భారతదేశంలోని నలువైపులా నెలకొని ఉన్న చతుర్ధామక్షేత్రాలలో ఒరిస్సారాష్ట్రంలోని పూరీ క్షేత్రంలో గల జగన్నాథస్వామి ఆలయం చాలా విశిష్టమైనది. ఈ స్వామికే పురుషోత్తముడని మరో పేరు. ఇక్కడ స్వామి దారుబింబంగా అంటే కొయ్య విగ్రహరూపంలో బలభద్రుడు, సుభద్ర, సుదర్శన మూర్తులతో కలిసి ఏకపీఠంపై దర్శనమిస్తాడు.ప్రతి పన్నెండు లేక పంతొమ్మిది సంవత్సరాలకోసారి ఈ విగ్రహాలను విడిచిపెట్టి (భూస్థాపన చేసి) నూతన మూర్తులను సిద్ధం చేస్తారు. దీనినే నవకళేబర ఉత్సవం అంటారు. నూతన ప్రతిమలను తయారు చేసేటప్పుడు ఆ కొయ్యలకు ఔషధీగుణాలున్న అనేక లేపనాలు చేస్తారు.
చందనం, కర్పూరం, కస్తూరి, ఎర్రచందనం, ఎర్రటి బట్ట మొదలైన వాటిని విగ్రహం చుట్టూ అనేక సార్లు చుట్టటం జరుగుతుంది. గర్భగుడిలో రత్నవేదికపై నాలుగు విగ్రహాలతోపాటు లక్ష్మీదేవి లోహవిగ్రహం జగన్నాథస్వామికి కుడివైపు, విశ్వధాత్రి అని పిలిచే భూదేవి విగ్రహం ఎడమవైపు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నాటి రథయాత్ర, జ్యేష్ట పూర్ణిమ నాటి స్నానయాత్ర చాలా విశిష్టమైనవి. జగన్నాథ స్వామి దర్శనం సకల కష్టాలనూ దూరం చేసి సకలాభీష్టాలనూ తీరుస్తుంది.
– డాక్టర్ ఛాయా కామాక్షీదేవి
Comments
Please login to add a commentAdd a comment