
పుట్టబోయే బిడ్డలో ఎలాంటి అవయవలోపాలూ, ఆరోగ్యలోపాలూ రాకుండా చూసే శక్తి పాలకూరలో ఉంది. చాలామంది ఆకుకూరలు అంటే పెదవి విరుస్తారు కాబట్టి, అచ్చం పాలకూరలో ఉండే లాంటి పోషకాలతోనే రూపొందించిన ట్యాబ్లెట్లను గర్భవతులకు ఇస్తుంటారు. దీన్ని బట్టి చూసినా పాలకూర గొప్పదనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కేవలం గర్భవతులకు మాత్రమే కాదు... అందరికీ ఆరోగ్యాన్నిచ్చే పోషకాలు పాలకూరలో పుష్కలంగా ఉన్నాయి. పాలకూరతో సమకూరే ప్రయోజనాల్లో ఇవి కొన్ని...
పాలకూరలో ఐరన్ చాలా ఎక్కువ. అందుకే రక్తహీనత ఉన్నవారికి డాక్టర్లు పాలకూరను సిఫార్సు చేస్తుంటారు. కొందరికి ఐరన్ టాబ్లెట్లు సరిపడుకపోవచ్చేమోగానీ... పాలకూరతో అలాంటి ఇబ్బందులేమీ ఉండవు. అనీమియా (రక్తహీనత) ఉన్నవారు పాలకూరను తరచూ తీసుకుంటే త్వరలోనే అనీమియా సమస్య తగ్గిపోతుంది. పాలకూరలో ల్యూటిన్, జియాగ్జాంథిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆ పోషకాలు చాలా శక్తిమంతమైనవి కావడంతో ఎన్నో రకాల క్యాన్సర్‌ల బారి నుంచి అవి కాపాడుతుంటాయి. పాలకూరలో విటమిన్–ఏ పాళ్లు చాలా ఎక్కువ. కళ్లకు మేలు చేసి, చూపును పదిలంగా ఉంచుతుంది. పాలకూరలో విటమిన్–సి కూడా చాలా ఎక్కువ. క్రమం తప్పకుండా పాలకూర తినేవారికి మంచి వ్యాధి నిరోధక శక్తి సమకూరుతుంది. ∙పాలకూర క్రమం తప్పక తినేవారికి గుండెజబ్బులు, హైబీపీ వంటి ఆరోగ్య సమస్యలు అంత తేలిగ్గా రావు. ∙పాలకూరలో పొటాషియమ్, మాంగనీస్, మెగ్నీషియమ్, కాపర్, జింక్ వంటి ఖనిజ లవణాలు, ఇతర పోషకాలు ఎక్కువ. మేనిని నిగారింపజేస్తూ... చర్మాన్ని చాలాకాలం యౌవనంగా ఉంచడానికి ఆ ఖనిజ లవణాలు దోహదం చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment