ఆత్మను, మనసును, శరీరాన్ని అనుసంధానం చేయడమే యోగా!
భరత్ ఠాకూర్, యోగా గురు
యోగాలో ఎన్నో విభిన్నమైన పద్ధతులు చూస్తున్నాం. వీటి గురించి మీరేమంటారు?
వేదకాలం నాటిది మన యోగా! పాశ్చాత్యులు ‘హాట్’యోగా అనేది చేస్తున్నారు. దానిని మనవారూ అనుకరిస్తున్నారు. వాళ్ల (విదేశాలు) దేశాల వాతావరణం చల్లగా ఉండటం మూలాన, శరీరాలు బిగుసుకుపోయి ఉంటాయి. దీంతో హాట్ హీటర్లు పెట్టుకొని శరీరాన్ని వేడి చేసి యోగా చేస్తారు. ఇది మనవాళ్లు క్రేజ్‌గా మొదలుపెడుతున్నారు. హఠయోగా అనే పదాన్ని హాట్ యోగాగా మార్చేశారు. ఒళ్లు కరిగించుకోవడానికి ఇష్టమొచ్చినట్టు ఎగిరితే అది యోగా అవదు.
మరి యోగా అంటే ఏంటి?
స్వేచ్ఛగా ఉండేవాడు యోగి. మనసులో వైరాగ్యం, భగవంతుని పట్ల ప్రేమ ఉండేవాడు యోగి. నాలుగు ఆసనాలు వేసినవాడు యోగి కాదు. ఆత్మను, మనసును, శరీరాన్ని అనుసంధానం చేయడమే యోగా! ఈ స్థితి ప్రకృతిలో మమేకం అయితేనే కలుగుతుంది. అందుకే, ప్రస్తుతం రిషీకేష్, హరిద్వార్, హిమాలయాల పర్యటనలో ఉన్నాను.
గృహస్థాశ్రమంలో యోగిగా ఉండటం సాధ్యమా? సాధనకు ఎంత సమయం కేటాయిస్తారు?
సాధన అనేది గంటో, రెండు గంటలకో పరిమితం కాదు. నిరంతరం యోగస్థితిలో ఉండటమే! గృహస్థాశ్రమంలో ఉంటూ పాతికేళ్లుగా నేను యోగాకే అంకితమయ్యాను. ఆర్టిస్టిక్ యోగా అనే ఆధునిక ప్రక్రియను సమాజానికి పరిచయం చేశాను.
ఆర్టిస్టిక్ యోగా అంటే ఏంటి?
చాలా వరకు ప్రాచీన యోగా పద్ధతులలో ‘ఇలా చేయాలి, అలా చేయకూడదు’ అనే నిబంధనలు ఉన్నాయి. ఆర్టిస్టిక్ యోగాలో ‘ఇలాగే చేయాల’నే బలవంతపు నిబంధనలు ఉండవు. ఇది ఇప్పటి జీవన పరిస్థితులకు అనుగుణంగా ఆధునీకరించినది. ఇది వారి వారి ఇష్టానుసారం ఉంటుంది. ఆహారనియమాలు పాటించాలనే నిబంధనలు కూడా లేవు. అతి సాధారణంగానే బాడీ ఫిట్‌నెస్, ఫ్లెక్స్‌బులిటీ, శక్తితో పాటు ఆనందస్థాయిలను పెంచుకోవచ్చు. చెడు అలవాట్లకు దూరం కావచ్చు.
సంప్రదాయ యోగాకు ఆర్టిస్టిక్ యోగాకు ఉన్న తేడా ఏంటి?
సంప్రదాయ యోగా పద్ధతులలో శ్వాస, ధ్యానం మీదనే కేంద్రీకృతం అయి ఉంటుంది. ఆర్టిస్టిక్ యోగా టోటల్ ఫిట్‌నెస్ కి ప్రాధాన్యం ఉంటుంది. కార్డియోవాస్క్యులర్ వర్కవుట్స్‌తో పాటు శ్వాస, ధ్యానం మిశ్రమంగా ఉంటుంది. అదేవిధంగా మన శరీరంలోని మైండ్–చైల్డ్ నిర్దుష్టభాగాలపైనా దృష్టిపెడుతుంది. దీంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది.