భక్త సంస్కర్త... బసవేశ్వరుడు
సందర్భం- మే 2 బసవ జయంతి
పన్నెండో శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో అవతరించిన బసవేశ్వరుడు గొప్ప దార్శనికుడు. సంస్కర్త, కుల, వర్ణ, లింగ వివక్షలు లేని సమసమాజ స్థాపనకు ఆనాడే అపారమైన కృషి చేసిన సంస్కర్త. సనాతన సంప్రదాయ ఆచరణలో నెలకొన్న చాదస్తాలనూ, మౌఢ్యాలను నిర్మూలించేందుకు నడుం కట్టి, సర్వ మానవ సమానత్వాన్ని ప్రబోధించిన విశ్వ గురువుగా, క్రాంతి యోగిగా వీరశైవమతావలంబుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మానవతావాది.
బసవేశ్వరుడు 1134 సంవత్సరంలో వైశాఖ శుద్ధ తదియ నాడు - అంటే నేటికి సరిగ్గా 880 సంవత్సరాల క్రితం - అక్షయ తృతీయ శుభదినాన జన్మించాడు. ఆయన జన్మస్థలం కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో హింగుళేశ్వర భాగవాటి (ఇంగలేశ్వర బాగేవాడి) అగ్రహారం. ఆయన తండ్రి మండెన మాదిరాజు అనే శైవ బ్రాహ్మణుడు. తల్లి మాతాంబిక. ఆయనను శివుడి ఆజ్ఞ వలన భూలోకంలో ధర్మస్థాపనకు అవతరించిన నందీశ్వరుడి అపరావతారంగా భావిస్తారు.
ప్రథమ ఆంధ్ర వీర శైవ కవిగా ప్రసిద్ధిగాంచిన పాల్కురికి సోమనాథుడు (1160-1240) తనకు దాదాపు సమకాలికుడైన బసవేశ్వరుడి జీవిత కథను ద్విపద ఛందస్సులో ‘బసవపురాణం’ పేరుతో కావ్యగౌరవానికి అర్హమైన భక్తి రస పురాణంగా రచించాడు. బసవేశ్వరుడికి శివభక్తి పసి వయసులోనే అబ్బింది. ఏడో యేట, గర్భాష్టమ సంవత్సరంలో తండ్రి తనకు ఉపనయనం సంకల్పించగా బసవడు వద్దని తండ్రితో వాదించాడు. ‘నిర్మల శివ భక్తి నిష్టితుడికి, కేవలం యజ్ఞాది వైదిక కర్మలతో కాలం పుచ్చే బ్రాహ్మణ్యంతో పనేమిటి? ఆ మార్గం నాకు అవసరం లేదు’ అని వైదిక కర్మాచరణల పట్ల మొదటి తిరుగుబాటు చేశాడు. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు.
కృష్ణానదీ, మాలా ప్రభానదీ సంగమ క్షేత్రమైన కూడల సంగమేశ్వరంలో సంగమేశ్వరుడి సన్నిధికి చేరాడు. పన్నెండు సంవత్సరాలు అక్కడ అధ్యయనమూ, అధ్యాత్మిక సాధనలూ చేసి, సంగమేశ్వరుడి కటాక్షానికి పాత్రుడై ఆయనను ప్రత్యక్షం చేసుకున్నాడు.
పదవిలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా బసవేశ్వరుడు తన జీవితమంతా శివాచారనిరతితో గడిపాడు. ఆయనది వీరభక్తి మార్గం. ప్రస్థాన త్రయంలో భాగమైన బ్రహ్మసూత్రాలను శ్రీకర భాష్యం, నీలకంఠ భాష్యం రూపంలో వీరశైవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే వ్యాఖ్యానాలు ఎనిమిదో శతాబ్దినుంచే ఉండేవి. కానీ బసవేశ్వరుడు దాన్ని తన బోధనల ద్వారా, ఆచరణల ద్వారా, రచనల ద్వారా విశేష వ్యాప్తిలోకి తెచ్చాడు. కులంతో, జాతితో, లింగంతో, వర్ణంతో నిమిత్తం లేకుండా శివభక్తికి అందరూ అధికారులే. శివభక్తులందరూ సర్వసమానులే.
బసవేశ్వరుడి మతం భక్తి, శివభక్తి, ధర్మార్థ కామ మోక్షాలతో పాటు శివభక్తి పంచమ పురుషార్థం. తను బిజ్జలుడి ప్రధానిగా ఉన్న కాలంలో బసవేశ్వరుడు ‘అనుభవ మంటపం’ అనే ఆధ్యాత్మిక వాద సభా వేదికను ఏర్పరచి, తద్వారా వివిధ ఆధ్యాత్మిక సంప్రదాయాల వారు తమ తమ భిన్న అభిప్రాయాలను చర్చించుకునే అవకాశం కల్పించాడు. ఈ చర్చా వేదికలే తరవాత ఎన్నో శతాబ్దాలకు ప్రపంచదేశాలు ఎన్నింటిలోనో ఏర్పడిన ప్రజాస్వామిక వ్యవస్థలలో శాసన సభలకు నమూనాగా నిలిచాయనవచ్చు.
ఈ పద్ధతులూ, విశ్వాసాలూ, ముఖ్యంగా కుల వర్ణాతీతమైన భక్త్యాచారాల చేత బసవేశ్వరుడు బోధించటం, సనాతనులకూ ఛాందసులకు, విరోధి అయ్యాడు. ఒక బ్రాహ్మణ కన్యకు, దళిత యువకుడికీ తలపెట్టిన వివాహాన్ని బసవేశ్వరుడు ప్రోత్సహించటం వల్ల బసవేశ్వరుడికీ బిజ్జలుడికీ మధ్య తీవ్రమైన విరోధం కలిగింది. ఫలితంగా బసవేశ్వరుడు రాజధానిని వదిలిపెట్టి 1196లో తిరిగి కూడల సంగమేశ్వర క్షేత్రానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత బిజ్జలుడి హత్య జరిగింది. 1196 లోనే శ్రావణ శుద్ధ పంచమి నాడు, బసవేశ్వరుడు లింగైక్యం చెందాడు.
- మల్లాది హనుమంతరావు