
పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచడం ఎలా?
మాక్సిమైజింగ్ ద మెమరీ
మా పిల్లలు ఈ సమ్మర్‌లో టీవీ చూడటం, వీడియోగేమ్స్ ఆడటం మినహా ఏం చేయడం లేదు. వారికి జ్ఞాపకశక్తి పెరిగేలా ఏవైనా చిట్కాలు ఉంటే చెప్పగలరు.
- మోహన్‌రావు, హైదరాబాద్
పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి ఎన్నో మేధోపరమైన వ్యాయామాలు ఉన్నాయి. ఉదాహరణకు జ్ఞాపకశక్తి పెంచే పజిల్స్‌ను సాల్వ్ చేయడం, గళ్లనుడికట్టు పజిల్స్ నింపడం, సుడోకు వంటి నెంబర్ల ప్రమేయంతో ఉండే ఆటలు ఆడటం ఒక మార్గం. వాటితో పాటు అనేక ఇతర అంశాలను ప్రాక్టీస్ చేయడం కూడా జ్ఞాపకశక్తిని పెంచడానికి దోహదపడతాయి. వాళ్లలో సమస్యను పరిష్కరించడం, సృజనాత్మక శక్తిని పెంచడం కోసం కొన్ని సామాజిక సమస్యలను వాళ్ల ముందు పెట్టి, సమాధానాలు కోరాలి.
హాస్యరసభరితమైన సినిమాలు చూడటం: హాస్యపూరితమైన సినిమాలు చూసేప్పుడు పిల్లలు గట్టిగా నవ్వుతుంటారు. ఈ ప్రక్రియలో మెదడు కణాలకు ఎక్కువ ఆక్సిజన్ అందుతుంటుంది. దాంతో మెదడు కణాలు మరింత జీవశక్తిని పుంజుకుంటాయి.మంచి ఆహారం తీసుకోవడం: మంచి ఆహారం కూడా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉదాహరణకు చేపలు, వాల్‌నట్స్, గుమ్మడిగింజలు, సోయాబీన్స్ వంటి ఆహారాల్లో ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటు నిత్యం ముదురాకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు తినడం, ఆయా సీజన్‌లలో లభ్యమయ్యే పండ్లను తీసుకోవడం కూడా జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు దోహదపడే అంశాలే.
మంచి నిద్ర: పిల్లలు గాఢంగా నిద్రపోవడం అవసరం. దీంతో వాళ్లలో సమస్యను ఛేదించే శక్తి (ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీస్) పెరుగుతాయి. పైగా నిద్ర సమయంలోనే మనం జ్ఞాపకముంచుకోవాల్సిన విషయాలను మెదడు తన జ్ఞాపక కేంద్రాలలో సుస్థిరం చేసుకుంటుంది.
ఆటలు : పిల్లలు తమ మెదడుకు రక్తసరఫరా బాగా జరిగేలా ఏరోబిక్స్ చేయడం, శరీరానికి శ్రమ కలిగించే ఆటలు ఆడటం వల్ల కూడా వారిలో జ్ఞాపకశక్తి మరింతగా పెంపొందుతుంది.
ధ్యానం: నిత్యం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల ఏకగ్రతా, దృష్టికేంద్రీకరణశక్తితో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. చెస్ (చదరంగం) ఆడటం కూడా దాదాపు ధ్యానంతో సమానం.
డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి,
సీనియర్ న్యూరాలజిస్ట్,
సిటీ న్యూరో సెంటర్,
మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్
మాక్సిమైజింగ్ ద మెమరీ