జిల్లా అంతటా ఆదివారం కార్తీక పౌర్ణమి శోభ వెల్లివిరిసింది. శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆధ్యాత్మిక శోభతో అలరారాయి. భక్తులు నదీ, సముద్ర స్నానాలు చేసి మహాశివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల వద్ద దీపారాధనలు, ప్రత్యేక దీపాలంకరణలు చేసి, నదిలో దీపాలు వదిలి పూజలు నిర్వర్తించారు. మంగినపూడి, హంసలదీవి, కృష్ణానదీ తీరప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. విజయవాడలో కృష్ణమ్మకు పంచహారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో హారతులు ఇచ్చి పూజలు నిర్వర్తించారు.
విజయవాడ, న్యూస్‌లైన్ : కృష్ణానదీ తీరం కార్తీక శోభతో వెల్లివిరిసింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాలకు, సాయంత్రం కృష్ణమ్మ మహా హారతులను తిలకించేందుకు వచ్చిన భక్తులతో దుర్గాఘాట్ కిటకిటలాడింది. పద్మావతి ఘాట్, సీతమ్మవారి పాదాలు, భవానీపురం పున్నమి ఘాట్ కూడా భక్తజనసంద్రమయ్యూయి. తెల్లవారుజామున రెండు గంటల నుంచి ప్రారంభమైన రద్దీ అంతకంతకు పెరిగింది. తెల్లవారేసరికి క్యూలైన్ రథం సెంటర్‌లోని బొడ్డుబొమ్మ సెంటర్‌కు చేరింది. ఘాట్లలో జల్లుస్నానాలకు ఏర్పాట్లు చేశారు.
వైభవంగా పుణ్యనదీ హారతులు
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం దుర్గాఘాట్‌లో నిర్వహించిన పుణ్యనదీ హారతుల కార్యక్రమానికి భక్తులు అశేషంగా తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు సాయంత్రం 5 గంటల నుంచే వేచి ఉన్నారు. తొలుత దేవస్థానం తరఫున కృష్ణమ్మకు పట్టుచీర, పసుపు కుంకుమ, పూజా ద్రవ్యాలను ఆలయ వైదిక కమిటీ సభ్యుడు మల్లయ్య, స్మార్త పాఠశాల విద్యార్థులు దుర్గాఘాట్‌కు తీసుకొచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలతో ఊరేగింపు వైభవంగా జరిగింది. అనంతరం కృష్ణమ్మకు ఈవో ప్రభాకర శ్రీనివాస్ దంపతులు పూజలు నిర్వహించారు.
ఓంకార, కుంభ, సింహ, నక్షత్ర, నాగ హారతులు ఇచ్చారు. పుణ్యనదీ హారతుల విశిష్టతను పరిపూర్ణానంద స్వామి, మాతా శివచైతన్య వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, గజల్ శ్రీనివాస్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ స్థానచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. నదీ హారతుల అనంతరం మహిళలు పెద్ద ఎత్తున కృష్ణమ్మకు పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వదిలారు. ఈ సందర్భంగా కనకదుర్గానగర్‌లో ఏర్పాటుచేసిన సాంస్కృత్రిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కిటకిటలాడిన దుర్గమ్మ సన్నిధి
కార్తీక పౌర్ణమి, ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది. కృష్ణానదిలో పుణ్యస్నానాల అనంతరం భక్తులు దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కాగా, కార్తీక వనసమారాధన నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి సన్నిధికి చేరుకున్నారు.
కనుల పండువగా పుణ్యనదీ హారతి
పెనుగంచిప్రోలు : కార్తీక పౌర్ణమి, మనగుడి కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి స్థానిక మునేరులో పుణ్యనదీ హారతిని కనుల పండువగా నిర్వహించారు. ముందుగా గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి విగ్రహాలను పల్లకీపై ఊరేగించారు. అనంతరం మునేరులోకి తీసుకెళ్లి మండపంపై ప్రతిష్టిం చారు. అనంతరం మహిళలు లలితా సహస్రనామం, అర్చకులు గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో ఎన్.విజయ్‌కుమార్ గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, సారె సమర్పించారు. అమ్మవారికి పంచహారతులు, కర్పూర హారతులు, శాంతి హారతి ఇచ్చారు. భక్తులకు ఆలయం వారే అరటి దొప్పలు, ఒత్తులు అందించగా వేల సంఖ్యలో మహిళలు మునేరులో దీపహారతులు వదిలారు. ఆలయ ఈఈ వైకుంఠరావు, ఏఈవోలు సీహెచ్ ప్రసాదరావు, మేడా గోపాలరావు పాల్గొన్నారు.
పౌర్ణమి శోభ
Published Mon, Nov 18 2013 12:33 AM | Last Updated on Fri, Nov 9 2018 6:22 PM
Advertisement
Advertisement