కృష్ణానదిపై బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు
కంచికచర్ల రూరల్ : కృష్ణానదీపై ఆరు ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. కంచికచర్లలో ఓ కార్యక్రమానికి ఆదివారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపేందుకు చెవిటికల్లు, అమరావతి మధ్యన నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. బందర్ పోర్టు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు.
పశ్చిమ కృష్ణాలో పరిశ్రమలు, కళాశాలల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయవాడను తీర్చిదిద్దేందుకు అవసరమైన మేరకు కృషి చేస్తున్నామని చెప్పారు. కంచిచర్లలో తాగునీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వివాదాలకు పోకుండా ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు నాయకులు కృషి చేయాలన్నారు.
కంచికచర్ల సమీపంలో హత్యకు గురైన యార్లగడ్డ విజయ్ కేసులో నిందితుల్ని గుర్తించి తక్షణమే అదుపులోకి తీసుకోవాలని నందిగామ డీఎస్పీ హుస్సేన్‌ను ఫోన్‌లో మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కోగంటి వెంకటసత్యనారాయణ, నాయకులు ఎన్. నరసింహారావు, లక్ష్మీనారాయణ, గుత్తా వెంకటరత్నం, వేమా వెంకట్రావ్ పాల్గొన్నారు.
పరామర్శ
కంచికచర్లలో సీపీఎం సీనియర్ నాయకుడు దొడ్డపనేని రామారావు సతీమణి కమల (76) అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె భౌతికకాయాన్ని మంత్రి సందర్శించి నివాళులర్పించారు. హత్యకు గురైన తెలుగుదేశం కార్యకర్త యార్లగడ్డ విజయ్ తల్లిదండ్రులు సాంబశివరావు, ప్రభావతిలను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.