Krsnanadi
-
కృష్ణానదిపై బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు
కంచికచర్ల రూరల్ : కృష్ణానదీపై ఆరు ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. కంచికచర్లలో ఓ కార్యక్రమానికి ఆదివారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపేందుకు చెవిటికల్లు, అమరావతి మధ్యన నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. బందర్ పోర్టు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. పశ్చిమ కృష్ణాలో పరిశ్రమలు, కళాశాలల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయవాడను తీర్చిదిద్దేందుకు అవసరమైన మేరకు కృషి చేస్తున్నామని చెప్పారు. కంచిచర్లలో తాగునీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వివాదాలకు పోకుండా ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు నాయకులు కృషి చేయాలన్నారు. కంచికచర్ల సమీపంలో హత్యకు గురైన యార్లగడ్డ విజయ్ కేసులో నిందితుల్ని గుర్తించి తక్షణమే అదుపులోకి తీసుకోవాలని నందిగామ డీఎస్పీ హుస్సేన్‌ను ఫోన్లో మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కోగంటి వెంకటసత్యనారాయణ, నాయకులు ఎన్. నరసింహారావు, లక్ష్మీనారాయణ, గుత్తా వెంకటరత్నం, వేమా వెంకట్రావ్ పాల్గొన్నారు. పరామర్శ కంచికచర్లలో సీపీఎం సీనియర్ నాయకుడు దొడ్డపనేని రామారావు సతీమణి కమల (76) అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె భౌతికకాయాన్ని మంత్రి సందర్శించి నివాళులర్పించారు. హత్యకు గురైన తెలుగుదేశం కార్యకర్త యార్లగడ్డ విజయ్ తల్లిదండ్రులు సాంబశివరావు, ప్రభావతిలను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. -
భక్త సంస్కర్త... బసవేశ్వరుడు
సందర్భం- మే 2 బసవ జయంతి పన్నెండో శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో అవతరించిన బసవేశ్వరుడు గొప్ప దార్శనికుడు. సంస్కర్త, కుల, వర్ణ, లింగ వివక్షలు లేని సమసమాజ స్థాపనకు ఆనాడే అపారమైన కృషి చేసిన సంస్కర్త. సనాతన సంప్రదాయ ఆచరణలో నెలకొన్న చాదస్తాలనూ, మౌఢ్యాలను నిర్మూలించేందుకు నడుం కట్టి, సర్వ మానవ సమానత్వాన్ని ప్రబోధించిన విశ్వ గురువుగా, క్రాంతి యోగిగా వీరశైవమతావలంబుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మానవతావాది. బసవేశ్వరుడు 1134 సంవత్సరంలో వైశాఖ శుద్ధ తదియ నాడు - అంటే నేటికి సరిగ్గా 880 సంవత్సరాల క్రితం - అక్షయ తృతీయ శుభదినాన జన్మించాడు. ఆయన జన్మస్థలం కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో హింగుళేశ్వర భాగవాటి (ఇంగలేశ్వర బాగేవాడి) అగ్రహారం. ఆయన తండ్రి మండెన మాదిరాజు అనే శైవ బ్రాహ్మణుడు. తల్లి మాతాంబిక. ఆయనను శివుడి ఆజ్ఞ వలన భూలోకంలో ధర్మస్థాపనకు అవతరించిన నందీశ్వరుడి అపరావతారంగా భావిస్తారు. ప్రథమ ఆంధ్ర వీర శైవ కవిగా ప్రసిద్ధిగాంచిన పాల్కురికి సోమనాథుడు (1160-1240) తనకు దాదాపు సమకాలికుడైన బసవేశ్వరుడి జీవిత కథను ద్విపద ఛందస్సులో ‘బసవపురాణం’ పేరుతో కావ్యగౌరవానికి అర్హమైన భక్తి రస పురాణంగా రచించాడు. బసవేశ్వరుడికి శివభక్తి పసి వయసులోనే అబ్బింది. ఏడో యేట, గర్భాష్టమ సంవత్సరంలో తండ్రి తనకు ఉపనయనం సంకల్పించగా బసవడు వద్దని తండ్రితో వాదించాడు. ‘నిర్మల శివ భక్తి నిష్టితుడికి, కేవలం యజ్ఞాది వైదిక కర్మలతో కాలం పుచ్చే బ్రాహ్మణ్యంతో పనేమిటి? ఆ మార్గం నాకు అవసరం లేదు’ అని వైదిక కర్మాచరణల పట్ల మొదటి తిరుగుబాటు చేశాడు. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కృష్ణానదీ, మాలా ప్రభానదీ సంగమ క్షేత్రమైన కూడల సంగమేశ్వరంలో సంగమేశ్వరుడి సన్నిధికి చేరాడు. పన్నెండు సంవత్సరాలు అక్కడ అధ్యయనమూ, అధ్యాత్మిక సాధనలూ చేసి, సంగమేశ్వరుడి కటాక్షానికి పాత్రుడై ఆయనను ప్రత్యక్షం చేసుకున్నాడు. పదవిలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా బసవేశ్వరుడు తన జీవితమంతా శివాచారనిరతితో గడిపాడు. ఆయనది వీరభక్తి మార్గం. ప్రస్థాన త్రయంలో భాగమైన బ్రహ్మసూత్రాలను శ్రీకర భాష్యం, నీలకంఠ భాష్యం రూపంలో వీరశైవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే వ్యాఖ్యానాలు ఎనిమిదో శతాబ్దినుంచే ఉండేవి. కానీ బసవేశ్వరుడు దాన్ని తన బోధనల ద్వారా, ఆచరణల ద్వారా, రచనల ద్వారా విశేష వ్యాప్తిలోకి తెచ్చాడు. కులంతో, జాతితో, లింగంతో, వర్ణంతో నిమిత్తం లేకుండా శివభక్తికి అందరూ అధికారులే. శివభక్తులందరూ సర్వసమానులే. బసవేశ్వరుడి మతం భక్తి, శివభక్తి, ధర్మార్థ కామ మోక్షాలతో పాటు శివభక్తి పంచమ పురుషార్థం. తను బిజ్జలుడి ప్రధానిగా ఉన్న కాలంలో బసవేశ్వరుడు ‘అనుభవ మంటపం’ అనే ఆధ్యాత్మిక వాద సభా వేదికను ఏర్పరచి, తద్వారా వివిధ ఆధ్యాత్మిక సంప్రదాయాల వారు తమ తమ భిన్న అభిప్రాయాలను చర్చించుకునే అవకాశం కల్పించాడు. ఈ చర్చా వేదికలే తరవాత ఎన్నో శతాబ్దాలకు ప్రపంచదేశాలు ఎన్నింటిలోనో ఏర్పడిన ప్రజాస్వామిక వ్యవస్థలలో శాసన సభలకు నమూనాగా నిలిచాయనవచ్చు. ఈ పద్ధతులూ, విశ్వాసాలూ, ముఖ్యంగా కుల వర్ణాతీతమైన భక్త్యాచారాల చేత బసవేశ్వరుడు బోధించటం, సనాతనులకూ ఛాందసులకు, విరోధి అయ్యాడు. ఒక బ్రాహ్మణ కన్యకు, దళిత యువకుడికీ తలపెట్టిన వివాహాన్ని బసవేశ్వరుడు ప్రోత్సహించటం వల్ల బసవేశ్వరుడికీ బిజ్జలుడికీ మధ్య తీవ్రమైన విరోధం కలిగింది. ఫలితంగా బసవేశ్వరుడు రాజధానిని వదిలిపెట్టి 1196లో తిరిగి కూడల సంగమేశ్వర క్షేత్రానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత బిజ్జలుడి హత్య జరిగింది. 1196 లోనే శ్రావణ శుద్ధ పంచమి నాడు, బసవేశ్వరుడు లింగైక్యం చెందాడు. - మల్లాది హనుమంతరావు -
పౌర్ణమి శోభ
జిల్లా అంతటా ఆదివారం కార్తీక పౌర్ణమి శోభ వెల్లివిరిసింది. శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆధ్యాత్మిక శోభతో అలరారాయి. భక్తులు నదీ, సముద్ర స్నానాలు చేసి మహాశివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల వద్ద దీపారాధనలు, ప్రత్యేక దీపాలంకరణలు చేసి, నదిలో దీపాలు వదిలి పూజలు నిర్వర్తించారు. మంగినపూడి, హంసలదీవి, కృష్ణానదీ తీరప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. విజయవాడలో కృష్ణమ్మకు పంచహారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో హారతులు ఇచ్చి పూజలు నిర్వర్తించారు. విజయవాడ, న్యూస్‌లైన్ : కృష్ణానదీ తీరం కార్తీక శోభతో వెల్లివిరిసింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాలకు, సాయంత్రం కృష్ణమ్మ మహా హారతులను తిలకించేందుకు వచ్చిన భక్తులతో దుర్గాఘాట్ కిటకిటలాడింది. పద్మావతి ఘాట్, సీతమ్మవారి పాదాలు, భవానీపురం పున్నమి ఘాట్ కూడా భక్తజనసంద్రమయ్యూయి. తెల్లవారుజామున రెండు గంటల నుంచి ప్రారంభమైన రద్దీ అంతకంతకు పెరిగింది. తెల్లవారేసరికి క్యూలైన్ రథం సెంటర్లోని బొడ్డుబొమ్మ సెంటర్‌కు చేరింది. ఘాట్లలో జల్లుస్నానాలకు ఏర్పాట్లు చేశారు. వైభవంగా పుణ్యనదీ హారతులు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం దుర్గాఘాట్‌లో నిర్వహించిన పుణ్యనదీ హారతుల కార్యక్రమానికి భక్తులు అశేషంగా తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు సాయంత్రం 5 గంటల నుంచే వేచి ఉన్నారు. తొలుత దేవస్థానం తరఫున కృష్ణమ్మకు పట్టుచీర, పసుపు కుంకుమ, పూజా ద్రవ్యాలను ఆలయ వైదిక కమిటీ సభ్యుడు మల్లయ్య, స్మార్త పాఠశాల విద్యార్థులు దుర్గాఘాట్‌కు తీసుకొచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలతో ఊరేగింపు వైభవంగా జరిగింది. అనంతరం కృష్ణమ్మకు ఈవో ప్రభాకర శ్రీనివాస్ దంపతులు పూజలు నిర్వహించారు. ఓంకార, కుంభ, సింహ, నక్షత్ర, నాగ హారతులు ఇచ్చారు. పుణ్యనదీ హారతుల విశిష్టతను పరిపూర్ణానంద స్వామి, మాతా శివచైతన్య వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, గజల్ శ్రీనివాస్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ స్థానచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. నదీ హారతుల అనంతరం మహిళలు పెద్ద ఎత్తున కృష్ణమ్మకు పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వదిలారు. ఈ సందర్భంగా కనకదుర్గానగర్‌లో ఏర్పాటుచేసిన సాంస్కృత్రిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కిటకిటలాడిన దుర్గమ్మ సన్నిధి కార్తీక పౌర్ణమి, ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది. కృష్ణానదిలో పుణ్యస్నానాల అనంతరం భక్తులు దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కాగా, కార్తీక వనసమారాధన నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి సన్నిధికి చేరుకున్నారు. కనుల పండువగా పుణ్యనదీ హారతి పెనుగంచిప్రోలు : కార్తీక పౌర్ణమి, మనగుడి కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి స్థానిక మునేరులో పుణ్యనదీ హారతిని కనుల పండువగా నిర్వహించారు. ముందుగా గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి విగ్రహాలను పల్లకీపై ఊరేగించారు. అనంతరం మునేరులోకి తీసుకెళ్లి మండపంపై ప్రతిష్టిం చారు. అనంతరం మహిళలు లలితా సహస్రనామం, అర్చకులు గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో ఎన్.విజయ్‌కుమార్ గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, సారె సమర్పించారు. అమ్మవారికి పంచహారతులు, కర్పూర హారతులు, శాంతి హారతి ఇచ్చారు. భక్తులకు ఆలయం వారే అరటి దొప్పలు, ఒత్తులు అందించగా వేల సంఖ్యలో మహిళలు మునేరులో దీపహారతులు వదిలారు. ఆలయ ఈఈ వైకుంఠరావు, ఏఈవోలు సీహెచ్ ప్రసాదరావు, మేడా గోపాలరావు పాల్గొన్నారు.