ఒక సిలిండర్ మీద ఇంగ్లిష్ అక్షరం ‘ఎ-14’ అని ఉంటే దాని కాలం 2014వ సంవత్సరం మార్చి నెలతో ముగుస్తుందని తెలుసుకోవాలి. ఇదంతా చెప్పడం ఎందుకంటే... సిలిండర్ పేలుడు ప్రమాదాలు ఎక్కువగా ఎక్స్‌పైరీ ముగిసిన సిలిండర్లతోనే వస్తుంటాయి. ఇకపై మీ ఇంటికి వచ్చిన గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు దాని బరువుతోపాటు సిలిండర్ కాలపరిమితిని కూడా పరీక్షించండి.
Advertisement
Advertisement