అమలాపురం టౌన్: ఆ బాలికకు 16 ఏళ్లు... ఆ బాలుడికి 17 ఏళ్లు... ఇద్దరూ మైనర్లే. బాలికది అమలాపురం... బాలుడిది గుంటూరు జిల్లా కారంపూడి మండలం గాదేవారిపల్లి. వారిద్దరినీ కలిపాయి స్మార్ట్ ఫోన్, వాట్సాప్, ఫేస్‌బుక్. ఆ ఇద్దరికీ వారి వారి తల్లిదండ్రులు ఆ చిరుప్రాయంలోనే స్మార్ట్ ఫోన్లు ఇచ్చేశారు. దీంతో వారు ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో ఆరితేరారు. బాలుడు ఇటీవల కాకతాళీయంగా చేసిన ఓ ఫోన్ కాల్ అమలాపురంలోని ఆ బాలిక ఫోన్‌కు వచ్చింది. అలా ఇద్దరి మధ్య ముందు మాటలు కలిశాయి. తర్వాత వాట్సాప్‌లో మెసేజ్‌లు... ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో చాటింగ్‌లు చకా చకా సాగిపోయాయి.
ఇక్కడే ట్విస్ట్ చోటుచేసుకుంది. బాలిక వాస్తవానికి తొమ్మిదో తరగతి చదువుతోంది. అయితే వాట్సాప్, ఫేస్‌బుక్‌లో తాను మెడికల్ స్టూడింట్‌గా చెప్పుకుని పరిచయం పెంచుకుంది. బాలుడు చదివేది ఇంటర్మీడియట్ అయితే తానో ఐఐటీ సూడేంట్‌గా చెప్పుకున్నాడు. అలా ఇద్దరూ రోజూ వాట్సాప్, ఫేస్‌బుక్‌ల అనుసంధానంగా ఊహలు, కమ్మని కబుర్లతో గడిపేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఫోన్ కాల్ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇంకేముంది ఓ రోజు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇద్దరూ అప్పటి దాకా ప్రత్యక్షంగా చూసుకున్న పరిస్థితి లేదు.
అబద్ధాల చదువులు గొప్పగా చెప్పుకున్నా.. తర్వాత ఏమి అవుతుందని ఆలోచించలేదు. బాలుడు ఆ బాలికను రాజమహేంద్రవరం రమ్మన్నాడు. బాలిక ఇంట్లో చెప్పకుండా రాజమహేంద్రరం వెళ్లింది. గుంటూరు జిల్లా నుంచి ఆ బాలుడు అక్కడికి వచ్చాడు. ఇద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం అటు బాలుడు... ఇటు బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. మైనార్టీ తీరని ఆ ఇద్దరి వైపు తల్లిదండ్రులు పెళ్లికి ససేమిరా అన్నారు. అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు బాలుడిపై బాలిక కిడ్నాపు కేసు నమోదైంది.
ఇందులో భాగంగా సీఐ శ్రీరామకోటేశ్వరరావు గుంటూరు జిల్లా నుంచి ఆ బాలుడిని శుక్రవారం రాత్రి కస్టడీలోకి తీసుకున్నారు. అంతకు ముందు బాలుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిన్న వయస్సులోనే తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తే పర్యవసనాలు ఇలానే ఉంటాయని సీఐ అన్నారు. పిల్లలు ఇలాంటి నేరాల వైపు రాకుండా ఉండాలంటే తమ పిల్లలు మేజర్లు అయ్యాక స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని..ఆ లోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు ఇవ్వవద్దని సీఐ శ్రీరామ కోటేశ్వరరావు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment