అక్షరాలు దిద్దించేటప్పుడే.. వివక్షలను చెరిపేయించాలి | Hyderabad Central University student Rohit was found dead in a year | Sakshi
Sakshi News home page

అక్షరాలు దిద్దించేటప్పుడే.. వివక్షలను చెరిపేయించాలి

Published Sun, Jan 15 2017 11:54 PM | Last Updated on Sun, Apr 7 2019 4:37 PM

అక్షరాలు దిద్దించేటప్పుడే.. వివక్షలను చెరిపేయించాలి - Sakshi

అక్షరాలు దిద్దించేటప్పుడే.. వివక్షలను చెరిపేయించాలి

 

రేపటికి ఏడాది!
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్‌ మరణించి ఏడాది పూర్తయినా ఇంకా న్యాయం కోసం దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, విద్యార్థిలోకం ఎదురుచూస్తూనే ఉన్నాయి! విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతోన్న వివక్షని భరిస్తూ, నిర్లిప్తతను అలవాటుగా మార్చుకున్న సమాజం మేల్కొనకపోతే రోహిత్‌ లాంటి బలవన్మరణాలు పునరావృతం అవుతూనే ఉంటాయి. అందుకే.. అసమానతలను పెంచి పోషించే ఈ విద్యావిధానంలో మార్పు రాకుండా విశ్వవిద్యాలయాల్లో మరణాలకు చరమగీతం పాడలేము అని అంటున్నారు పౌర హక్కుల ఉద్యమకారిణి, ప్రముఖ పాత్రికేయురాలు, గుజరాత్‌ అల్లర్లలో బాధితులకోసం ఏర్పాటు చేసిన ‘సిటిజన్స్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌’ కార్యదర్శి తీస్తా సెతల్‌ వాద్‌. ఆమెతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ.

► హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ విద్యార్థి రోహిత్‌ మరణించి ఏడాది అవుతోంది! ఇప్పటికీ కేసు ముందుకు సాగకపోవడానికి కారణమేమనుకుంటున్నారు?
రోహిత్‌ కన్నా ముందూ, రోహిత్‌ తరువాత కూడా సెంట్రల్‌  యూనివర్సిటీలో ఆత్మహత్యలు జరిగాయి. మనసుని కుదిపేసే అంశాలెన్నో ఉన్నాయి కనుకనే రోహిత్‌ కేసు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. జెఎన్‌యులో విద్యార్థి ఉద్యమం కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారందరినీ కదిలించింది. విశ్వవిద్యాలయాలను మతోన్మాద రాజకీయాలు శాసిస్తున్నంత కాలం ఉద్యమాలు తప్పవు. రోహిత్‌ కేసులో న్యాయం జరగకపోవడానికి కారణం స్పష్టం. మంత్రులు, రాజకీయ నాయకులు ఈ కేసులో కీలక నిందితులు. వారిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంది.

► విశ్వవిద్యాలయాల్లో వివక్షని ఎలా అర్థం చేసుకోవాలి?
ఉన్నత విశ్వవిద్యాలయాల్లో కనిపిస్తున్న వివక్షపై గతంలో థోరట్‌ కమిటీ చేసిన సిఫార్సులు విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతోన్న అనేక అమానవీయ అంశాలను; దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న వివక్షను వెలుగులోనికి తెచ్చాయి. ఉన్నత విశ్వవిద్యాలయాల్లోకి ప్రవేశిస్తోన్న తొలితరం విద్యార్థులకు కావాల్సిన తోడ్పాటు అందకపోగా, వారిని యూనివర్సిటీల నుంచి వెలివేసే స్థాయికి విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు దిగజారాయి. అట్టడుగు వర్గాలనుంచి వచ్చే విద్యార్థులకు రెమెడీ క్లాసులు నిర్వహించాలని థోరట్‌ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం దేశంలో ఉన్న 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాల నుంచి ఏదో రకమైన వివక్షపై ఫిర్యాదులు వస్తున్నాయి. అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. థోరట్‌ కమిటీ రిపోర్టు ఇదే చెప్పింది. 84 శాతం ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులకు రెమెడీ క్లాసుల్లేవు. ఇదే సామాజిక వర్గాల విద్యార్థుల్లో 50 శాతం మందికి ఇంటర్నల్‌ మార్కుల్లో కోత పెట్టినట్టు తెలింది. అద్భతమైన ప్రతిభ కలిగిన విద్యార్థులు సైతం అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సంపాదించినప్పటికీ కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అవుతున్న పరిస్థితికి వివక్షే కారణం. ఇది అందరికీ తెలుసు. కానీ ఎవరికీ శిక్షలుండవు. దళిత, ఆదివాసీలకు ఉన్నత విద్యావ్యవస్థల్లో అవకాశాల్ని తిరస్కరించడంలో భాగమే ఈ వివక్ష.

►పరిష్కారం ఏమిటి?
ఎక్కడా థోరట్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయడంలేదు. విద్యార్థుల్లో స్ట్రెస్‌ని తగ్గించేందుకు, వారిలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ఎక్కడా కూడా ఇంతవరకు ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు. గ్రామీణ ప్రాతాల నుంచి వచ్చే దళిత ఆదివాసీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ లేదు. వారికి ఇంటర్నల్స్‌ మార్కుల్లో కోత, తరగతి గదుల్లో అవమానాలు, ల్యాబ్స్‌లో పరికరాలు అందుబాటులో ఉంచకపోవడం, కనీసం గైడ్‌ని కేటాయించకపోవడం ఇలాంటి ఎన్నో రకాల వివక్షను ఈ వర్గాల విద్యార్థులు ఎదుర్కొంటున్నారు.

పాఠశాల విద్యాస్థాయి నుంచి స్త్రీపురుష వివక్షని, కుల వివక్షని పెంచి పోషిస్తోంది మన విద్యావ్యవస్థ. అక్కడే మార్పు అవసరం. థోరట్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయడం, దాని ఆధారంగా వివక్షారహిత విశ్వవిద్యాలయాల కోసం ఒక యాక్ట్‌ ని తీసుకురావడం నేటి ఆవశ్యకత. అయితే అది రోహిత్‌ యాక్ట్‌ అయినా, సమానత్వాన్ని కాంక్షించే అంబేడ్కర్‌ యాక్ట్‌ అయినా అది సమ సమాజానికి దారి ఏర్పరచాలి.

ఇప్పటికే ఎన్నో చట్టాలున్నాయి. ఉదాహరణకు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ యాక్టు లాంటివి. రోహిత్‌ యాక్టు మాత్రం అమలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా?
ఏ చట్టమైనా సక్రమంగా అమలుచేయించే బాధ్యత మళ్లీ పౌరసమాజంపైనే ఉంటుంది. చట్టం అంటూ ఉంటే ప్రశ్నించే అధికారం ఉంటుంది. అందుకే రోహిత్‌ చట్టాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. అయితే ఈ ఉద్యమం మొత్తం రోహిత్‌ చట్టాన్ని ఒక్కదాన్నే కోరుకోలేదు. ఉద్యమ డిమాండ్లలో అది కూడా ఒకటి. అయితే ఎస్‌సి ఎస్‌టి అట్రాసిటీ కేసుల్లో దోషులను ఎలా తప్పిస్తున్నారో మనం రోహిత్‌ కేసులో స్పష్టంగా చూశాం. అదే చాలా వాటిల్లో జరుగుతోంది.

► ఎపి ప్రభుత్వం త్వరలోనే రోహిత్‌ దళితుడు కాదని, బీసీ అని తేల్చబోతోంది. దీనిపై మీ అభిప్రాయం?
ఇది చాలా దుర్మార్గమైన విషయం. రోహిత్‌ తల్లి రాధిక ఒంటరి స్త్రీ. ఆమాటకొస్తే దళిత స్త్రీల పోరాటాలన్నీ ఒంటరి స్త్రీల పోరాటాలే. ఆమె సర్వస్వం త్యాగం చేసి బిడ్డల్ని పెంచి పెద్దచేసి, విద్యాబుద్ధులు నేర్పించినా తల్లి కులం బిడ్డకి రాకపోవడం పురుషాధిపత్య సమాజం నిజస్వరూపం. ఏ సంబంధమూ లేని తండ్రి కులం ఎలా వర్తిస్తుందో ఎపి ప్రభుత్వానికే అర్థం కావాలి. రోహిత్‌ బీసీ అని తేల్చబోవడం పెద్ద రాజకీయ కుట్ర. – అత్తలూరి అరుణ

తీస్తా సెతల్‌ వాద్‌ ఉద్యమకారిణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement