అందాల రాణికి నూరేళ్లు | Jaipur Maharani Gayatri Devi 100th Birthday | Sakshi
Sakshi News home page

అందాల రాణికి నూరేళ్లు

Published Mon, May 6 2019 5:30 AM | Last Updated on Mon, May 6 2019 5:30 AM

Jaipur Maharani Gayatri Devi 100th Birthday - Sakshi

ఈ ఏడాది మే 23 కి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ రోజు ఎన్నికల ఫలితాలు వస్తాయి. అదే రోజు జైపూర్‌ మహారాణి గాయత్రీదేవి 100వ జయంతి. మరి ఎన్నికలకు, గాయత్రీదేవికి సంబంధం ఏమిటి? భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక పార్లమెంటుకు పోటీ చేసిన తొలి రాకుమారి గాయత్రీ దేవి. అదొకటే కాదు, ఈ అందాల రాణి ఘనతలు, విశేషాలు ఇంకా అనేకం ఉన్నాయి.గాయత్రీదేవి 1919 మే 23న లండన్‌లో పుట్టారు. కూచ్‌ బెహార్‌ సంస్థానపు ముద్దుల పట్టి గాయత్రి. బాల్యంలో ఆమెపై ప్రధానంగా ఇద్దరు మహిళల ప్రభావం ఉంది. ఒకరు : ఆమె తల్లి, రాజమాత.1922లో గాయత్రి తండ్రి చనిపోగా, ఆ తర్వాత దశాబ్దకాలం పాటు రాజమాతే పరిపాలించారు. ఇంకొకరు : గాయత్రి అమ్మమ్మ, బరోడా మహారాణి. ఆమె భర్త తన హయాంలో బరోడాను దేశంలోనే అత్యాధునిక సంస్థానంగా అభివృద్ధి పరిచారు.

ఈ ఇద్దరు రాణులూ కలిసి గాయత్రీదేవిని చక్కటి ఇంగ్లీషు సంస్కారంతో కూడిన భారతీయ యువరాణిగా మలిచారు. అందుకే గాయత్రి జైపూర్‌ మహారాజు మాన్‌సింగ్‌ను చేసుకుంటానని అనగానే అక్కడి రాజపుత్రుల కఠిన ఆచారాలను ఈ పిల్ల తట్టుకోగలదా అని కలత చెందారు. అయితే తట్టుకోవడం మాత్రమే కాదు, ఆధునిక యువతిగా తన ప్రత్యేకతను, తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు గాయత్రీదేవి. అంతేకాదు, రెండో ప్రపంచ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సంస్థాన వ్యూహాలు, వ్యవహారాలలో భర్తకు చేదోడుగా, కీలక సలహాదారుగా నిలిచారు. 1943లో ‘గాయత్రీదేవి బాలికల పాఠశాల’ను నెలకొల్పి, తొలి యేడాదే 40 మంది విద్యార్థులను చేర్చుకున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఇంగ్లిష్‌ టీచర్‌ని నియమించారు.

చాలా త్వరగా ఆ పాఠశాలకు మంచి పేరు వచ్చింది. దేశంలోనే అత్యుత్యమ బాలికల పాఠశాలగా గుర్తింపు పొందింది.1947లో స్వాతంత్య్రం వచ్చాక జైపూర్, మరో 18 సంస్థానాలు కలిసి రాజస్థాన్‌ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. జైపూర్‌ రాజధాని అయింది. ఆమె భర్త రాష్ట్ర గవర్నర్‌ అయ్యారు. అయితే అధికారాలన్నిటినీ కాంగ్రెస్‌ తన చేతుల్లోనే ఉంచుకుంది. ఆ పరిస్థితుల్లోనే గాయత్రీదేవి స్వతంత్రపార్టీలో చేరారు.1970లో ప్రభుత్వం సంస్థానాలను పూర్తిగా రద్దు చేసింది. గాయత్రీదేవి, అమె భర్త కొన్నాళ్లు ఇంగ్లండ్‌లో గడిపారు. అక్కడ ఉన్నప్పుడే మాన్‌ సింగ్‌ పోలో ఆటకు అంపైరింగ్‌ చేస్తూ కుప్పకూలి, మరణించారు. అనంతరం ఆయన మొదటి భార్య పెద్ద కొడుకు భవానీసింగ్‌ మహారాజుగా తండ్రి బాధ్యతలను స్వీకరించారు. గాయత్రీదేవి రాజమాత అయ్యారు.

ఆవిడ ఆ శోకంలో ఉండగానే ప్రజల అభీష్టం మేరకు మూడోసారి పార్లమెంటుకు పోటీ చేయవలసి వచ్చింది.1975 ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నప్పుడు గాయత్రీదేవి ఆరోగ్యం బాగా క్షీణించింది. మొదట ఆసుపత్రికి తరలించి, తర్వాత పెరోల్‌పై (సత్పవర్తన కలిగి ఉంటాననే హామీపై!) ఆమెను విడుదల చేశారు.ఆ తర్వాతి రెండున్నర దశాబ్దాలు గాయత్రీదేవి జీవితం ఒక రాజపుత్ర వితంతువు జీవితంలా నిస్సారంగా, నిరర్థకంగా గడవలేదు.

ప్రపంచమంతటా పర్యటించారు. వేసవి కాలాలను ఇంగ్లండ్‌లో తాను చదువుకున్న మంకీ క్లబ్‌ పాఠశాల ఉన్న ప్రాంతమైన నైట్స్‌బ్రిడ్స్‌లో; శీతాకాలాలను జైపూర్‌లో తమ ఇద్దరి కోసమే తన భర్త కట్టించిన లిలీపూల్‌ సౌధంలో ప్రశాంతంగా, నిరాడంబరంగా గడిపారు. 1980లలో ‘ప్రిన్సెస్‌ రిమెంబర్స్‌’ అనే పేరుతో ఆమె ఆత్మకథ ఇంగ్లండ్‌లో వెలువడింది. తొంభై ఏళ్ల వయసులో 2009లో ఆమె ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. 1943లో ఈ అసమాన సౌందర్యవతి ఫొటోలను సెసిల్‌ బీటన్‌ అనే ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్‌ ప్రత్యేకంగా షూట్‌ చేశారు. ఇప్పటికీ ఆ ఫొటోలు దేశ విదేశాల్లోని ఆర్ట్‌ గ్యాలరీల్లో ఎక్కడో ఒకచోట నిరంతరం దర్శనం ఇస్తూనే ఉంటాయి.

ప్రేమ.. పెళ్లి.. జైలు
గాయత్రికి పదమూడేళ్ల వయసులోనే మాన్‌సింగ్‌ ఆమె మనసులో పడిపోయాడు! అప్పుడతడికి 21 ఏళ్లు. అందగాడు, సంపన్నుడు. మంచి ‘పోలో’ ఆటగాడు. జైపూర్‌ జట్టులో మాన్‌సింగ్‌ ఉన్నాడంటే గెలుపు అన్న మాటనే ప్రత్యర్థులు మర్చిపోవాలి. ఆటతో పాటు అతడినీ ఇష్టపడింది గాయత్రి. ఎనిమిదేళ పాటు వీళ్ల మధ్య ప్రేమ నడిచింది. అమె 21వ ఏట పెళ్లి జరిగింది. అప్పటికే మాన్‌సింగ్‌కి రెండు పెళ్లిళ్లు! అయినా సరే, మూడో భార్యగా అతడి చెయ్యి అందుకుంది. అదీ రహస్యంగా, ఆ తర్వాత అధికారికంగా. ఇటు కూచ్‌ బెహర్‌ సంస్థానంలో, అటు జైపూర్‌ సంస్థానాల్లో పెద్ద సంచలనం! అయితే ఈ సంచలనం మహారాణీ గాయత్రీదేవి జీవితంలో చాలా చిన్నది.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక పార్లమెంటుకు పోటీ చేసిన తొలి రాకుమారిగా గాయత్రీ దేవి కలకలం రేపారు. 1962 ఎన్నికల్లో  కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ‘స్వతంత్ర పార్టీ’ తరఫున  జైపూర్‌ నుంచి నిలబడి 1,92,909 ఓట్లు గెలుచుకుని (పోలైన 2,46,516 ఓట్లలో) గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కారు! తిరిగి 67 ఎన్నికల్లోనూ, 71 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఎమర్జెన్సీ సమయంలో ఐదు నెలలపాటు తీహార్‌ జైల్లో ఉన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వమే ఆమెపై కక్ష కట్టి జైపూర్‌ పన్ను చెల్లింపులు సరిగా లేవన్న అబద్ధపు నేరారోపణలతో ఆమెను జైలుపాలు చేసింది.

గాయత్రి ఘన విజయం
ఏడు విడతల పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు విడతలు పూర్తయ్యాయి. గత సోమవారం జరిగిన నాలుగో విడత ఎన్నికల్లో రాజస్థాన్‌లోని పదమూడు నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది. ఆ రాష్ట్రంలోని మిగిలిన పన్నెండు స్థానాలకు ఐదవ విడత ఎన్నికల్లో భాగంగా నేడు సోమవారం (మే 6) పోలింగ్‌ జరుగుతోంది. ఆ పన్నెండు స్థానాల్లో ఒకటైన జైపూర్‌.. సార్వత్రిక ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ.. మహారాణి గాయత్రీదేవిని, ఆమె సాధించిన ఘనతను గుర్తు చేస్తూనే ఉంటుంది. రాజస్థాన్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికైన తొలి మహిళ గాయత్రీదేవి. ‘స్వతంత్రపార్టీ’ తరఫున వరుసగా మూడుసార్లు (1962, 1967, 1971) ఆమె గెలిచారు. తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే మొత్తం పోలైన ఓట్లలో 78 శాతం ఓట్లు సాధించి ‘గిన్నిస్‌ బుక్‌’లోకి ఎక్కారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement