చూపున్న పాట... | inspires everyone to the amos life | Sakshi
Sakshi News home page

చూపున్న పాట...

Published Mon, Feb 2 2015 10:52 PM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

చూపున్న పాట...

చూపున్న పాట...

మిణుగురు
సమాజానికి దివిటీలు

 
ఇరవై తొమ్మిదేళ్ల ఆమోసు ను కలిసినప్పుడు అతను దీక్షగా మునివేళ్లతో కీ బోర్డు మీద సుస్వరాలు పలికిస్తూ కనిపించాడు. ఆ స్వరఝరి వెంబడి నేనూ కాసేపు ప్రయాణించాను. అతనితో మాట్లాడుతున్నంతసేపూ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోగలననే నమ్మకం, సాధించగలననే ఆత్మవిశ్వాసం ప్రతి మాటలోనూ కనిపించింది. పట్టుదల, దీక్షతో సహవాసం చేసిన ఇన్నాళ్ల అతని ప్రయాణం వైకల్యాన్ని ఎలా వెనక్కి నెట్టగలిగిందో తెలుసుకున్నాను. చీకటి-వెలుగుల రంగూ రూపు తెలియకపోయినా జీవితాన వెలుగులు నింపుకుంటున్న ఆమోసుతో కాసేపు ముచ్చటిస్తే యువత మదిలో అధైర్యం పుట్టనే పుట్టదు అనిపించింది. హైదరాబాద్ రామకృష్ణాపురంలో ఉంటున్న ఆమోసును కదిపితే తన జీవన ప్రయాణాన్ని ఒక ప్రవాహంలా వినిపించాడు.
 
అమ్మనాన్నలే చూపు...


‘‘నా పూర్తిపేరు ఆమోసు ప్రకాశ్. అమ్మ హైమావతి, నాన్న జయప్రకాశ్. రెండు కళ్లూ లేకుండా పుట్టిన నన్ను చూసి అమ్మానాన్నా చాలా బాధపడ్డారట. ఎలా పెరుగుతానో, ఏమౌతానో అని వారి బెంగ. నా కంటే ముందు పుట్టిన అన్నకు చూపు బాగానే ఉంది. నాకే ఇలా! విధికి తలవంచక తప్పదు. ఇచ్చిన బిడ్డనే కంటికి రెప్పలా సాక్కోవాలి. అలా అమ్మానాన్నలే నాకు చూపయ్యారు. చిన్నప్పటి నుంచి ‘చూపు’ లేదని నా పై చాలామంది జాలిచూపే వారు. అసలు చూపు అంటే ఏంటి?! ఇదో పెద్ద సందేహం నాకు. అయినా దాని గురించి ఏనాడూ చింత లేదు. సంగీతం అంటే పిచ్చి. ఎక్కడ పాటలు విన్నా అక్కడే ఆగిపోయేవాడిని. చేతికి అందిన వస్తువులను తడుతూ, ఆ శబ్దాలలో గమకాలను వింటూ ఆనందించేవాణ్ణి. అది చూసి అమ్మానాన్నా చిన్న చిన్న సంగీత వాద్యపరికరాలు కొనిచ్చేవారు. అవే నాకు నేస్తాలయ్యాయి. కాస్త పెద్దయ్యాక అంధుల పాఠశాలలో చేర్చారు. నా పనులు నేనే చేసుకోవడం, చదువుకోవడంతో అమ్మకు కాస్త బాధ తగ్గించినవాడినయ్యాను. నాన్న అయితే, ‘నీకు ఏది ఇష్టమో దానిపైనే పూర్తి శ్రద్ధ పెట్టు’ అని వెన్నుతట్టారు. ఆ మాటలు నాకు ఎక్కడలేని ధైర్యాన్నిచ్చాయి. అలా చదువుకుంటూనే, లైట్ మ్యూజిక్‌నీ వొంటపట్టించుకున్నాను. నా ఆలోచన ఒకటే ఎవరి మీదా ఆధారపడకూడదు. నేనుగా ఎదుగుతూనే నాలాంటి వారికి చేయూతనివ్వాలి.

రేయింబవళ్లూ సాధన...

పాఠశాల స్థాయిలోనే కీ బోర్డ్ నేర్చుకున్నాను. అసలు ఆ పరికరం ఎలా ఉంటుందో తెలియదు. ఏ మీట నొక్కితే ఏ రాగం వస్తుందో తెలియదు. సాధన.. రేయింబవళ్లూ సాధన. తెలియని రాగాలను వేళ్లతోనే తెలుసుకున్నాను. ఏ మీట నొక్కితే ఏ రాగం వస్తుందో మనసులో ముద్రవేసుకున్నాను. అలా సాధనలో ఉండగానే మా స్కూల్‌కి ఒకసారి సంగీతదర్శకులు రామాచారి గారు వచ్చి ‘త్రివేణి సంగమం’ అనే సంగీత కార్యక్రమం చేస్తున్నాం. అందులో మీ పాఠశాల నుంచి ప్రావీణ్యం గలవారు కావాలన్నారు. ఆ విధంగా శిల్పకళా వేదికలో మా స్నేహితులతో కలిసి ప్రముఖుల ముందు ప్రోగ్రామ్ చేశాను. ఆ ప్రశంసలు నన్ను మరింతగా కృషి చేసేందుకు తోడ్పడ్డాయి.
 
మ్యూజిక్ కంపోజింగ్...

 కీ బోర్డ్‌తో పాటు ఫ్లూట్, రిథమ్‌ప్యాడ్, శాక్స్‌ఫోన్, తబలా, జాజ్, ఢోలక్, కాంగో.. ఇలా తొమ్మిది వాద్యపరికరాలను మంద్రస్థాయిలో మోగించే నైపుణ్యాన్ని అలవరచుకున్నాను. గాత్రంలో శభాష్ అనిపించుకున్నాను. ఇందుకోసం కొన్నేళ్లు పట్టింది. అయినా వదల్లేదు. విజువల్లీ చాలెంజ్డ్ వ్యక్తులైన మాధవి అక్క, సురేంద్ర, ఏసుబాబు, నరేశ్, విక్టర్, రవీంద్ర..లను కలిశాను. వారూ సంగీతాభిలాష కలవారే! మేమంతా కలిసి ‘యువతరమా మేలుకో... ’ అనే కాన్సెప్ట్‌తో ‘లీడ్ ఇండియా 2020’ అనే ఆల్బమ్‌ని తయారుచేశాం. ఆ ఆల్బమ్‌కి నేనే సంగీత సారథ్యం వహించాను. అలాగే ‘శ్రీ బాబా మనసా స్మరామి’ అనే భక్తి మాలికలోని ఆరు పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేశాను.    
 
సంగీత దర్శకత్వం కల...


డిగ్రీ పూర్తయింది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. సంగీత దర్శకుడిగా ఎదగాలనేది నా కల. ఇప్పటికే వేదికల మీద ఎన్నో ప్రదర్శనలు ఇస్తున్న మా స్నేహ బృందంతో ఆ కల నెరవేర్చుకోవాలని కృషి చేస్తున్నాను. భుక్తి కోసం నా ఆదాయాన్ని నేను సంపాదించుకుంటున్నాను. నేను పుట్టినప్పుడు కళ్లు లేని నన్ను చూసి నా తల్లిదండ్రులు ఎంతగానో బాధపడ్డారట. ఇప్పుడు నన్ను చూసి చాలా సంతోషపడుతుంటారు’’ అని తెలిపాడు ఆమోసు.

 వీరి చూపుకు కొన్ని రంగులు, ఇంకొందరి హంగులు.. తెలియకపోవచ్చు. కానీ, ఈ సమాజంలో ఎదగగలమనే నిండైన ఆత్మవిశ్వాసం మాత్రం గుండెల నిండా ఉంది. ఆమోస్ లాంటివారికి కావల్సింది జాలి కాదు, కాస్త సహకారం... మరికాస్త ప్రోత్సాహం. సమాజం నుంచి ఈ రెండూ అందే బాధ్యతను మనమంతా తీసుకుందాం.
 
-  నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 పాఠకులకు గమనిక
 
 పేరుకు ఇది ‘మిణుగురులు’ శీర్షికే అయినా, ఇందులో వచ్చే వ్యక్తుల ఆదర్శవంతమైన జీవితాలు సమాజానికి దివిటీల వంటివి. చీకటిని తిడుతూ కూర్చోక, అమోస్‌లా చిరుదివ్వెలు వెలిగించుకున్న వారెవరైనా మీకు తారసపడితే వారి వివరాలు మాకు తెలియజేయండి. అంధులలో స్ఫూర్తి నింపడానికి మీ వంతు కర్తవ్యంగా ముందుకు రండి.

మా చిరునామా
మిణుగురులు, ఫ్యామిలీ, సాక్షి దినపత్రిక,
రోడ్ నెం.1, బంజారాహిల్స్,
హైదరాబాద్-34.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement