ప్రణాళిక ప్రకారం జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవడం ఒక కళ. తీసుకొన్న నిర్ణయంలో నేర్పు, వేసిన ఎత్తులో వ్యూహం, పడిన శ్రమకు ప్రతిఫలం.. కొన్ని జీవితాల్లోని సక్సెస్ పాఠం అది. అయితే మరికొన్ని జీవితాల్లో భిన్నమైన పరిస్థితులుంటాయి. శ్రమ, పోరాటం, ఓటమి, నిరుత్సాహం. అంతటితో ఆగిపోయే వ్యక్తులు కొందరు అయితే... ఆ అపజయాలనే విజయానికి సోపానాలుగా చేసుకొనే వారు మరికొందరు. ఎదురుదెబ్బలను, పరాజయాలను, అవమానాలను తృణప్రాయంగా తీసుకొని జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకొనే స్థితప్రజ్ఞత మరికొందరిలో ఉంటుంది. జీవితానికి, విజయానికి కొత్త నిర్వచనం ఇవ్వగల శక్తిమంతులు వాళ్లు. అలాంటి వారిలో ఒకరు సందీప్ మహేశ్వరి. ఇమేజెస్ బజార్‌తో అద్భుతాలు సాధిస్తున్న యువకుడు.
అతడు ఒక మధ్య తరగతి కుటుంబంలోని వాడు. దేశరాజధాని ఢిల్లీలో నివాసం. మనసులో ఎన్నో ఆలోచనలు, మరెన్నో కలలు... అయితే లక్ష్యదిశగా దూసుకెళ్లడానికి తగిన వ్యూహమేలేదు. తండ్రిది అల్యూమినియం వ్యాపారం. బాగానే నడుస్తున్న ఆ వ్యాపారం అనుకోకుండా దెబ్బతిన్నది. ఫలితంగా ఆ కుటుంబంలో ఒక్కసారిగా కుదుపులు. ఆర్థికంగా తీవ్రమైన కష్టాలు. ఏం చేయాలో అర్థం కానిస్థితి. దీంతో చదువుమీద కూడా దృష్టి నిలపలేకపోయాడు, బీకాం చదువును ఫైనలియర్‌లోనే వదిలేశాడు.
ఏం చేద్దామనుకొంటున్నావు? అని విధి ప్రశ్నిస్తే... చదుకొంటాను అని సమాధానం ఇచ్చాడు! జీవితాన్ని చదువుతానన్నాడు.
అబ్బాయిలు అందంగా ఉంటారా..?! అబ్బాయిల్లో అందమేముంది! అది అమ్మాయిల సొత్తు కదా! అబ్బాయిలు అంతిమంగా ‘హ్యాండ్‌సమ్’గా ఉంటారు. తను కూడా అలాగే ఉన్నానని అనిపించింది సందీప్‌కు. స్నేహితుల ద్వారా ఉన్న పరిచయాలతో మోడలింగ్‌లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. అదృష్టాన్ని వెదుక్కొన్నాడు. అవకాశాలు లభించాయి.
అయితే అప్పుడు అర్థం కాలేదు.. పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నానని! వేధింపులు! పోటీతత్వం ఎక్కువగా ఉంది. కలర్‌ఫుల్‌గా, జోష్‌గా కనిపించే ఆ రంగంలో సెటిల్ కావడానికి ప్రయత్నించే అనేకమంది మేల్ మోడల్స్ మధ్య తీవ్రమైన పోటీతో.. సీనియర్ మోడల్స్ తమలాంటి జూనియర్‌లను తొక్కిపెట్టడానికి ప్రయత్నించేవారట!
సందీప్ గ్లామర్ కోసం ఆ ఫీల్డ్‌లోకి రాలేదు. పొట్టకూటి కోసం వచ్చాడు. అక్కడ తనలాగే ‘స్ట్రగులింగ్’ దశలో ఉన్న అనేకమంది యువకులను గమనించాడు. వారందరినీ చూశాక అతడికి ఒక ఐడియా వచ్చింది. చేతికి కెమెరా వచ్చింది. రెండు నెలల్లోనే ఫొటోగ్రఫీ విద్య అబ్బింది. మోడల్‌గా కాదు, కెమెరామెన్‌గా మోడలింగ్ ప్రపంచాన్ని మార్చేస్తానని అన్నాడు! అయితే ఆ ప్రయత్నం ఆరు నెలల్లో అతడి అడ్రస్‌ను మార్చేసింది. ముగ్గురు స్నేహితులతో కలిసి నెలకొల్పిన మాష్ ఆడియో విజువల్స్ అనే సంస్థ దిగ్విజయంగా మూతపడింది.
ఉద్యోగం చేస్తానని వెళితే ఒత్తిళ్లు, వ్యాపారం చేద్దామని అనుకొంటే కలిసి రాలేదు. కుటుంబ కష్టాలు కామన్. అన్ని అనుభవాలు సంపాదించినప్పటికీ అతడి వయసు 21 యేళ్లు.
ఈ క్షణం వరకూ నువ్వు సంపాదించుకొంది మొత్తం పోయినా.. నీ చేతిలో భవిష్యత్తు ఉంటుంది. సందీప్‌కు అదే అనిపించింది. తన బ్రెయిన్ ఇంకా ఫ్రెష్‌గానే ఉంది. అదే తన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అయితే తనకంటూ ఒక గుర్తింపు రావాలి. ఆ గుర్తింపే తన జీవితాన్ని మార్చగలదన్నాడు. అందుకోసం కొత్త వ్యూహాన్ని రచించాడు.
పది గంటలా నలభై ఐదు నిమిషాలు... 122 మంది మోడల్స్.. మొత్తం పదివేల ఫొటోలు! ప్రపంచంలోని ఏ ఫొటోగ్రాఫర్‌కూ సాధ్యం కాని ఫీట్ అది. అలాంటి దాన్ని సాధించి రికార్డు సృష్టించాడు. దేశరాజధానిలోని మెట్రో పేజీల్లో పతాక శీర్షికలకు ఎక్కాడు. మోడలింగ్‌లో ఉన్న రోజుల్లో అక్కడ తనలాగే ఇబ్బంది పడుతున్న యువతీయువకులను అందరినీ కలుపుకొని, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సందీప్ ఆ ఫీట్‌ను సాధించాడు.
అది అతడికి గుర్తింపును ఇచ్చింది. ఆ ఫొటోలే అతడికి అస్త్రాలుగా మారాయి. అలాంటి స్టఫ్‌తో ‘ఇమేజెస్‌బజార్‌డాట్‌కామ్’ను స్థాపించాడు. భిన్నమైన హావభావాలతో ఉన్న మోడల్ ఫొటోలకు వేదిక అది అనే ప్రచారాన్ని కల్పించాడు. ప్రపంచ రికార్డు హోల్డర్ కాబట్టి మీడియా కూడా ఇతడి గురించి రాస్తూ ఆ సైట్ గురించి మంచి ప్రచారం కల్పించింది. ప్రతీకాత్మక చిత్రాల అవసరం ఉన్న అనేక సంస్థలు, మీడియా ఈ సైట్ మీద ఆధారపడ్డాయి. ఇంకేముంది ప్రతి ఫొటో అమ్మకమే!
పదేళ్లు గడిచి ప్రస్తుతానికి వస్తే విశ్వవ్యాప్తంగా అక్షరాలా ఏడువేల సంస్థలు ఫొటోల కోసం ఇమేజెస్‌బజార్‌పై ఆధారపడ్డాయి... ఈ సంస్థతో కాంట్రాక్టులు కుదుర్చుకొని ఫోటోలను వాడుకుంటున్నాయి. మొత్తం 45 దేశాల్లో ఈ నెట్‌వర్క్ ఉంది. సందీప్ సైట్ కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధించింది. ఇలా అతడు మోడలింగ్ ప్రపంచాన్ని మార్చివేశాడు!
ఇప్పుడు సందీప్ జీవితం అనేక జీవితాలకు ఒక పాఠం. అతడు పడ్డ కష్టాలు, వాటిని ఎదుర్కొని ఎదిగిన తీరు.. సాధించిన విజయం... స్ఫూర్తిదాయకం. వ్యాపారవేత్తగా అతడు లెక్కకు మించి అవార్డులు అందుకొన్నాడు. సృజనాత్మక వ్యాపారిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.
- జీవన్
సృజనాత్మక వ్యాపారి..!
Published Wed, Aug 6 2014 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
Advertisement
Advertisement