
కోయంబత్తూరులోని గణపతి ప్రాంతానికి వెళ్లి ఇషానా గురించి అడిగారంటే వెంటనే ‘ఆనా క్రియేషన్స్ ఆనా క్లాత్ ప్యాడ్స్’ దుకాణం చూపిస్తారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ప్రఖ్యాత ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థలూ గుర్తెరగగలిగిన పద్దెనిమిదేళ్ల ఇషానా గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే చిరుపారిశ్రామికవేత్తగా ఆమెకు తెలియకుండా ఆమె చేత పరిస్థితులు వేయించిన తొలి అడుగులలోకి వెళ్లాలి.
ముస్లిం మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది ఇషానా. 2018లో ప్లస్ టూ వరకు కోయంబత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడే ప్యాషన్ డిజైనింగ్ లో భాగంగా మిషన్ కుట్టడం నేర్చుకుంది. అదే సమయం పర్యావరణ పరిరక్షణకు పనిచేసిన బృందంలో సభ్యురాలిగా ఉంది. ఆమె ఆర్థిక స్తోమత ఉన్నత చదువులకు వెళ్లకుండా ఆమెను అడ్డుకోవడమే కాకుండా.. ప్రతి యువతికి యవ్వనంలో నెలసరికి అవసరమయ్యే శానిటరీ ప్యాడ్స్ కొనుగోలుకూ అవరోధం అయింది. అదే ఆమెలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టేలా చేసింది. నాటి తరంలో ఆడవారు క్లాత్ ద్వారానే నెలసరిని ఎదుర్కొనటం, వాటి కారణంగా పర్యావరణానికి కూడా ఎటువంటి నష్టం వాటిల్లక పోవటంపై ఇషానా పలు ఆర్టికల్స్ తిరగేసేలా చేసింది. చివరికి ఇషానా చేత క్లాత్ ప్యాడ్ నాప్కిన్స్ తయారికీ నాంది పలికించింది.
నాన్న దాచిన డబ్బే పెట్టుబడి
స్థానికంగా కాటన్ మిల్స్ లో దొరికే పల్చటి పాప్లిన్ క్లాత్ పీస్ ద్వారా ప్యాడ్స్ తయారు చేసి వాటిని మధ్యలో పెట్టి వాషబుల్ నాప్కిన్స్ తయారు చేయటం మొదలు పెట్టింది ఇషానా. ముందుగా తాను వాడి చూసి, తన స్నేహితులు, ఇరుగు పొరుగు వారి వినియోగానికి అందించింది. వారి నుంచి వచ్చిన సానుకూల స్పందన ఇషానాలో ఆత్మవిశ్వాసం పెంచేలా చేసింది. దాంతో తన ప్రాడక్ట్‌ని మార్కెట్ లోకి విడుదల చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఆర్థికంగా సహాయం చేసే వారు లేకపోవటంతో పెట్టుబడి కోసం తన తల్లిదండ్రులను డబ్బు అడిగింది.
ఇస్మాయిల్, సబీనా ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగులు. అయినప్పటికీ కూతురి ఆసక్తి, ప్రతిభ గమనించిన తండ్రి ఆమె పెళ్లి కోసం దాచిన నాలుగు లక్షలు ఇషానా చేతిలో పెట్టాడు. తండ్రి నమ్మకమే పెట్టుబడిగా తన ఇంటిపక్కనే ఉన్న ఒక షాపును అద్దెకు తీసుకుని ఐదు కుట్టు మిషన్లు కొనుగోలు చేసి పది మంది మహిళల సాయంతో గత మే నెలలో వాషబుల్ (ఉతికి వాడే) నాప్కిన్స్ తయారీ మొదలు పెట్టింది. రెండునెలల క్రితం వరకు కోయంబత్తూరు నగరానికే పరిమితమైన ఈ న్యాప్‌కిన్‌ల అమ్మకాలు ఆన్‌లైన్ తోపాటు, తమిళనాడులోని పలు ప్రాంతాలకు విస్తరించాయి.
వంద మందికి ఉపాధి!
ఆరంభంలో రోజుకు వందల సంఖ్యలో తయారీతో సరిపెట్టుకున్న ఇషానా.. ఇప్పుడు వేల ప్యాడ్స్ తయారీలో చిన్నపారిశ్రామికవేత్తగా మారింది. ప్రస్తుతం ఇషానా దగ్గర ఇరవై మంది మహిళలు పని చేస్తుండగా బయట నుండి సుమారు ఎనభై మంది మహిళలు రోజుకు అరవై నుండి డెబ్భై ప్యాడ్స్ కుట్టి ఆమెకు అందిస్తున్నారు. వాటి ద్వారా ప్రతి మహిళకు ఉపాధితోపాటు రోజుకు 400–500 రూపాయలు ఇంటి నుండే సంపాదించుకునే అవకాశం లభిస్తోంది.
ఒకవైపు వందకుపైగా మహిళలకు ఉపాధి, మరోవైపు చిన్న తరహా పరిశ్రమతో పద్దెనిమిదేళ్ల వయస్సులో యువ పారిశ్రామికవేత్తగా ఇషానా ఇప్పుడు కోయంబత్తూరు నగరానికి గర్వకారణంగా నిలుస్తోంది. ఈ విషయమై ఇషాను కదిలిస్తే నిండుగా నవ్వుతుంది. ‘‘ఇది నాపై నమ్మకం పెట్టుకున్న నా తల్లిదండ్రుల విజయం’’ అంటుంది. తన ఉత్పత్తికి పేటెంట్ హక్కేమీ తీసుకోలేదని, ఎవరైనా తన వద్దకు వస్తే తయారీ విధానం నేర్పుతానని అంటోంది.
– సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి
సాక్షీ టీవీ, చెన్నైబ్యూరో
Comments
Please login to add a commentAdd a comment