ఫేస్‌బుక్‌ ప్రేమ ఎంత పని చేసింది.. | Lovers commits Suicide Attempt In Kurnool district | Sakshi
Sakshi News home page

ప్రాణాల మీదకు తెచ్చిన ఫేస్‌బుక్‌ ప్రేమ

Published Tue, May 15 2018 10:56 AM | Last Updated on Tue, Aug 21 2018 6:08 PM

Lovers commits Suicide Attempt In Kurnool district - Sakshi

సాక్షి, కర్నూలు, ఆదోని ‌: ఆంధ్రా అబ్బాయి.. తెలంగాణ అమ్మాయి.. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యారు. అమ్మాయికి గతంలోనే వివాహమైంది. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన యువకుడితో ప్రేమలో పడింది. భర్తను కాదని అతనితో వచ్చేసింది. ఇరువురి ప్రేమకు పెద్దలు నిరాకరించారు. ఏం చేయాలో దిక్కుతోచక ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ సంఘటన సోమవారం కర్నూలు జిల్లా ఆదోనిలోని నెట్టెకల్‌ క్రాస్‌ సమీపంలో చోటు చేసుకుంది. 

త్రీటౌన్‌ ఎస్‌ఐ రామ్‌నాయక్‌ కథనం మేరకు.. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా మహబూబాబాద్‌కు చెందిన చంద్రకళకు ఐదేళ్లక్రితం అదే ప్రాంతానికి చెందిన భీమయ్యతో వివాహమైంది. పిల్లల్లేరు. ఆమెకు ఏడాదిన్నరక్రితం కర్నూలు జిల్లా నందవరం మండలం గంగవరం వాసి మురళీకృష్ణ ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయ్యాడు. ఇది ప్రేమగా మారింది. 11 రోజులక్రితం మహబూబాబాద్‌ వెళ్లిన మురళీకృష్ణ ఆమెను తీసుకుని బెంగళూరు వెళ్లాడు. విషయం తెలుసుకున్న చంద్రకళ భర్త భీమయ్య నందవరానికొచ్చి మురళీకృష్ణ తల్లిదండ్రులు మల్లికార్జున, పార్వతిలను ఆరాతీశాడు. 

తమ కుమారుడు ఇంట్లో లేడని, తామూ వెతుకుతున్నామని వారు చెప్పారు. దీంతో ఇద్దరూ కలసి వెళ్లినట్లు నిర్ధారించుకున్న భీమయ్య.. నందవరం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు. తన భార్యను తీసుకెళ్లాడని, న్యాయం చేయాలని పోలీసులను కోరాడు. విచారణ చేపట్టిన పోలీసులు మురళీకృష్ణ తల్లిదండ్రులను పిలిపించి వారితో కుమారుడికి ఫోన్‌ చేయించారు. ఎక్కడున్నా వెంటనే రావాలని కోరారు. అమ్మాయి పంచాయితీ కూడా సెటిల్‌ చేస్తామని చెప్పారు. సోమవారం ఊరికొస్తానని, గ్రామసర్పంచ్‌ విరుపాక్షరెడ్డితోపాటు మరికొందర్ని తీసుకురావాలని మురళీకృష్ణ కోరాడు. 

అయితే నందవరానికి వెళ్లకుండా ఆదోనికి వచ్చారు. తల్లిదండ్రులకు ఫోన్‌ చేశాడు. వారితోపాటు సర్పంచ్, మరికొంత మంది వెళ్లి పంచాయితీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే తనను తిరిగి భర్త వద్దకెళ్లి కాపురం చేసుకోమంటారేమో అని భయపడి చంద్రకళ సైడ్‌కు వెళ్లి పురుగుమందు తాగింది. తర్వాత ఆమెను తీసుకొస్తానని చెప్పి వెళ్లిన మురళీకృష్ణ కూడా పురుగుమందు తాగాడు. వారిని వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement