
ఈ ఫోన్... ఆటవస్తువు కూడా!
స్మార్ట్‌ఫోన్లు వచ్చాక, వాటిలో ఒక్కో సౌకర్యం ఒక్కొక్కరికి నచ్చుతోంది. కానీ, స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే ఆటలాడుకొనే వసతి మాత్రం ....
స్మార్ట్‌ఫోన్లు వచ్చాక, వాటిలో ఒక్కో సౌకర్యం ఒక్కొక్కరికి నచ్చుతోంది. కానీ, స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే ఆటలాడుకొనే వసతి మాత్రం చాలామందికి నచ్చే విషయం. కాస్తంత ఖాళీగా ఉండి, విసుగు అనిపిస్తే చాలు - ఫోన్ తీసుకొని, ఆటలు ఆడుకొనేవారు చాలామంది. పిల్లలకు వినోదం కోసం ఈ మధ్య స్మార్ట్‌ఫోన్లు ఇచ్చి గేమ్స్ తెరిచి ఇవ్వడం పెద్దలకు అలవాటుగా మారింది. మరి, ఇంతకీ స్మార్ట్‌ఫోన్లలో గేమ్స్ ఎక్కువగా ఆడేది ఎవరనుకుంటున్నారు? సాధారణంగా ఎవరమైనా సరే ‘ఏముంది! పిల్లలే!’ అని జవాబిస్తాం. కానీ, అసలు నిజం వేరు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్లను గేమ్స్ కోసం ఎక్కువగా వినియోగిస్తున్నది - ఆడవాళ్ళట! ఈ సంగతి తాజా సర్వేలో వెల్లడైంది. ప్రపంచం నలుమూలల్లోని 12 దేశాల్లో ఫేస్‌బుక్ వాళ్ళు సర్వే చేసి మరీ, ఈ సంగతి బయటపెట్టారు.
ఇలా ఫోన్లను గేమ్స్‌కి వాడుతున్నవాళ్ళలో 47 శాతం మంది స్త్రీలే అట! ఫేస్‌బుక్‌కు చెందిన డేటా ఎనాలసిస్ టీమ్ ‘ఫేస్‌బుక్ ఐ.క్యు’ వాళ్ళు ఒక మార్కెట్ టీమ్ ద్వారా ఈ సర్వే చేయించారు. ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్యం, ఆసియాలలో పద్ధెనిమిదేళ్ళ పైబడిన వాళ్ళలో ఈ సర్వే చేశారు. గమ్మత్తేమిటంటే, స్మార్ట్‌ఫోన్లు వాడేవారిలో 71 శాతం మంది దాన్ని గేమింగ్ డివైజ్‌గా వాడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది.