పెనుభూతం
సోల్/అనుమానం
అనుమానం పెనుభూతం అంటారు. ఔను! ఇది నిజంగా పెనుభూతమే. ఎలాంటి భూతం పట్టినా వదిలించవచ్చు గానీ, అనుమానం పట్టుకుంటే మాత్రం వదిలించడం దాదాపు అసాధ్యం. అనుమానం వల్ల మానవ సంబంధాలు దెబ్బతినడమే కాదు, మనశ్శాంతి కూడా కరువవుతుంది. మారుతున్న కాలంలో అనుమానం కొంతవరకు అవసరమే. అన్నింటినీ గుడ్డిగా నమ్మి, అలా నమ్మడం వల్ల మోసపోయి, తర్వాత తాపీగా విచారించే కంటే కొన్ని లావాదేవీల్లో ముందుకు పోవాలనుకున్నప్పుడు కొంచెం అనుమానించి, ఆపై ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకుని నిర్ణయం తీసుకోవడం మేలు.
తగు మోతాదుగా ‘అణు’మాత్రం అనుమానం ఉంటే ఫర్వాలేదు. పాపిష్టి లోకంలో సురక్షితంగా మనుగడ సాగించడానికి అది ఎంతైనా అవసరం కూడా. కాకపోతే, ఆ అనుమానం అణువంత కాకుండా, పెనుభూతంగా ఎదిగి పట్టి పీడిస్తేనే తంటా. అన్నింటినీ గుడ్డిగా నమ్మడం ఎలా క్షేమం కాదో, అన్నింటినీ అతిగా అనుమానించడమూ శ్రేయస్కరం కాదు.
అను‘మాన’ధనులు
అభిమానధనులను లోకం నెత్తికెత్తుకుంటుంది. వారిపై లోకులకు ఉండే అభిమానం అలాంటిది మరి! అయితే, ప్రపంచంలో అభిమానధనులు అరుదుగా ఉంటారు. స్వాభిమానాన్ని కాపాడుకుంటూనే జనాల అభిమానాన్నీ పొందగలరు వాళ్లు. అలాంటి వాళ్లే లోకానికి ఆదర్శప్రాయులుగా మన్ననలు అందుకుంటారు. కానీ, లోకుల్లో కొందరు ఉంటారు... ఉత్త అను‘మాన’ధనులు. నిష్కారణంగా భార్యలను అనుమానించే భర్తలు, భర్తలను అనుమానించే భార్యలు, తోబుట్టువులను, తోటి స్నేహితులను అనుమానించేవారు, సహోద్యోగులను అనుమానించేవారు ఇలాంటి వాళ్లే. తీరికగా ఉన్నప్పుడు కాలక్షేపానికి ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే, తమ గురించే మాట్లాడుకుంటున్నారని అనుమానిస్తారు. నేరకపోయి ఎవరైనా స్వచ్ఛందంగా సాయం చేయడానికి ముందుకొచ్చినా, ఏదో ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారేమోనని అనుమానిస్తారు. ఎవరైనా తమను పొగిడినా, ఆ పొగడ్తలను మనస్ఫూర్తిగా స్వీకరించలేరు సరికదా, పొగడ్తల వెనుక ఏదైనా వ్యంగ్యం ఉందేమోనని శంకిస్తారు. లేకుంటే కాకా పట్టేందుకే ఎదుటి వారు పొగుడుతున్నారని అనుమానిస్తారు. ఇలాంటి శాల్తీలనే నిత్యశంకితులని కూడా అంటారు. నిత్యశంకితుల వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేకపోగా, అపకారమే ఎక్కువగా జరుగుతుంది. అందుకే, భర్తృహరి నిత్యశంకితులను కూడా కాపురుషుల జాబితాలో చేర్చాడు.
అపనమ్మకమే మూలం
అనుమానానికి అపనమ్మకమే మూలం. అనుమానవంతులు లోకంలో దేనినీ నమ్మరు. తల్లిదండ్రులను, తోబుట్టువులను, భార్యాబిడ్డలను కూడా నమ్మరు. ఇలాంటి వాళ్లు అందరితో పాటే గుళ్లకు గోపురాలకు తిరుగుతూ ఉంటారు గానీ, దేవుణ్ణి కూడా నమ్మరు. అన్నిటినీ అనుమానిస్తూ, అందరినీ అనుమానిస్తూ జీవితంలో ఆత్మీయులనే వాళ్లే లేని పరిస్థితిని తెచ్చిపెట్టుకుంటారు. చివరకు తమ నీడను తామే నమ్మలేని స్థితికి చేరుకుని, మానసిక రోగులుగా మిగులుతారు. ఇలాంటి నిత్యశంకితులు సమాజంలో ఇమడలేరు. అలాగని ఒంటరిగానూ బతకలేరు. తమకు తాముగా శాంతంగా ఉండలేరు. చుట్టుపక్కల ఉన్నవాళ్లనూ శాంతంగా ఉండనివ్వరు. శాంతంగా ఉండలేరు కాబట్టి, వీళ్లకు జీవితంలో సుఖశాంతులనేవే ఉండవు.
సంకుచితుల నేస్తం
‘సంకుచిత మనస్తత్వం గలవాళ్లకు అనుమానమే నేస్తం’ అని బ్రిటిష్-అమెరికన్ తత్వవేత్త శతాబ్దాల కిందటే చెప్పాడు. లోకంపై, లోకులపై కాస్తంత విశాల దృక్పథం ఉన్నవాళ్లు అనవసరమైన అనుమానాలతో మనసు పాడుచేసుకోరు. విశాల దృక్పథం, ఔదార్యం వంటి సానుకూల లక్షణాలేవీ లేని సంకుచితులే అయినదానికీ, కానిదానికీ అన్నింటినీ అనుమానిస్తూ నిత్యశంకితులుగా మారుతారు. అనుమానం ఉన్నచోట మైత్రి మనుగడ సాగించలేదు. అనుమానంతో సతమతమయ్యే వారికి స్నేహితులు కరువవుతారు. లేనిపోని అనుమానాల వల్ల మనుషుల మధ్య సహజంగా ఉండాల్సిన ప్రేమాభిమానాలు నశించి, పగ, ద్వేషం వంటి ప్రతికూల భావనలు పెచ్చరిల్లుతాయి.
ప్రతికూల భావనలు ముప్పిరిగొన్నప్పుడు సంకుచితత్వాన్ని విడనాడి వీలైనంత త్వరగా వాటి నుంచి బయటపడే ప్రయత్నాలు చేయడం మంచిది. అలాంటి ప్రయత్నాలేవీ చేయకుండా, ఇంకా సంకుచితంగానే వ్యవహరిస్తుంటే, అలాంటి వాళ్లకు బంధుమిత్రులందరూ దూరమై, అనుమానమే నేస్తంగా మిగులుతుంది.
అంతర్జాతీయ అవలక్షణం
అనుమానం ఒక అంతర్జాతీయ అవలక్షణం. ఇది ఏదో ఒక జాతికో, ఒక ప్రాంతానికో పరిమితమైనది కాదు. ప్రపం చం నలుమూలలా మనుషుల్లో అనుమానించే లక్షణం కనిపిస్తూనే ఉంటుంది. అనుమానించే లక్షణం పట్ల మనుషులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, అనుమానం పెనుభూతమై మనసంతటినీ ఆక్రమిస్తుందని ఇంగ్లిష్ తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు ఫ్రాన్సిస్ బేకన్ చెప్పాడు.
ఒకవేళ పాలకులకే ఈ లక్షణం ఉంటే, వాళ్లు నియంతలుగా పరిణమించి ప్రజలను పీడించుకు తింటారని కూడా ఆయన హెచ్చరించాడు. చరిత్రలో ఇలాంటి నిత్యశంకితులైన నియంతలు ఎందరో కనిపిస్తారు. హిట్లర్, ముసోలినీ, ఇడీ అమీన్ వంటి వాళ్లు సొంత నీడనైనా నమ్మని రకాలు. వాళ్ల కారణంగా మానవాళికి వాటిల్లిన కష్టనష్టాలు అందరూ ఎరిగినవే. అపరాధ భావనతో నిండిన మనస్సును అనుమానం వేధిస్తుందని షేక్స్‌పియర్ చెప్పా డు. అపరాధాలకు పాల్పడని వాళ్లు, తమ పట్ల ఇతరులు చేసిన అపరాధాలను క్షమించగలిగిన వాళ్లు ఇతరులను అనవసరంగా అనుమానించరు.
మరో ఇంగ్లిష్ రచయిత శామ్యూల్ జాన్సన్ అయితే, అనుమానాన్ని ‘అనవసర వేదన’గా అభివర్ణించాడు. అంతేకాదు, అనుమానం ఒక అనవసర మానసిక భారం. స్కాటిష్ కవి రాబర్ట్ బర్న్స్ అనుమానాన్ని ‘భారకవచం’గా అభివర్ణించాడు. మనిషికి రక్షణ ఇవ్వడానికి కవచం అవసరమే. అయితే, కవచమే మోయలేని భారంగా మారితే, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అనుమానం పెనుభూతంగా పరిణమిస్తే, మనసుకు మోయలేని భారంగా మారి, మనిషిని నిలువెల్లా కుంగదీస్తుంది. అందువల్ల కనికల్ల నిజము తెలుసుకుని, అనుమానాలను ఎప్పటికప్పుడు పటాపంచలు చేసుకోవడమే విజ్ఞుల లక్షణం.