శ్రీవారూ... వాయిదాల వాదనలు!
ఉత్త(మ)పురుష
మా శ్రీవారి తెలివితేటలు అన్నీ ఇన్నీ కావు. కాకపోతే అవేవీ సక్రమమైన మార్గంలో ఉండవు. నేను ఏదైనా పని చెప్పగానే అప్పటికప్పుడు ఠక్కున చేయరు. ఏదో వంక పెట్టేసి దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఉండబట్టలేక ఓ రోజు అడిగా... ‘‘ఎందుకండీ ఎప్పటిపని అప్పుడు చేయరు? ఎలాగైనా చేయాల్సిందే కదా. చేసేస్తే పని తీరిపోతుంది కదా. వాయిదా వేస్తే పని అలాగే మిగిలి ఒత్తిడి పెరుగుతుంది కదా?’’ అన్నది నా ప్రశ్న. ‘‘అందుకే అప్పటికప్పుడు క్లియర్ చేసేయండి’’ అన్నది నా సలహా. దానికి మా ఆయన ఇచ్చిన జవాబు బంగారు అక్షరాలతో లిఖించదగ్గది.
‘‘ఏవోయ్... వాయిదాలు లేకపోతే ప్రపంచంలో అందం లేదోయ్. నువ్వు ఓ ఫ్లాటో లేదో ఇంటిజాగానో కొనుక్కుంటావ్. బ్యాంకు వాడు నీకు లోనిచ్చి... వాయిదాల ప్రకారం నీ దగ్గర ఈఎమ్‌ఐలు వసూలు చేసుకుంటూ ఉంటాడు. నువ్వు అద్దె ఇంటికి చెల్లించినట్టు కాసిన్ని రోజులు వాయిదాలు చెల్లిస్తావు. ఒకనాటికి ఇల్లు నీ సొంతమవుతుంది. ఒకవేళ నీకు వాయిదాలు అన్న కాన్సెప్టే నచ్చనిదనుకో. రొక్కం మొత్తం ఒకేసారి ఇవ్వాలన్నది నీ పాలసీ అనుకో. నీకీ జన్మలో ఇల్లు సొంతం కాదు. అదీ వాయిదాల గొప్పదనం.
ఇక న్యాయవ్యవస్థ మొత్తం వాయిదాల మీదే ఆధారపడి ఉంది. వాదనలన్నీ ఒకేరోజు వినాలంటే ఎంత పెద్ద జడ్జీకైనా కష్టమే. అందుకే వాయిదాల లెక్కన రోజుకు ఇన్నని కొన్ని వాదనలు విని నిస్పాక్షికంగా తీర్పిస్తారు జడ్జిగారు. అంతేనా... దేవుడికి సైతం పూజలన్నీ చేయడానికి ఒక్క రోజు సరిపోక నవరాత్రోత్సవాలంటూ వాయిదాల పద్ధతిన ప్రార్థనలు నిర్వహిస్తుంటారు.
అంతెందుకు... సముద్రం దగ్గర ఏకమొత్తంలో నీళ్లు అప్పుతీసుకున్న మబ్బులు... తడవకింతని వర్షం రూపంలో తీరుస్తాయి. అదేగానీ మబ్బులు ఒకేసారి అప్పు తీర్చేశాయనుకో... ఏ తుఫానో, వరదలో వచ్చి ఉత్పాతాల్లో ఉస్సూరమనాల్సిన ఖర్మ మనుషులది. అందుకే నేనేదైనా పని వాయిదా వేస్తున్నానంటే అందులో ఓ అంతరార్థం, ఎంతో ప్రకృతిప్రేమా, బోల్డంత దైవభక్తీ ఉన్నాయన్నమాట’’ అంటూ ఓ లెక్చర్ దంచారు మా ఆయన.
ఏవండీ... ఎంత (అతి) తెలివైన వారు కాకపోతే... ఎప్పటికప్పుడు చేయాల్సిన పనులను వేసే వాయిదాకీ... చెల్లింపుల వాయిదాకీ ముడేస్తారు చెప్పండి. అందుకే ఆయన బోడిగుండుకీ, మోకాలికీ ఎక్కడ ముడేస్తారో అనే భయం కొద్దీ ఆయనకు దేవుడు జుట్టే లేకుండా బట్టతల ఉంచేశాడు. ఆయనకు ఎలా బుద్ధి చెప్పాలో అప్పటికి తెలియలేదు నాకు.
‘‘ఇందండి మన బుజ్జిగాడి ప్రోగ్రెస్ కార్డు. సంతకం పెట్టండి’’ అంటూ ఓ కార్డు అందించా.
ఆ మార్కులను చూసి అద్దిరిపోయారు మావారు. ‘‘ఇవేం మార్కులోయ్. ఏవీ చదవట్లేదా వెధవ. కనీసం పాస్‌మార్కులు కూడా రాలేదు. ఇలా అయితే ఎలా? కాస్త కూర్చుని ప్రైవేటు చెప్పు వాడికి’’ అంటూ మరో పని పురమాయించారు నాకు.
‘‘చెప్పి చూశానండీ... వాడెమన్నాడో తెలుసా? నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తాడట. పాస్ కావడాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశాట్ట వెధవ. ఎంత తెలివో! అంతా అచ్చం తండ్రి పోలికే’’ అన్నాను.
అంతే! దెబ్బతో మా వారికి దిమ్మ తిరిగి పోయినట్లుంది. పనులు వాయిదా వేసే పనిని నిరవధికంగా వాయిదా వేసి, ఎప్పటి పని అప్పుడు చేస్తున్నారు. ఆ మరుసటి నెలలో మావారికి బుద్ధి చెప్పడం కోసం నేను తయారు చేయించిన ప్రోగ్రెస్‌కార్డు మీద కాకుండా... అసలు దాని మీదే ఆయన సంతకం చేయించి మావారు తన మనశ్శాంతిని వాయిదా వేసుకోకుండా చూశా.
- వై!